Friday 25 July 2008

నాకిదే టైం పాస్ ....

ఈ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక నవ్య విభాగంలో వచ్చిన నా వ్యాసం... ఈ లింకు మంటనక్కలో కంటే ఎక్స్ ప్లోరర్^లో చూడండి.





"మీనాంటీ ! ఉన్నారా? కప్పుడు పంచదార ఉంటే ఇస్తారా?"


.



" ఏవమ్మో! ఆంటీ ఏంటీ ? తెలుగులో ఎంచక్కా అత్తా అనో, అక్కా అనో అన్లేవా? అమెరికా ప్లేన్ దిగి వచ్చిన దొరసానిలా ఆంటీ ఏంటి? నీ ఇంగిలిపీసు మండిపోను. ఐనా మా అమ్మా, అయ్య మధురమీనాచ్చిలా అందంగా పుట్టానని మీనాక్షి పని పేరు పెడితే అందరూ మరీ బద్ధకించి పేరుని కత్తిరించి మీనా అని పలికేస్తున్నారు. మరీ నాజూకు ఐపోతున్నారు జనాలు. ఇదిగో పంచదార. మళ్ళీ నువ్వు కొనగానే తిరిగిచ్చేయాలి సుమా. ఇచ్చి మర్చిపోవడం అంటే నాకు మా చెడ్డ చిరాకు. పనిమనిషి ఎప్పుడొచ్చి చస్తుందో. మహారాణిలా వస్తుంది. మొగుళ్ళకోసం ఆత్రంగా ఎదురుచూసే రోజులు పోయి పనిమనుషులకోసం ఎక్కువ ఆత్రంగా ఎదురుచూడాల్సిన కాలం వచ్చింది. ఏం కలి కాలమో ఏమో?


.



ఓరేయ్ పిల్లలు! లెగండి. రోజూ ఇదో తంతు ఐపోయింది. ఇంత పెద్దాళ్లయ్యారు. ఇంకా రోజూ నిద్ర లేపాలి. ఎలా బాగు పడతారో ఏమో. ఒరేయ్ కిట్టు. లే.. రాత్రంతా పనికిరాని క్రికెట్ మ్యాచులు చూడడం. పొద్దున ఆలస్యంగా లేవడం. మ్యాచులవల్ల వాళ్ళకు లక్షలు,కోట్లు వస్తాయి. మరి నీకు వచ్చేది సున్నాలే. లే.. శిల్పా .. ఆడపిల్లవన్నట్టే కాని ఒక్క పని నేర్చుకోదు. ఎప్పుడు చూసినా సెల్ ఫోన్ మాట్లాడటం. తిండి లేకున్న ఉంటారేమోగాని సెల్ ఫోన్ లేకుండా రోజులు గడిచేటట్టు లేవు. గంటలు గంటలు ఏం ముచ్చట్లు పెడతారో ఏమో. బిల్లు అవుతుందా అంటే ఫ్రీ ఆఫర్లు అంటారు. పిల్లలు సెల్ కంపెనీ వాళ్ళను ముంచేస్తారు. అసలు సెల్ ఫోన్ కనిపెట్టినవాడిని తన్నాలి. ఏవండి. లేచారా లేదా? ఆలస్యంగా లేవడం మళ్ళీ ఆఫీసుకు లేట్ అయిందని లారెన్స్ లా డాన్స్లలాడటం. అసలు వీళ్ళందరి చదువులు , ఉద్యోగాలు నేను చేస్తే సరి. అనవసరంగా రోజు అరిచేకన్నా.

.


ఒసే సరూప. ఇదేనా రావడం? నువ్వు పని చేసేందుకు నేను నీకు డబ్బులిస్తున్నానా? నువ్వు నాకిస్తున్నావా? నీ ఇష్టమొచ్చినప్పుడు వస్తావు. నాకంటే నీ పనే నయంగా ఉంది. సినిమాలు, పండగలు, జ్వరాలు అన్నీ వస్తాయి. మాకు ఎగనామం పెడతావు. జీతం కోయొద్దంటావ్. నువ్వు వచ్చినా, రాకున్నా ఇంటికి గొడ్డూ చాకిరి చేస్తున్నా ఎవ్వరూ అయ్యో అనరు. జీతం లేదు, సెలవు లేదు. చీ! ఎదవ జన్మ..

.


అమ్మయ్యా! ఇప్పుడు కాస్త తీరిక దొరికింది . పేపర్ చదివి, కొద్ది సేపు టివి చూస్తే సరి. ఏం పేపర్లో, ఏం టివినో. ఇక్కడ చదువుదామంటె ఒకరి మీద ఒకరు తిట్టుకొవడం, పనికిమాలిన విషయాలు మధ్యలో రాజకీయనాయకుల గోల. ఎలక్షన్లముందు అమ్మా! అయ్యా ! అక్కా ! తమ్మి! అని మర్యాదరామన్నకి మేనత్త కొడుకుల్లా మన చుట్టూ తిరుగుతారు. గెలిచాక నాలుగేళ్ళు కనపడరు. ఎన్నికల ముందు ఊళ్ళు తిరిగి, జనాలకు అడ్డమైన కబుర్లు చెప్పి, కరెంట్ ఫ్రీ అని గెలిచి ఇప్పుడు మా వల్ల కాదు. కరెంట్ కట్ తప్పనిసరి ,మీరే వరుణదేవుడిని ప్రార్ధించుకోండి అంటారు అసలు మధ్యతరగతి వాళ్ళ రాత మారేనా? పప్పులు, బియ్యం , గ్యాసు, కూరగాయలు ఏది కొనాలన్నా మండిపోతుంది. సరే అని టీవీ చూద్దామంటే అర్ధం కాని సీరియళ్ళు, అడ్డమైన పోటీలు. అస్సలు అవి డాన్సు ప్రోగ్రాములా, క్లబ్ డాన్సులా? పిల్లలు, పెద్దలు కలిసి చూసేలా ఉన్నాయా? ఇవన్నీ ఎవరు పట్టించుకోరు. అసలు పిల్లల తల్లితండ్రులకు ఏం మాయరోగం వచ్చిందో. పిల్లలను సగం సగం బట్టలతో డాన్సులేయిస్తారు. పైగా అది లక్షలాది మంది చూస్తున్నారన్న ఇంగితజ్ఞానం ఉండదు. ముందు వీళ్ళను ఉతకాలి. ఇక అత్తాకోడళ్ళ సీరియళ్ళు చూస్తే జీవితం మీద విరక్తి కలుగుతుంది. సీరియళ్ళలోని ప్లానింగులు బిన్ లాడెన్, బుష్ లకు కూడా రావేమో!.. కనీసం హిందీ సీరియళ్ళు చూద్దామా? అంటే అదో అయోమయ లోకం. మనవళ్ళకు పెళ్ళీడు పిల్లలున్నా, బామ్మలు, తాతలకు ఒక్క తెల్ల వెంట్రుక రాదు. మొహాన ఒక్క ముడత ఉండదు. లేదంటే కొన్ని కథలు ఒక జన్మ సరిపోదన్నట్టు మరో జన్మకు సాగదీస్తారు. పాటల చానెళ్ళు చూద్దామా. దురదగుంటాకు రాస్టే ఎగిరినట్టు పిచ్చి గంతులు. పిచ్చాళ్ళలా అర్ధంపర్ధం లేని పాటలు. చూసేవాళ్ళు ఎదవలైతే ఇలాంటి సినిమాలూ , సీరియళ్ళూ వస్తాయి.

.


అమ్మో! చూస్తుండగానే సాయంత్రమైంది. పిల్లలొచ్చే టైమ్ అయింది. రాత్రి వంట చేయాలి. పాటు తప్పినా సాపాటు తప్పదు కదా . గానుగెద్దులా అయింది బ్రతుకు. రోజు వంట చేయడం, ఇల్లు సర్దడం, పిల్లలను తయారుచేయడం, చదివించడం, మొగుడికి కావలసినవి అందించడం.ఒక గుర్తింపు లేదు పాడులేదు. నచ్చకుంటే బాగాలేదని అనడం తెలుసు కాని, బాగున్నప్పుడు నోరు తెరచి బాగుంది . బాగా చేసావు అని మాత్రం అనరు మొగుడైనా, పిల్లలైనా. అయ్యో అని అందరికి అనుకూలంగా అందిస్తుంటే ఏమీ తెలీడంలేదు. ఒకసారి తిక్కరేగిందా.స్ట్రైక్ చేసానంటే రోగం కుదురుతుంది. ఐనా ఇది జరిగేనా . చచ్చేనా. నాలో నేను సణుగుతూ పని చేసుకోక తప్పదు.. ప్చ్. ..

.

పక్కింట్లో జంటను చూసే ముచ్చటేస్తుంది. కాని బాధ కలుగుతుంది కూడా. ఇద్దరూ కంప్యూటర్ ఇంజనీర్లు. మంచి ఉద్యోగాలు. వేలల్లో ఉద్యోగాలు . ఏం లాభం. కూలీలలాగా పని చేస్తారు. ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు. పని చేయడం, వచ్చి పడుకోవడం. కడుపునిండా తింటారో లేదో అర్ధం కాదు. కలిసి కాఫీ తాగడానికి శనాదివారాలు తప్ప కుదరదు. . పాపం.

.


ఒరే పిల్లలు , మీ చదువులు ఐపోతే , ఇక వచ్చి తినేసి పడుకోండి. ఇంకా అయ్యగారు ఇంటికి ఎప్పుడొస్తారో. పేకాట రామాయణం ఇంకా పూర్తికానట్టుంది. ఏమంటే. టైమ్ పాస్ అంటారు. మరి నాకు టైమ్ పాస్... ఈ సణుగుడేనా?

.



జ్యోతి వలబోజు.


16 వ్యాఖ్యలు:

Dr. Ram$

జ్యోతి గారు.. చాలా బాగా వ్రాశారు.. సాధారణ గృహిణు ల కష్టాల ని , కుటుంబము కోసము వారు పడే శ్రమ ని మంచి హాస్యం తో చాలా బాగా చెప్పారు..

krishna rao jallipalli

వ్... అందర్నీ ఉతకడమే కాదు.. మిమ్ములను మీరు కూడా... ఉతుక్కున్నారు... చాల చాల బావుంది..
(BLOG WRITERS కి ఒక విన్నపం.. ఇలా సరదా.. సరదా టపాలు రాయండి.. కొంచం కళా పోసన చేయండి.. అంతేకాని.. పనికిమాలిన.. అనవసరమైన..సోది..సొల్లు DISCUSSIONS కి తావిచ్చే టపాలు రాయడం తగ్గించండి..)

Anonymous

బావుంది కథనం. సరళమైన పదాలు. సామాన్యమైన వాక్యాలు. సెభాషక్కో.

-- విహారి

కొత్త పాళీ

cool.

రాధిక

భలె రాసారు.నిజమే ఆ సణుగుడు లేని రోజు అస్సలు కాల0 గడవదు.నేను మా అబ్బాయికి ఒక ముద్ద తినడానికి వ0ద సార్లుపైనే "తిను నానా,తిను నాన్నా"అని అరవాలి.నాపని నేను చూసుకు0టూ అలా ఆ మ0త్రాన్ని జపిస్తూ వు0టాను.ఒక్కోసారి మా అబ్బాయి ఇ0ట్లో లేని సమయ0లోనో,లేక మామూలు సమయ0లోనో కూడా అలా అనేస్తాను.ొక్కోసారి నేను చెప్పకపోయినా తినేస్తూ వు0టాడు.అప్పుడు ఏమిటో వెలితిగా ఉ0టు0ది.ఆ రోజు సాయ0త్రానికి అనుమాన0 వస్తు0ది నాకు వాడికి పెట్టానా లేదా అని. .:)

వేణూశ్రీకాంత్

చాలా బాగుందండీ..

Rajendra Devarapalli

అసలు ఆంధ్రజ్యోతిలో నేను ఈ రచనను ఎలా మిస్సయ్యనో అర్ధం కావట్లేదు.జ్యోతి గారు ప్రతి రచనకూ మంచి పరిణితి సాధిస్తున్నారు.నవ్య పేజీతో పాటు ఎడిట్ పేజీకి వ్యాసాలు రాసేస్థాయికి ఎదగాలని నా ఆకాంక్ష.
జల్లిపల్లి గారూ,ఇది ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన వ్యాసం/రచన
ఇంతకీ మీరు బ్లాగు మొదలుపెట్టేదెప్పుడు??
రాధిక గారూ,మీ బాధ అందరూ అనుభవించేదే :)పైగా మాకిద్దరు.ముందు మనం తిని వాళ్ళకు తినిపించామనుకొండి మనం తింది అరిగిపోతుంది ఈ లోపు.తినకుండా వాళ్ళకు తినిపించే లోపు తిండి మీద ఆశ సన్నగిల్లుతుంది.

Kranthi M

నా స్ప౦దన నా నవ్వే.:)
వేరే ఏదైనా అయ్యు౦టే ఈ పాటికి కవితేదో రాసేసే వాడిని.
కామెడీని కవితలో పెట్టలేక వదిలేసా.:)

krishna rao jallipalli

నమస్తే దేవరపల్లి గారు.. ఆ రచన జ్యోతి లో వచ్చినా.. జ్యోతి గారి బ్లాగ్ లోనే నేను చదివింది. ఎ రచన అయిన.. ఎక్కడ పుట్టినా.. ఎక్కడ పెరిగినా.. ఫర్వాలేదు. బాగుంటే చాలు. అయినా చాలా మంది BLOGGERS చాల రచనలను తమ తమ BLOGS లో పెట్టి LINKS ఇస్తున్నారు కదా.. ఇక నేను బ్లాగడం సంగతి - నాకు పాఠకుడిగా, శ్రోతగా, ప్రేక్షకుడుగా ఉండడడమే ఇష్టం. నాకు సరిగ్గా రాయడం రాదు. అదీ ఒక క్రమ పద్దతిలో రాయడం అసలే రాదు. ఖర్మ కాలి ఒక వేళ బ్లాగినా... ఆ బ్లాగ్ మీరు ఓపెన్ చేసినా.. మీ మీ సిస్టమ్స్ నుండి పొగలు రావడం ఖాయం.. ఎందుకంటీ.. నీను ఎక్కువుగా NON-VEG పదాలు వాడుతాను మరి. (విచిత్రం ఏమిటంటే ఈ NON-VEG పదాలు మనందరం అనేక చోట్ల వింటుంటాము.. కొన్ని చోట్ల వాడుతుంటాం .. కాని చదవడానికి వచ్చే సరకి .. ఏదో ఏదో ఫీల్ అవుతుంటారు. ) అందుకే ఎవర్ని ఇబ్బంది పెట్ట తలుచుకోలేదు.

Kathi Mahesh Kumar

బాగుంది. చాలా సహజంగా.

Saraswathi Kumar

వాగ్లేకి దునియా(ఓ పాత DD సీరియల్), మిస్టర్ పెళ్ళాం(ఓ తెలుగు సినిమా)గుర్తుకొస్తున్నాయి(ఓ TV ప్రోగ్రాం)

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

బాగా రాశారు.

Bolloju Baba

మాయింట్లో మాకు తెలీకుందా స్టింగ్ ఆపరేషను చేసి రికార్డుచేసినట్లున్నాయే డవిలాగులన్నీ.
అదుర్స్.
బొల్లోజు బాబా

Unknown

wow entandi meru chepthundi chadhuvthunte mati pothundi i likeit....

Unknown

very nice

చక్రవర్తి

తూచ్.. ఇదంతా అబద్దం.. నేను ఖండిస్తున్నాను.. మాఇంట్లో ఇలా జరటం లేదు .. ఆఖర్లో ఉదహరించినట్లు మేమిద్దరం కంప్యూటర్ ఇంజినీర్లం కాదు, నేనొక్కడినే.. నా భార్య ఎకౌంటెంట్..

కానీ నిజమే.. శని ఆదివారాలే మాకు దిక్కు.. ఇంకా పిల్లలు లేరుగా.. అంతేలే.. వచ్చిన తరువాత సంగతి ఏమో..

ఏది ఏమైనా చించారు..

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008