Saturday 31 May 2008

హృదయ సౌందర్యానికి ప్రతిబింబం " స్నేహం " ..

ఎడారిలాంటి జీవితగమనంలో ఒయాసిస్సులా భగవంతుడు మనకు ప్రసాదించిన అనుబంధమే

స్నేహం. మనసు కలత పడినప్పుడు కమ్మని మాటలతో స్వాంతన చేకూర్చాలన్నా.. మన

ఆనందాన్ని మనకన్నా ఎక్కువ ఆనందించాలన్నా..తుంటరి చేష్టలతో ఉడికించాలన్నా మన

తప్పొప్పులను నిర్మొహమాటంగా మన ముందు పరచాలన్నా స్నేహితులను మించిన

అత్యద్భుతమైన అనుబంధం ఏదీ కానరాదు. అనుక్షణం మనల్ని కనిపెట్టుకుని ఉండడానికి

స్నేహితులను సృష్టించాడా భగవంతుడు అనిపిస్తుంది మనసు మూగబోయేటంత గొప్ప

స్నేహం రుచి చూసినప్పుడూ !.. అన్ని మానవ సంబంధాల మాదిరిగానే స్నేహమూ సాంద్రతని

కోల్పోవడం మనందరినీ కలవరపరిచే విషయం.



ఉరుకులు పరుగులతో ... జీవనభారంతో అలసిసొలసిన హృదయాలు కమ్మని స్నేహాన్నికూడా

ఆస్వాదించగలిగిన అదృష్టానికి సైతం నోచుకోలేకపోతున్నాయి. జీవనవిధానంతో పాటే స్నేహానికీ

నిర్వచనం మారిపోయింది. ఆర్ధిక సంబంధాలు, అవసరాల ఆధారంగా తాత్కాలికమైన స్నేహాలే

మాటల కోటలు దాటి నిజమైన స్నేహాలుగా చలామణి అవుతున్నాయి. పోటీ ప్రపంచంలో

ఆర్ధికంగానూ, సామాజికంగానూ ముందుకు దూసుకువెళ్ళాలనే తపనతో నాలికపై నర్తించే

లౌక్యపు మాటలతో అదే నిజమైన స్నేహమని భ్రమిస్తూ, భ్రమింపజేసుకుంటూ , ఆత్మవంచన

చేసుకుంటూ సాగించే స్నేహాలు అవసరం తీరగానే దూదిపింజల్లా మటుమాయమవడం అందరికీ

అనుభవైకవేద్యమే. నిష్కల్మషమైన స్నేహం పంచే మాధుర్యం జీవితన్ని మైమరపింపజేస్తుంది.

వ్యక్త పరచడానికి భాష కూడా చాలనంత గొప్ప అనుబంధం స్నేహం. గొప్ప స్నేహితులు పంచే

ఆత్మీయతను చూస్తే .. మన ఆత్మ మననుండి వేరుపడి మన మనస్సుని ఆహ్లాదంలో

ముంచెత్తడానికి స్నేహితుల తనువులోనికి పరకాయ ప్రవేశం చేసిందా అనిపిస్తుంది



మన కష్టంలో తల్లడిల్లుతూ, మన ఆనందంలో ఉప్పొంగిపోతూ మనమే తామై, తామే మనమై

ప్రజ్వల్లించే అటువంటి గొప్ప హృదయాల్లో ఎన్ని జన్మలెత్తినా ఒదిగిపోయి సేదదీరాలనే అనిపిస్తుంది.

అంతటి హృదయసౌందర్యం కలిగిన స్నేహితులను పొందడం నిజంగా పూర్వజన్మ సుకృతమే.

అపూర్వమైన ఆత్మీయతానురాగాలను పంచే స్వచ్చమైన స్నేహాన్ని పదికాలాల పాటు

పదిలపరచుకోకపోతే జీవితాంతం వగచినా ప్రయోజనముండదు. గొప్ప స్నేహన్ని పొందడాన్ని

మించిన జీవితంలో మరేది ఉండదేమో! ఆస్థులు, అంతస్థులు,భజనలు చేసే మందీ మార్బలం

లేకపోయినా.. ఒక్కడంటే ఒక్క స్నేహితుడు మోరల్‌గా అందించే సహకారం మన వెంటే ఉంటే

ప్రపంచాన్ని జయించవచ్చు. జీవితపు ప్రతీ మజిలీలో మనకు బాసటగా నిలిచే స్నేహతత్వాన్ని

ఎల్లప్పుడూ స్వచ్చమైన మనసుతో పరిరక్షించుకుందాం.



నల్లమోతు శ్రీధర్ ..

2 వ్యాఖ్యలు:

KK

మంచి స్నేహితుడుంటే, ప్రపంచాన్నే జయించవచ్చని ఎక్కడో చదివాను. మీ భావాలు చాలా బాగున్నాయి. స్నేహం ముసుగులో ఎన్నో మోసాలు జరుగుతున్నా దాని స్థానం దానిదే.

జ్యోతి

శ్రీధర్ నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. నిజమైన స్నేహితుడు మనల్ని మనకంటే ఎక్కువగా అర్ధం చేసుకుంటాడు. మంచి స్నేహం దొరకడమంత అదృష్టం వేరే లేదు. అది ఎన్ని కోట్లిచ్చిన కొనలేము. ఆ స్నేహం ఎటువంటి ప్రతిఫలం ఆశించదు.మన మేలు తప్ప. ఈ స్నేహంలో వయసు, ధనం, ఆడా,మగా అన్న తేడాలు ఉండవు. ఇది శారీరకమైనది కాదు, మానసికమైన బంధం కాబట్టి ఈ పవిత్రమైన అనుబంధం కలకాలం చెదిరిపోకుండా చూసుకోవాలి. ఇటువంటి మంచి స్నేహితులు నాకు ఉన్నందుకు నేను ఆ దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంటాను. నేను పర్సనల్‌గా కలవకపోయినా కూడా గొప్ప స్నేహితులు అని భావిస్తాను. నా రెండు మాటలకే నా మూడ్ బాలేదని గుర్తించి, ఏదో ఒకటి మాట్లాడించి మామూలుగా చేసేస్తారు. స్నేహానికి ఎటువంటి వరస అక్కరలేదు. మన అవసరాన్ని బట్టి అన్నగా ఆదుకుంటూ, తమ్ముడిలా ఉడికిస్తూ, అమ్మలా ఆప్యాయతను కూడా చూపించేవాడే నిజమైన స్నేహితుడు. ఇలాంటి స్నేహితులు నాకు ఉన్నారని గర్వంగా చెప్పుకుంటాను. అవకాశవాదులైన బంధువులు, సోధరులు కూడా అక్కరలేదు అనిపిస్తుంది.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008