Wednesday, October 12, 2016

బ్లాగర్ నుండి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా....
Feeling Happy and Proud today . Received the membership card from Hyderabad Press Club as a Freelance Journalist and Web Magazine Editor....

Thanks to the Friend who has encouraged, supported and guided me through this process...


విజయదశమి సందర్భంగా లభించిన మరో విజయం.. కలలో కూడా ఊహించనిది.. ఇంకా నమ్మశక్యం కాకుండా ఉన్నది.


నాకు నచ్చిన అంశాలమీద గత పదేళ్లుగా వివిధ పత్రికల్లో రాసాను, రాస్తూ ఉన్నాను. నచ్చి, మెచ్చినవారు మరింత ప్రోత్సహించారు. నేను రాయగలను అన్న నమ్మకంతో వాళ్లే మాకు ఇది కావాలని నాచే రాయించారు ...
ఒక వృత్తి ... ఒక ప్రవృత్తి...... ఉద్యోగంలా కాకుండా ఫ్రీలాన్సింగ్ గా(దీనికి తెలుగు పదం అడక్కండి) రాస్తున్న నాకు నువ్వు నిజంగా జర్నలిస్టువే అన్నారు. ఇవాళ ఆ మాటకు ఒక గుర్తింపు కార్డును కూడా ఇచ్చారు.


స్టోరీ సోదిలా ఉందా... అర్ధం కావట్లేదు.. సరే కట్టె, కొట్టే పద్ధతిలో చెప్పేస్తా.. (కాస్త బిల్డప్ ఇవ్వొద్దేంటి?)


ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్టుగానే కాక మాలిక వెబ్ పత్రిక సంపాదకురాలిగా హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో మెంబర్ షిప్ కార్డును ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ రాజమౌళిచారిగారినుండి అందుకున్న శుభవేళ... ఇప్పుడు మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి, రాయాలన్నమాట.. ...


ఇక నేను బండి కొనుక్కుని ప్రెస్ అన్న స్టిక్కర్ పెట్టుకోవచ్చు.. . కార్ ఉందిగాని అది నాది కాదుగా... కాని ముందుగా ఒక స్టిక్కర్, హెల్మెట్ కొనేసుకుంటా. వాటిని చూస్తూ ఉంటే బండి కొనాలన్న సంకల్పం నీరుకారిపోకుండా ఇంకా ధృడంగా మారాలన్నమాట.. :)


బ్లాగర్ గా, ఎడిటర్ గా, రైటర్ గా, కుకరీ కన్సల్టెంటుగా, కాలమ్నిస్టుగా.. ఇలా ఎన్నో పాత్రలు ధరించి విజయం సాధించినా. అన్నింటికన్నా ప్రియమైనది, అందమైనది.....

అమ్మమ్మ పాత్ర..

Saturday, October 8, 2016

మాలిక పత్రిక అక్టోబర్ 2016 సంచిక విడుదల

Jyothivalaboju

Chief Editor and Content Head

పాఠకులందరికీ దసరా , దీపావళి శుభాకాంక్షలు..

ఆసక్తికరమైన కథలు, సీరియళ్లు, వ్యాసాలతో, విభిన్నమైన కథాంశాలతో మిమ్మల్ని అలరిస్తున్న మాలిక పత్రిక అక్టోబర్ సంచిక మీ ముందుకు వచ్చింది.. సంగీతం,సాహిత్యం, ఆధ్యాత్మికం, సస్పెన్స్ మొదలైన ఎన్నో అంశాలు ఈ సంచికలో మీకు లభిస్తాయి..
ప్రమదాక్షరి కథామాలిక పేరిట స్నేహం శీర్షికన వచ్చిన కథలను, వాటిగురించిన విశ్లేషణనను తప్పకుండా చదవగలరు.

మీ రచనలను మాకు పంపవలసిన చిరునామా: editor@maalika.org

 1. అనసూయ
 2. తరగని సిరి
 3. స్నేహాన్ని  పెంచుకునే మార్గం
 4. బ్రహ్మలిఖితం - 2
 5. మాయానగరం - 30
 6. అద్దె గర్భం (సరోగసి)  
 7. Gausips - ఎగిరే కెరటం 7
 8. జీవితం ఇలా కూడా ఉంటుందా? - 6 
 9. శ్రీ కృష్ణ దేవరాయలు - 6 
10. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి - 8
11. పోరనట్టి ఆలిగలదే
12. మాయామాళవగౌళ రాగ లక్షణములు
13. లింగ పురాణము 
14. రాయినైనా కాకపోతిని
15.  వేద వాజ్మయము
16. అనగనగా ఒక రాజు
17. నేను అమ్మనయ్యాను
18. కాలం మారిందా?
19. అమ్మా, నాన్న ఒక బాబు
20. ఏకలవ్య 2016
21. ఎఱ్ఱమందారం 
22. వీడెవడండీ బాబూ 
23. ఆమె 
24. ఒక మొక్క నాటండి
 Friday, September 23, 2016

నట్టింటి నుంచి నెట్టింట్లోకి - నవతెలంగాణ

 

ఇల్లలుకుతూ అలుకుతూ తన పేరు మరిచిపోయిందంట ఈగ. నేను కూడా అదే విధంగా చదువు, సంధ్య ఏమీ లేదు. నాకేమీ రాదు. భర్త, పిల్లలు, ఇల్లు ఇదే నా జీవితం. ఇంతకంటే ఏం చేయగలనులే అంటూ, అనుకుంటూ సాధారణంగా గడిపాను. కాని పదేళ్ల క్రితం మొదలుపెట్టి, క్రమంగా ఊహించని ఎన్నో మలుపులు తిరిగిన నా జీవితంలో నా పేరును ఎన్నో హంగులతో కనుగొనగలిగాను.
మరి నా ఈ జీవనపయనపు ముచ్చట్లను మరోసారి చదువుతారా??


 


Monday, September 19, 2016

ఏ లడ్డూ కావాలి బాబూ..? ఈనాడుఒక్కోసారి అతిథులు వచ్చినప్పుడు పెడదామంటే ఇంట్లో ఏమీ ఉండవు. లేదూ మనకే ఉన్నట్టుండి ఏదైనా తీపి తినాలనిపిస్తుంటుంది. అలాంటప్పుడు చాలా తేలిగ్గా అప్పటికప్పుడు చేసుకోగలిగే రుచికరమైన లడ్డూలు మీకోసం...


రోజ్‌ కొబ్బరి లడ్డూ
కావలసినవి
ఎండుకొబ్బరిపొడి: 2 కప్పులు, కండెన్స్‌డ్‌మిల్క్‌: అరకప్పు, రోజ్‌సిరప్‌: టీస్పూను, యాలకులపొడి: అరటీస్పూను, నెయ్యి: 3 టీస్పూన్లు
తయారుచేసే విధానం
* పాన్‌లో నెయ్యి వేసి వేడిగా అయ్యాక కొబ్బరిపొడి, కండెన్స్‌డ్‌మిల్క్‌, రోజ్‌ సిరప్‌, యాలకులపొడి వేసి కలుపుతూ చిన్న మంటమీద ఉడికించాలి. మిశ్రమం మొత్తం ఉడికి ముద్దగా అయ్యాక దించి చల్లారనివ్వాలి.
* మిశ్రమం గోరువెచ్చగా ఉండగానే చిన్న చిన్న లడ్డూల్లా చేసుకుని కొబ్బరిపొడిలో దొర్లించి ఆరనివ్వాలి. పూర్తిగా చల్లారాక ఫ్రిజ్‌లో పెడితే త్వరగా గట్టిపడతాయి. లేదా గాలికి పూర్తిగా ఆరాక డబ్బాలో పెట్టి నిల్వ చేయాలి.


ఓట్స్‌ డ్రైఫ్రూట్‌ లడ్డూ
కావలసినవి
ఓట్స్‌: కప్పు, జీడిపప్పు, బాదం, పిస్తా: పావుకప్పు చొప్పున, వాల్‌నట్స్‌: 5, ఎండు అంజీరాలు: 8, ఖర్జూరం: 12, నువ్వులు: 2 టేబుల్‌స్పూన్లు, అవిసెగింజలు: 2 టేబుల్‌స్పూన్లు, యాలకులపొడి: అరటీస్పూను, బెల్లంతురుము: రుచికి సరిపడా, నెయ్యి: తగినంత
తయారుచేసే విధానం
* ఎండుఅంజీరాలు, ఖర్జూరాలు ముక్కలుగా చేయాలి. ఓట్స్‌ రెండు నిమిషాలు వేయించాలి. అవిసెగింజలు, నువ్వులు, జీడిపప్పు, బాదం, పిస్తా, వాల్‌నట్స్‌ అన్నీ విడివిడిగా ఓ నిమిషం వేయించాలి. మిక్సీలో అన్నీ విడివిడిగా పొడి చేసి తీయాలి. బెల్లంతురుము కూడా పొడి చేసి అన్నీ కలిపి పాన్‌లో వేసి మూడు నాలుగు నిమిషాలు సిమ్‌లో వేయించాలి. యాలకులపొడి కలిపి దించి ఆరాక నెయ్యి అద్దుతూ లడ్డూలు చుట్టాలి.


బిస్కెట్లతో...
కావలసినవి
మ్యారీ బిస్కెట్లు: 10, బెల్లం తురుము: ముప్పావు కప్పు, యాలకులపొడి: టీస్పూను, నెయ్యి: 3 టీస్పూన్లు
తయారుచేసే విధానం
* మ్యారీ బిస్కెట్లను మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. అలాగే బెల్లం కూడా పొడి చేసుకోవాలి.
* ఓ గిన్నెలో బిస్కెట్ల పొడి, బెల్లం పొడి, యాలకులపొడి, కరిగించిన నెయ్యి వేసి కలిపి కావాల్సిన సైజులో ఉండల్లా చుట్టుకోవాలి. నెయ్యి ఇష్టం లేకపోతే ఒట్టి బెల్లం తురుముతో కూడా లడ్డూలు చేయవచ్చు.


పాప్‌కార్న్‌తో...
కావలసినవి
మొక్కజొన్న గింజలు: కప్పు, బెల్లంతురుము: ముప్పావుకప్పు, యాలకులపొడి: టీస్పూను, నెయ్యి: 3 టీస్పూన్లు
తయారుచేసే విధానం
* మందపాటి గిన్నె లేదా కుక్కర్‌ గిన్నె వేడిచేసి అందులో కాస్త నూనె వేసి మొక్కజొన్న గింజలు వేసి మూతపెట్టి పాప్‌కార్న్‌ చేసుకోవాలి. లేదంటే విడిగా ఉప్పు వేయని పాప్‌కార్న్‌ తెచ్చుకుని కూడా చేసుకోవచ్చు.
* ఇప్పుడు పాప్‌కార్న్‌ను మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా రవ్వలా చేయాలి.
* బాణలిలో బెల్లంతురుము, పావు కప్పు నీళ్లు పోసి మరిగించి ముదురుపాకం రాగానే నెయ్యి, యాలకులపొడి, పాప్‌కార్న్‌ రవ్వ వేసి బాగా కలియతిప్పి దించాలి. ఇది వేడిగా ఉండగానే ఉండలు చుట్టాలి. చల్లారాక డబ్బాలో పెడితే వారం రోజులవరకూ నిల్వ ఉంటాయి.


పల్లీ ఖర్జూరం లడ్డూ
కావలసినవి
ఖర్జూరం: కప్పు, పల్లీలు: కప్పు, యాలకులపొడి: అరటీస్పూను, నెయ్యి: 3 టీస్పూన్లు
తయారుచేసే విధానం
* పల్లీలను దోరగా వేయించాలి. చల్లారిన తరవాత పొట్టు తీసి బరకగా పొడి చేసుకోవాలి.
* ఖర్జూరాల్ని చిన్న ముక్కలుగా చేసి గ్రైండర్లో వేసి సన్నగా పొడి చేయాలి. పల్లీల పొడిలో ఈ ఖర్జూరం పొడి, యాలకులపొడి, నెయ్యి వేసి బాగా కలిపి కావాల్సిన సైజులో ఉండలు చేసుకోవాలి. ఇందులో పల్లీలకు బదులు జీడిపప్పు, బాదం, పిస్తా, అక్రోటు, కిస్‌మిస్‌... వంటి నట్స్‌ను కూడా చిన్నముక్కలుగా చేసి వేసుకోవచ్చు.


పుట్నాలపప్పుతో...
కావలసినవి
పుట్నాలపప్పు: కప్పు, పంచదార: కప్పు, యాలకులపొడి: అరటీస్పూను, నెయ్యి: ముప్పావుకప్పు, జీడిపప్పు: అరకప్పు
తయారుచేసే విధానం
* పుట్నాలపప్పుని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. పంచదార కూడా మెత్తగా పొడి చేయాలి. జీడిపప్పును చిన్న పలుకులుగా చేసి నేతిలో వేయించాలి. పుట్నాలపొడిలో పంచదార పొడి, యాలకులపొడి, జీడిపప్పు పలుకులు వేసి బాగా కలపాలి. ఇప్పుడు కరిగించిన నెయ్యి పోస్తూ ఉండలు చేసుకోవాలి.


- జ్యోతి వలబోజు ...
హైదరాబాద్‌
 18-9-2016

Wednesday, September 14, 2016

అప్పుడే పదేళ్లయిందా?? Congratulations and Celebrations JYOTHI…మీకో సంగతి చెప్పనా? నాకు ప్రతీ సంవత్సరం అన్ని పండగలకంటే డిసెంబర్, సెప్టెంబర్ నెలలంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటారా? డిసెంబర్ లో నా పుట్టినరోజు. సెప్టెంబర్ లో నా JYOTHI 10 పుట్టినరోజు. 


అదేంటి డిసెంబర్ పుట్టినరోజు సంగతి తెలుసు మరి ఈ JYOTHI ఎవరూ అనుకుంటున్నారా.. ఒకటి నేను ప్రాణం పోసుకుని ఈ లోకంలోకి వచ్చినరోజు.. ఇంకోటి నాలోని భావాలు, ఆలోచనలు, సంఘర్షణలు అన్నీ అక్షరరూపంగా దాచుకోవడం మొదలుపెట్టి, నేర్చుకుంటూ, నేర్చుకుంటూ, ఇంకా నేర్చుకుంటూనే ఉన్న నా బ్లాగు పుట్టినరోజు. ఓసోస్ బ్లాగు పుట్టినరోజుకే ఇంత సీన్ , సినిమా ఉందా అంటారా?? చాలా ఉంది.  సాధారణ గృహిణిగా ( ఈ మాటంటే కోప్పడతారు మా మిత్రులు నారాయణస్వామిగారు) జాలప్రవేశం చేసి ఈనాడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం గొప్ప కాదేంటి.. అంతేకాక వ్యక్తిగతంగా కూడా చాలా నేర్చుకుని, మారాను.. ఒకప్పుడు ఎంతో బేలగా, ప్రతీదానికి భయపడుతూ ఉండేదాన్ని. కాని ఇప్పుడు ఒక రాక్షసిలా మారా..  పని రాక్షసి అని పేరు తెచ్చుకున్నా. నాకు చాలా ఇష్టమైన గుర్తింపు ఇది..


కష్టాలు -  సుఖాలు, సంతోషం – దుఃఖం, పోరాటాలు – ఆరాటాలు, ఓటమి – గెలుపు  ప్రతీ మనిషికి అనుభవమే. విజయాలెప్పుడూ కొందరి సొంతం కాదు. నిజాయితీగా కష్టపడితే విజయం ముంగిట వాలుతుంది. కాని మనం అనుకున్నప్పుడే రాదు. కష్టాల ఆటుపోట్లతో రాటుదేలి మొండిగా తిరగబడి పనిచేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. కష్టం విలువ తెలిస్తేనే కదా సుఖం యొక్క ఆనందాన్ని సంపూర్ణంగా అనుభవించగలుగుతాం.. 
ఈ సంతోష సమయంలో ఈ మెట్టవేదాంతం ఎందుకు అనుకుంటున్నారా? పదేళ్ల క్రితం జ్యోతికి ఇప్పటి జ్యోతివలబోజుకు అస్సలు పోలిక లేదు. అప్పుడు తను ఒకరి కూతురు, ఒకరి భార్య, ఒకరి అమ్మగానే అందరికీ తెలుసు కాని ఇప్పుడు ??? పిల్లలకోసం అంతర్జాలాన్ని పరిచయం చేసుకుని , నాకిష్టమైన సంగీతం, సాహిత్యం అన్నింటికి మించి వంటలగురించి తెలియని విశేషాలు తెలుసుకుంటూ సాగిన పయనం నేటికి పది వత్సరాలు పూర్తి చేసుకుంది. నిజంగా నేను అంతర్జాలానికి ఎందుకు వచ్చానో కాని ఇలా కలలో కూడా ఆలోచించడానికి సాహసం చేయని సంఘటనలు, పరిచయాలు కలుగుతున్నాయి. చెప్పాలంటే నా గురించి చెప్పుకుంటే ఏమీ లేదు .. జీరో... చదువు లేదు, డబ్బు లేదు, ఫ్రెండ్స్ లేరు, సోషల్ సర్కిల్ లేదు. ఏధైనా చేయడానికి టాలెంట్ లేదు వంట కూడా సరిగా రాదు (ఇప్పటికీ మావారి అభిప్రాయం ఇదే). నాకున్న ప్రపంచం నాలుగుగోడల ఇల్లు, భర్త, పిల్లలు, వాళ్ల బాధ్యత మాత్రమే. అంతకంటే ఎక్కువ ఏమీ చేయలేనుగాక చేయలేను అని నిర్ణయించేసుకున్నాన్నమాట. వార పత్రికలు, సీరియళ్లు, కుట్లు అల్లికలు, ఇంతే జీవితం. కొన్నేళ్లైతే పిల్లలు, వాళ్లు పిల్లలను చూసుకోవడం తప్ప ఇంకేమీ లేదు అనుకునేదాన్ని. 


కాని ఆ  పైవాడు అలా అనుకోలేదు. నాకంటూ ఒక రాత రాసిపెట్టాడు. దానికంటే ముందు కొన్ని కాదు చాలా పరీక్షలు పెట్టాడు. చావు తప్ప గత్యంతరం లేదు అన్న స్టేజ్ కు తీసుకువెళ్లాడు. ఆ తర్వాతే నా పయనాన్ని మార్చాడు.  ఒకప్పుడు అసాధ్యం, అసంభవం అనుకున్నవి ఒకటొకటి నాకు సుసాధ్యం చేసాడు. నిజంగా ఇది నా నమ్మకం.. ఆనాటి జ్యోతికి చెప్పుకోవడానికి ఏమీ లేదు. కాని ఈనాటి జ్యోతి వలబోజుకు చెప్పడానికి ఒక పదం సరిపోవడం లేదు. ఇది అతిశయోక్తి, సొంతడబ్బా కాదండి. ఈ మధ్య కొందరు మిత్రులు మీరేం చేస్తారు, మీ పేరు పక్కన ఏమని రాయాలి? బ్లాగర్, రైటర్, ఫుడ్ కాలమ్నిస్ట్, ఎడిటర్, కుక్ బుక్ ఆథర్, పబ్లిషర్ .. ఏదని రాయము అన్నారు. జస్ట్ జ్యోతి వలబోజు చాలని చెప్తున్నాను.. 


ఎన్నో చెప్పాలని ఉంది. అదేంటోగాని నాకు జ్ఞాపకశక్తి చాలా ఎక్కువే అనుకుంటా. చాలా విషయాలు ఎప్పటికీ గుర్తుంటాయి.. ఇక నా జీవితం గురించి చేసిన ఈ  పోరాటంలో జరిగిన ఎన్నో విషయాలు అస్సలంటే అస్సలు మర్చిపోలేదు.  అవన్నీ రాయాలంటే ఓ నవల తయారవుతుంది. ఆ సోదంతా వద్దుగాని..  


 నేను నాటినుండి నేటివరకు ఇన్నివిధాలుగా ఎదగడానికి నన్ను ప్రోత్సహించి, సహాయపడిన ఎందరో మహానుభావులకు మనఃపూర్వక వందనాలు. బ్లాగుల్లో, ఫేస్ బుక్కులో , మీడియాలో, పబ్లిషింగ్ రంగంలో ఎంతో తోడ్పాటునిచ్చినవారందరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. అలాగే నా మీద ఈర్ష్య, కోపంతో విమర్శించినవాళ్లకు కూడా థాంక్స్.. తాత్కాలికంగా బాధ కలిగిన మరింత కసిగా ముందుకు సాగడానికి దోహదపడ్డారు కదా... ఈ పబ్లిషింగ్ వల్ల కూడా మంచి పేరు లభించింది... గొప్పగొప్పవాళ్ల  పరిచయాలు కలిగాయి.. మంచి పుస్తకాల ప్రచురణ చేయడం చాలా సంతృప్తిగా ఉంది.. ఎంతోమంది ప్రముఖ రచయితల పుస్తకాలు అచ్చువేయడం. వంగూరి వారి ప్రచురణల బాధ్యత, వంశీ ఇంటర్నేషనల్ కోసం కూడా వర్క్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. 


ఏ సమయమైనా నేను పిలవగానే, అడగగానే సలహాలిచ్చి, సాంత్వననిచ్చే ఆత్మీయ మిత్రులు నాకు అంతర్జాలం ద్వారానే లభించడం ఒక వరం.. 


ఎన్ని విజయాలు, అభినందనలు వచ్చినా నన్ను నన్నుగా నిలబెట్టిన నా బ్లాగు జ్యోతి ఎప్పటికీ ఋణపడి ఉంటాను. నా పుట్టినరోజుతో పాటు నా బ్లాగు పుట్టినరోజు కూడా నాకు చాలా ముఖ్యమైనది... నా బ్లాగు సుందరి జ్యోతినన్ను నేను పరిశీలించుకుని, విమర్శించుకుని, విశ్లేషించుకునేలా చేసి ఆ భావాలను అక్షరాలలో నిక్షిప్తం చేసుకునేలా చేసింది. ఎన్నో అందమైన భావాలకు నిలయమైంది. వివిధ సందర్భాలలో నా సంఘర్షణ, నా స్పందన అన్నీ తనలో దాచుకుంది. అప్పుడప్పుడు నాలోని వేదనకు, ప్రశ్నలకు చర్చావేదికగా మారింది.. నాకు నచ్చిన పాటలతో సరాగాలాడింది. పద్యాల ఆటలాడింది. బొమ్మలతో మాటలాడింది. భక్తిసాగరంలో ఓలలాడించింది.. నాకంటూ ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకుని ఆ దిశగా ప్రణాళికాబద్ధంగా అడుగులేసేలా చేసింది నా బ్లాగు.. అందుకే నిరంతరం నన్ను నేను నా బ్లాగులో చూసుకుంటూ ఉంటాను....


Happy 10th Anniversary JYOTHI…. 


మరో ముఖ్య విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దాదాపు పది సంవత్సరాలుగా వివిధ  పత్రికల్లో(వార్త, చినుకు తప్ప) వ్యాసాలు, వంటలు, కవర్ స్టోరీలు  రాస్తూ ఉన్నాను. అంతేకాక అంతర్జాల పత్రిక సంపాదకురాలిగా  ప్రెస్ క్లబ్ అప్ హైదరాబాదులో ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా మెంబర్ షిప్ వచ్చింది..(అంటే నాకంటూ ఒక బండి కొనుక్కుంటే PRESS అన్న స్టిక్కర్ పెట్టుకోవచ్చన్నమాట..భలే ఉంటుంది కదా )


మరో అద్భుతాన్ని త్వరలో పంచుకుంటాను..
Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008