Tuesday 30 September 2008

లెటజ్ సెలబ్రేట్....!!!

నిన్నటి వరకు ఏదైతే సాధించాలని ఉవ్వుళ్ళూరామో రెట్టించిన ఉత్సాహంతో మనం చేసిన కృషితో నేడు అది సాకారమైపోయింది. బాగా చదివి ర్యాంకు తెచ్చుకోవాలని కలలు కన్నాం. మంచి జాబ్‌లో సెటిల్ అవాలనుకున్నాం... హయిగా పెళ్లి చేసుకుని లైఫ్‌ని ఎంజాయ్ చేద్దామని కోరుకున్నాం.. అన్నీ.. అనుకున్నవన్నీ భేషుగ్గా పూర్తయ్యాయి. వాటన్నింటినీ సాధించడానికి జీవితంలో ఎన్నో త్యజించం.. జీవితంతో, మనుషులతో ఎంతో పోరాడాం.. చివరకు కసిదీరా గెలుపు దక్కించుకున్నాం. వెనక్కి తిరిగి మన విజయప్రసథానం చూసుకుంటే ఎంత సంతృప్తి! అంతా బాగానే ఉంది. "నా జీవితం ఇలా ఉండాలి" అని కోరుకుని మనల్ని మనం మలుచుకుంటూ ఈ స్థాయిలో ఉన్నాం. అనుకున్నవన్నీ అయిపోయాయి.
  
"తర్వాతేమిటి...?" - ఎంత సందిగ్ధతకు గురిచేసే ప్రశ్నో కదా ఇది! జీవితంలో అన్ని బాధ్యతలు సక్రమంగా పూర్తి చేసి ఇంకేం చెయ్యాలో పాలుపోని మధ్యవయస్కుల నుండి  పాతికేళ్లకే పరుగు పరుగున అనుకున్న అన్ని మెట్లూ ఎక్కేసి సేదదీరే పిన్న వయస్కులకూ కొద్ది క్షణాలపాటు ఆలోచిమజేసే ప్రశ్న! జీవితంలో మనం నేర్చుకోవలసిందీ, సాధించవలసిందీ ఇంకేమి లేదా... అని ప్రశ్నిస్తే "ఎందుకు లేదు బోలెడు ఉంది, కాని దేనిపై మనస్కరించడం లేదు..." అన్న సమాధానమే చాలామంది నుండి వస్తుంది. వేగంగా జీవితంలో పైకెదగడానికి అలుపెరగకుండా కృషి చేశాం. కష్టపడి గెలిచాం. అందుకే ఆనందం ఆవిరైపోయింది. మరో లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలంటే ఆ కిల్లర్ ఇన్‌స్టింక్ట్    మనసులోకి రానంటుంది. "ఇంకేముందిలే జీవితం... అలా కళ్లు మూసుకుని గడిపేస్తే సరిపోదా..." అన్నంత నిర్లిప్తత నరనరానా ఇంకిపోతుంది. నిర్దేశించుకోవాలే కాని ఎన్నో గొప్ప లక్ష్యాలను మనం మళ్లీ కళ్లల్లో నిలుపుకుని రెట్టించిన ఉత్సాహంతో ముందదుగు వేయవచ్చు. మళ్లీ పరుగు పెట్టడం ఇష్టం లేదా?? అయితే నిరుత్సాహంగా కాలం గడపడం ఎందుకు? మిగిలున్న జీవితాన్ని ఆనందించడానికి ఎన్ని మార్గాలు లేవూ..?

ఒక్కసారి ఆశలను చిగురింపజేసి ప్రతీ క్షణాన్ని మనల్ని మనం మైమరిచిపోయేలా ఆస్వాదించడం మొదలెట్టండి. మనం స్పృశించని జీవిత పార్ఘ్యలు ఎన్ని కళ్లెదుట కనిపిస్తున్నాయో కదా! ఐడియా సూపర్ సింగర్‌కి పోటీగా మనమూ పాటలెందుకు పాడకూడదు? సాఫ్త్‌వేర్ ప్రోగ్రామర్‌కి పోటీగా కత్తిలాంటి కోడ్‌లెందుకు రాయలేం? కొరుకుడుపడని ఇంగ్లీషు అంతు చూడొచ్చు కదా! హ్యాపీగా ఒళ్లు అలిసేలా షటిల్ ఎందుకు ఆడకూడు? టివి ఏంకర్లు అంత గడగడ ఎలా మాట్లాడతారో అని బుగ్గన వేలేసుకునే బదులు ఇంట్లో వాళ్లని ప్రేక్షకులుగా కూర్చోబెట్టి మనమే ఎందుకు వాగ్ధాటిని ప్రారంభించకూడదు...? అవన్నీ ఈ వయస్సులో ఏం చేస్తాం అని పెదవి విరుస్తున్నారా....! చూశారా ఆనందాన్ని వయస్సుతో ముడిపెడుతున్నాం. అందుకే సంతోషంగా గడిపే అవకాశాల్ని ఇలాగే మొండిగా బ్రతకడానికి అలవాటు పడిపోయి త్యజిస్తున్నాం. మనం పూనుకుని మన జీవితంలో ఆనందాల్ని నింపుకోనిదే దానికదే ఆనందం రావడం అవని పని! అందుకే జీవితాన్ని తనివితీరా ఆస్వాదిద్దాం, ఆడుకుందాం, పాడుకుందాం.

లెటజ్ సెలబ్రేట్!!!!

మీ నల్లమోతు శ్రీధర్ 

9 వ్యాఖ్యలు:

Anonymous

కదం త్రొక్కుతూ,
పదం పాడుతూ,
హ్రుదంత రాళం గర్జిస్తూ,
పదండిపోదాం,పదండిముందుకు,
పదండి త్రోసుకు, పోదాం, పోదాం,పై పైకి.....
అన్న శ్రీ,శ్రీ గారి ని గుర్తుకు తెస్తూ, మాలో కొత్త వుత్సాహం నింపే మీ కు జే,జేలు .ఆడుకుందాం, పాడుకుందాం. జీవితాన్ని తనివితీరా ఆస్వాదిద్దాం,

krishna rao jallipalli

GOOD INSPIRATION.

maa godavari

1000% మీతో ఏకీభవిస్తా జ్యోతి గారూ.
నేనెప్పుడూ ఎవరెడి బ్యాటరీలాగా ఫుల్ చార్జ్ లో ఉంటాను.
దానిక్కారణం చిన్న చిన్న సంతోషాలను ఆనందించడమే.
ఓ చెట్టు చూస్తాం.దాని మీద పిట్టని చూస్తాం.పిట్ట పెట్టిన వెచ్చని గూడు చూస్తాం.
గూట్లో కువ కువ లాడే గువ్వ పిల్లల్ని చూస్తాం.
అబ్బ!ఎంత సంతోషం వేస్తుంది.నా ఉద్దేశ్యం లో సంతోషం ఎప్పుడూ మన చుట్టూనే ఉంటుంది.
దాన్ని గుర్తించడం లోనె మన తెలివి ఉంటుంది.
ప్రక్రుతిలో ప్రతీది మనకు పరవశాన్ని ఇస్తుంది.దాన్ని వొడిసి పట్టడంలోనె ఉంది మజా అంతా.
మార్కెట్ లో దొరికే వస్తు సముదాయంలో సంతోషం దొరుకుతుందనుకోవడం వెర్రి భ్రమ.
స్నేహం లో గొప్ప సంతోషం ఉంటుంది.ప్రియ నేస్తం మనసు,మాట,స్పర్శ, సమక్షం,ఇచ్చే సంతోషం మరేదీ ఇవ్వలేదు.
బాల్యానికి మరణం ఉండదు.సంతోషాన్ని చేదుకోడానికి వయస్సు అడ్డం కాదు.కారాదు.
పుస్తకాలు,నేస్తాలు ఇచ్చే సంతోషం ముందు అన్ని బలాదూర్ అంటాన్నేను.

కొత్త పాళీ

That's the secret to staying young forever!
Good one, Sreedhar!

సుజాత వేల్పూరి

సత్యవతి గారు,
భలేగా చెప్పారు! చిన్న చిన్న సంతోషాలను ఆనండించదమే మనల్ని మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. నేను ఇంకోటి కూడా నమ్ముతాను. సాటి మనిషి వేదనలోనో, కష్టంలోనో స్నేహ హస్తం చాచడం కూడా చెప్పలేని తృప్తిని ఇస్తుంది.

పుస్తకాలు ,స్నేహితులు ఇచ్చే సంతోషం ముందు ప్రపంచంలోని ఏ ఆనందమైనా తల వంచాల్సిందే!

ఒక మంచి స్నేహం, ఒక పలకరింపు, కొంచెం సహాయం...సాహిత్యం, సంగీతం...ఇవన్నీ జీవితంలో విడదీయలేని భాగాలుగా ఉండాలని కోరుకుంటాను నేను.

మీరు మాత్రం నిజంగా fully charged battery యే!

maa godavari

సుజాత గారూ
మీరన్నది అక్షర సత్యం.
కష్టంలో ఉన్న వాళ్ళకి మన భుజాన్ని,
కన్నీళ్ళు కార్చేవాళ్ళకి మన దోసిలిని
ఇవ్వగలిగితే ఎంత మానసిక త్రుప్తో నాకు అనుభవమే.
మనం సంతోషంగా ఉండటం కోసమే బతకం కదా.
దాన్నిండా వేదనలు,రోదనలు,సంఘర్షణలు సంక్షోభాలు
అన్నీ ఉంటాయ్.జీవితం అనుక్షణం విసిరే సవాళ్ళని
ఎదుర్కోవాలన్నా,ఎదుటివారి దుఖాన్ని మనదిగా సహానుభూతి చెందాలన్నా,
చిన్న చిన్న సంతొషాలే మనల్ని రీచార్జ్ చేస్తాయని నేను గాఢంగా నమ్ముతాను.
అందుకే పనికి ఎంత ప్రాధాన్యతనిస్తానో,చిన్న చిన్న ఆనందాలని అస్వాధించడానికి అంతే ప్రాధాన్యతనిస్తాను.
మీ కాంప్లిమెంట్ బోలెడంత సంతోషాన్నిచ్చింది తెలుసా.

జ్యోతి

లలిత, సత్యవతిగారు,
ఈ వ్యాసం రాసింది శ్రీధర్. అక్టోబర్ నెల కంఫ్యూటర్ ఎరా పత్రిక ఎడిటోరియల్ ఇది.

శ్రీధర్,,

నా మనసులోని ఆలోచనలు నీకెలా తెలిసాయబ్బా? సంవత్సరం క్రింద మా పిల్లల చదువు అయిపోయి మంచి ఉద్యోగాలలో సెటిల్ అయ్యాక నేను అచ్చం ఇలాగే ఫీల్ అయ్యాను. ఏం చేయాలో తెలీని శూన్యం. మెల్లిగా స్నేహితుల ప్రోత్భలంతో బ్లాగులు, పత్రికప్రచురణలలో మనసు పెట్టాను. కాని బ్లాగు రెండవ వార్షికోత్సవం కాగానే మళ్లీ అదే స్తబ్దత ఆవరించింది. కాని ఓటమిని ఒప్పుకోవడం అలవాటులేదుగా. అందుకే మరో ప్రయత్నంగా ప్రమదావనం గుంపు మొదలెట్టాను. అది సఫలమైందని అనుకుంటాను. కాని ఇంకా కొత్తగా ఏం చేయాలో నా మట్టిబుర్రకు (పట్నంకదా మట్టి తక్కువ, సిమెంట్ ఎక్కువ) తట్టడంలేదు. ఇప్పటివరకు చేసినవన్నీ బోర్‍గా ఉన్నాయి.

సత్యవతిగారు ,
మీరు చెప్పింది బాగుంది. నిజంగా ప్రకృతిని ప్రేమించడం, మంచి స్నేహితులను కలిగి ఉండడమే పెద్ద అదృష్టం. తరగని చెరగని ఆస్థి కూడా. దేవుడికంటే, రక్తసంబంధీకులకంటే ముందు మనను ప్రేమించే, స్నేహితులే గుర్తొస్తారు కదా!!

Aruna

good. Nice post.

Unknown

@లలిత గారు మీరు రాసిన శ్రీశ్రీగారి వాక్యాలతో మరింత ఉత్సాహమొచ్చిందండీ!

@కృష్ణారావు గారు ధన్యవాదాలండీ!

@సత్యవతి గారు మీ ఆలోచనావిధానం చాలా అద్భుతంగా ఉంది.
@కొత్తపాళీ గారు లైఫ్ ని విభిన్న కోణాల్లో ఆస్వాదించడంలో మీరూ కొంతవరకూ నాకు ఆదర్శం.

@సుజాత గారు మీరన్నట్లు హెల్పింగ్ నేచర్ ఇచ్చే రిలీఫ్ చాలా గొప్పది.

@జ్యోతి గారు సమాజాన్ని గమనిస్తుంటే పుట్టుకొచ్చిన ఆలోచనకి అక్షరరూపమండీ ఇది. మీరు ఫేస్ చేసిన emptyness నుండి ఇన్నింటామీరై ఇప్పుడు గడుపుతున్న జీవితానికి రావడంలో మిమ్మలను మీరు చాలా బాగా ట్యూన్ చేసుకున్నారు.

@అరుణ గారు మీ మోరల్ సపోర్ట్ కి ధన్యవాదాలు.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008