Friday 9 November 2007

జీవన మాధుర్యం

ఓ విజయం ఆత్మవిశ్వాసానికి పునాది
ఓ పరాజయం ఆత్మన్యూనతకి ఆరంభం !
ఓ అవమానం ఆత్మగౌరవానికి చెంప పెట్టు
ఓ గౌరవం అణకువను నిద్రలేపుతుంది
ఓ తప్పిదం ఆత్మపరిశీలనకు దారితీస్తుంది
కొంత ప్రేమ ద్వేషాన్ని హరిస్తుంది
కొంత ఆరాధన ప్రేమని వుసి గొల్పుతుంది
ఆవేశం విజ్ఞతని మింగేస్తుంది.
అహంకారం జ్ఞానచక్షువులను అంధకారం చేస్తుంది
అందం ఆనందాన్నిస్తుంది.
శృంగారం కోరికల్ని రెచ్చగొడుతుంది
స్నేహం హితవుని కోరుతుంది
వైరం పతనాన్ని ఆశిస్తుంది
విద్య వినయాన్ని నేర్పుతుంది.
విజ్ఞానం అన్వేషించాలన్న తృష్ణ రగిలిస్తుంది
లౌక్యం వ్యవహార జ్ఞానం అందిస్తుంది
మంచితనం సమాజాన్ని చేరువ చేస్తుంది
చేతగానితనం సమాజానికి లోకువ చేస్తుంది
మానవత్వం ఆత్మీయతను పెంచుతుంది
ఆదరణ అతిథుల మనసుల్ని మైమరిపిస్తుంది
అసూయ మనల్ని దహించివేస్తుంది
స్వీయ సానుభూతి లోపాలని కప్పిపెడుతుంది.
మూర్ఖత్వం వ్యక్తిత్వాన్ని పలుచన చేస్తుంది
పట్టుదల విజయాన్ని చేరువ చేస్తుంది
మొండితనం మనల్ని ఒంటరిని చేస్తుంది
చిరునవ్వు స్నేహాన్ని కోరుతుంది
చిటపటలు విరోధానికి ఆనవాళ్ళు
భయం ఆత్మరక్షణని కోరుతుంది
ధైర్యం ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపజేస్తుంది
కోరిక విచక్షణని చంపేస్తుంది
అనుమానం వాస్తవాన్ని విస్మరిస్తుంది
సంశయం అనిశ్చితని పెంచుతుంది
అత్యాశ విరోధులను పెంచుతుంది
పతనం పయనం మళ్ళీ విజయం వైపే…!

ఇదంతా జీవన చట్రం ! ప్రతీ అనుభవం ఉద్వేగాలను రగిలించేదే..
ప్రతీ అనుభవం కొన్నాళ్ళకు కాలగర్భంలో కలిసిపోయి ఉద్వేగాలను చల్లార్చేదే !

ఇన్ని వినూత్నమైన పార్శ్యాలు లేకపోతే మానవ జీవితంలో మాధుర్యమేముంటుంది?
సృష్టికర్త అద్భుతసృష్టికి మానవ జీవితాన్ని మించిన కళాఖండం ఏముంటుంది…

అందుకే జీవితాన్ని మనసారా జీవిద్దాం..

మీ
నల్లమోతు శ్రీధర్

1 వ్యాఖ్యలు:

Unknown

చాలా బాగుంది ధన్యవాదాలు.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008