Saturday 26 January 2008

పేపర్ కటింగ్స్ .. మళ్ళీ మళ్ళీ పలకరించే స్మృతులు...

DSC00048 ముప్పై ఐదేళ్ల క్రిందటి పేపర్ కటింగ్స్ తో బైండ్ చేసి పెట్టుకున్న పుస్తకం. నా అపురూపమైన ఖజానా

 

కొన్ని పదార్థాలు వేడివేడిగా వున్నప్పుడు తింటేనే మజాగా ఉంటుంది. వార్తలూ అంతే ! ఒక రకంగా చెప్పాలంటే న్యూస్ పేపర్ అనేది వేడి వేడి పకోడీలుంచిన ప్లేటు వంటిదన్నమాట. టీయో , కాఫీయో ఒక చేత్తో పట్టుకుని మరోచేత్తో పేపర్ చదువుతూ దినచర్య మొదలెట్టేవారు కోకొల్లలు. ముందుగా ముఖ్య వార్తలు, సంచలన వార్తలు, సినిమా, స్పోర్ట్స్ చదివేసి తర్వాత తీరిగ్గా మొదటి పేజీ నుండి చివర్లో ఇచ్చే సంతాప సందేశాలు కూడా చదవితే గాని పేపర్ చదివిన తృప్తి ఉండదు.

కాని పత్రికల్లో ఒక్క న్యూసే ఉండదు. వ్యాఖ్యలు, వార్తల వెనుక అసలు సిసలు కథలు, వివిధ అంశాలపై ఆయా రంగాల్లో నిపుణులైన వారి విశ్లేషణలు, అపురూపమైన ఫోటోలు, రాజకీయాలపై గిలిగింతలు పెట్టే కార్టూన్లు, ప్రభావితం చేసే సంపాదకీయాలు, ఇలా ఎన్నో విషయాలు నిండిన దినపత్రికలు పుష్పక విమానాలు. పూలు సాయంత్రానికి వాడిపోవచ్చు. కాని మన మనసుని దోచుకున్న వాటి పరిమళం అంత త్వరగా మనల్ని వీడిపోదు. అలాగే ఒక పత్రిక జీవితం ఒక్కరోజైనా, నలిగిపోయి జీవం కోల్పోయినా కూడ మనల్ని మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకుని , దాచుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి. వార్తా పత్రికల్లో వచ్చే అనేక ఆసక్తికరమైన విషయాల్ని అలా చదివేసే వదిలేయకుండా, అవసరమైనపుడు మళ్ళీ రిఫర్ చేసుకోవాలనుకున్నపుడు వాటిని కత్తిరించి దాచుకోవాలి.

DSC00046
జూన్ 2001లో నేపాల్ యువరాజు  చేసిన మారణహోమం

పత్రికల్లో వచ్చే వివిధ విషయాలు, అవసరమనిపించినవి సంక్షిప్తంగా డైరీలో రాసుకోవడం కొందరి అలవాటు. కొన్ని అంశాలు మొత్తంగానే భవిష్యత్తులో ఉపయోగపడేవి కావచ్చు. అన్నీ రాసుకోవడం అయ్యే పని కాదు. ఇలాంటి సంధర్భాల్లో నచ్చిన అంశాన్ని కట్ చేసి దాచుకోవడం ఒక్కటే దారి. "అవుటాఫ్ సైట్ , అవుటాఫ్ మైండ్" అన్నారు కదా! ఒకసారి మనకి నచ్చిన సంగతుల్ని భద్రపరచుకోవడానికి బద్ధకిస్తే, ఆ విషయాలు మర్చిపోతాము. మళ్ళీ అదే విషయాలు పొందడానికి చాలా కష్టపడాల్సొస్తుంది. ప్రతీ దానికి మార్కెట్ కెళ్ళి పుస్తకాలు వెతికి కొనలేము కదా!.

కొంతమంది మరీ ముఖ్యమనుకున్న విషయాల్ని ఫోటోకాపీ చేసి పెట్టుకుంటారు. కొంతమంది కటింగ్స్ ని పుస్తకాలుగా కుట్టి దాస్తారు. కొందరు ఫైల్ చేస్తారు. కొందరు తెల్లకాగితాలపై ఈ కటింగ్స్ ని అతికించి బుక్స్ గా చేసుకుంటారు. పేపర్ కటింగ్స్ సేకరించే హాబీ, మానసికానందాన్నే కాక మానసిక వికాసానికి దోహదం చేస్త్తుంది. పిల్లలకు ఈ అలవాటు చేయడం వల్ల వారికి ప్రోజెక్ట్ వర్క్స్ కోసం, పోటీ పరీక్షలకు పనికొచ్చే ఎన్నో విషయాలు తెలుస్తాయి. దీని వల్ల పిల్లల్లో విషయసేకరణ, వ్యక్తీకరణ, అలవడుతుంది. ఏళ్ళ తరబడి ఈ కటింగ్స్ ని సేకరించగలిగితే , ఒక మినీ లైబ్రరీ మన చెంత ఉన్నట్టే. ఏ విషయం మీదైనా సమగ్రంగా మాట్లాడాలన్నా, రాయాలన్నా, ఇవి ఎంతో ఉపయోగపడతాయి.

 

DSC00043 2001సెప్టెంబరు 11 న అమెరికాపై జరిగిన దాడి...

ఒకప్పుడు ఆంగ్లపత్రికల్లో ముఖ్యంగా ఆగిపోయిన ఇలస్ట్రేటెడ్ వీక్లీ లాంటి పత్రికల్లో ఎన్నో అపురూపమైన వ్యాసాలు, ఫోటొలు వచ్చేవి. అయితే పత్రికా ప్రచురణలో ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న సాంకేతికాభివృద్ధి కారణంగా తెలుగు పత్రికల్లో సైతం ఎన్నో ఉపయుక్తమైన వ్యాసాలు, ఫోటోలు వస్తున్నాయి. వీటిని భద్రపరుచుకుని, అప్పుడప్పుడు చూసుకుంటుంటే చాలా థ్రిల్లింగ్‍గా ఉంటుంది. కోన్నేళ్ల తర్వాత ఈ పేపర్ కటింగ్స్ ని తిరగేస్తుంటే పాతమిత్రుల్ని అనుకోకుండా కలిసినంత ఆనందంగా ఉంటుంది. నాకూ ఈ అలవాటు చిన్నప్పటినుండి ఉంది. మంచి వ్యాసాలు, వంటలు, కుట్లు అల్లికలు, సీరియల్ కథలు, మొదలైనవి తర్వాత చదూకోవచ్చు అనే ప్రతి పేపర్ కటింగ్ ని జాగ్రత్త పరిచి పుస్తకాలు బైండ్ చేసి పెట్టుకున్నాను. ఈ అలవాటు మా నాన్నగారి నుండి వచ్చింది. ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాను.

ఎన్నో వందల గ్రంధాలు ఒక్క ఇ బుక్‍లో ఇమిడిపోయే ఈ రోజుల్లో ఇంకా ఈ పేపర్ కటింగ్స్ ఎందుకంటారా? ఎన్ని స్టార్ హోటల్స్ ఉన్నా, ఇంటి వంట రుచి తగ్గిపోతుందా? సాటివస్తుందా??

2 వ్యాఖ్యలు:

teresa

పెళ్ళీకొడుకు భలే ముద్దుగా ఉన్నాడు!
మీ వ్యాసమూ బావుంది.

Anonymous

మరుగున పడిపోతున్న ఇంత మంచి అలవాటు ని గుర్తు చేసినందుకు థ్యాంక్స్. నాకూ ఈ అలవాటు ఉంది, అయితే ఎప్పుడూ బైండ్ చేయించాలన్న ఆలోచన రాలేదు. ఇల్లు సర్ధుతున్నప్పుడో మరేదైనా వెతుకుతున్నప్పుడో ఇలాంటి ఓ కటింగ్ బయటపడి పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి అసలుపని మరచిపోతాను. ఈ వ్యాసం చదువుతుంటే ఇంకొకటి గుర్తుకొచ్చింది ఒకాయనకి చిన్నప్పటినుండి దొరికిన దారాలు ఉండగా చుట్టటం హాబీ అట, ఆయన ముసలితనం వరకు తయారైన చుట్ట ఓ రెండంతస్థుల ఇల్లంత పెద్దది తయారైంది.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008