Tuesday 20 January 2009

అంతర్జాలంలో తెలుగు సాహిత్యం



నిన్న సోమవారం 19-1-2009 సాక్షి దినపత్రికలో వచ్చిన వ్యాసం...



రకరకాల కారణాల వల్ల తెలుగులో సాహిత్య పత్రికల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. దినపత్రికల సాహిత్య పేజీల్లోనూ, ఆదివారం అనుబంధాల్లోనూ కేటాయించే ఒకటీ, అరా పేజీలే సాహిత్యాభిమానులకు దిక్కవుతున్నాయి. ఆయా పత్రికల అభిరుచులను బట్టి ఆ కాసిన్ని పేజీల్లోనూ ఎన్నో పరిమితులేర్పడతాయి. ప్రచిరితమైన రచనలపై తగిన చర్చ జరగటమూ అరుదుగానే మారుతోంది. ఈ సందర్భంలో విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన అంతర్జాల (ఇంటర్‌నెట్) పత్రికలు సాహిత్యాభిమానుల ఆదరణతో దినదినాభివృద్ధి చెందుతున్నాయి.


చదువులూ, ఉద్యోగాలూ, వృత్తులూ వంటి వ్యాపకాల కారణంగా తెలుగువాళ్లు వివిధ రాష్ట్రాలకూ, దేశాలకూ విస్తరించిన సందర్భం ఇది. వాళ్లలో తెలుగు భాషా, సాహిత్యాల మీద మక్కువ గలవాళ్ళ సంఖ్య కూడా అధికమే. ఐతే ప్రింట్ మీడియాలోని తెలుగు పత్రికలూ, పుస్తకాలూ వాళ్ళందరికీ దొరకటం మాత్రం అంత సులభం కాదు. ఈ లోటును పూరించుకోటానికి జరిగిన ప్రయత్నాలకు సాంకేతిక పరిజ్ఞానం సాయమందటంతో అంతర్జాల సాహితీ పత్రికలు రూపొందాయి. చిన్న పట్టణాల్లో కూడా ఇంటర్నెట్ సదుపాయాలు అందుబాటులోకి రావడం వల్లా, తెలుగులో కంపోజ్ చేయటానికి సులభమైన ఉపకరణాలు లభించటం వల్లా, తక్కువ ఖర్చుతో ఎక్కువ పత్రికలను చదవగలిగే సౌలభ్యం దొరకటం వల్లా రచయితలూ, పాఠకులూ కూడా వీటిని ఆదరిస్తున్నారు. అంతర్జాల సాహిత్య పత్రికల్లో కొన్నిటిని ఇపుడు పరిచయం చేసుకుందాం...


తెలుగు భాషా, సాహిత్యాల వ్యాప్తిలో గొప్ప కృషి చేసిన అంతర్జాల పత్రికగా 'ఈ మాట'ను చెప్పుకోవాలి. వేలూరి వెంకటేశ్వర రావు, కె.వి.ఎన్.రామారావు, ఎస్. నారాయణస్వామి, సురేశ్ కొలిచాల, శంఖవరం పాణిని, పద్మ ఇంద్రగంటి సంపాదకవర్గంగా వస్తున్న ఈ పత్రిక నవంబరులో పదవ వార్షికోత్సవం జరుపుకుంది. ప్రింట్‌లో వస్తున్న తెలుగు పత్రికలకు రాసే విదేశాంధ్రులు మాతృదేశంలోని పాఠకుల అభిప్రాయాలకు భిన్నమైన భావాలను స్వేచ్చగా రాయలేకపోతున్నారనీ, వాళ్ల్లు మనసులు విప్పు మాట్లాడేందుకు వేదికగా తమ పత్రిక ఉంటుందనీ కె.వి.ఎస్. రామారావు అంటున్నారు.


'ఈ మాట' పాత సంచికలను తిరగేస్తుంటే ఓ సాహిత్యపు నిధిని తవ్వుతున్నట్టే ఉంటుంది. 'తెలుగు భాషాభివృద్ధికి వ్యూహాలు' పేరిట భద్రిరాజు కృష్ణమూర్తిగారిచ్చిన ఇంటర్వ్యూ గొప్ప విశ్లేషణను అందించింది. అంతర్జాతీయ సినిమాల గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న రాస్తున్నా సమీక్షలూ, సంగీత విద్వాంసుల గురించీ కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ రాస్తున్న వ్యాసాలూ పత్రికలో ప్రత్యేక ఆకర్షణలు. 'నాకు నచ్చిన పద్యం' శీర్షికన చీమలమర్రి బృందావనరావు సంప్రదాయ సాహితీ సౌందర్యాన్ని వివరించి చెప్తున్నారు. సాహిత్య విమర్శపై ఈ పత్రిక చేస్తున్న కృషి చెప్పుకోదగినది.



ఇక రెండేళ్ళ క్రిందట అంతర్జాలంలో పొడిచిన 'పొద్దు' కూడా పాఠకుల మనసుల్లో తనదైన ముద్ర వేసింది. ఎందరో ప్రముఖ రచయితలూ, బ్లాగర్లూ ఈ పత్రిక ద్వారా పాఠకుల ముందుకు వస్తుంటారు. 'పొద్దు' ప్రతినెలా నిర్వహించే 'గడి' శీర్షికా, బ్లాగుల సమీక్షా వ్యాసాలూ పాఠకులను బాగా ఆకర్షిస్తున్నాయి. ఉగాది, విజయదశమి పర్వదినాల సందర్భంగా ఈ పత్రిక నిర్వహించిన చక్కటి ప్రయోగం 'భువన విజయం'. త్రివిక్రమ్, స్వాతి, చదువరి, రానారే, సిముర్గ్, రాజేందర ఈ పత్రిక సంపాదకులు.



సినిమాల విశేషాలతో నిర్వహించే ప్రత్యేకమైన అంతర్జాల పత్రిక 'నవతరంగాం' వెంకట్ సిద్ధారెడ్డి, రాజేంద్రల సంపాదకత్వంలో వెలువడే ఈ పత్రిక తెలుగువే కాక , ఇతర భాషల సినిమాల గురించి కూడా చర్చిస్తుంది. సినిమాల్లోని సాహిత్య, సాంకేతిక విషయాలను గురించి అచ్చ తెలుగులో వివరించటమేగాక, నిష్పాక్షికమైన విమర్శల ద్వారా పాఠకుల అభిరుచుల్ని తీర్చిదిద్దటం ఈ పత్రిక ప్రత్యేకత.



కాలిఫోర్నియా బే కు చెందిన తెలుగు సాంస్కృతిక సంస్థ 'సిలికానాంధ్ర' కూడా 'సుజన రంజని' అనే పత్రికను నడుపుతోంది. మృత్యుంజయుడు, తల్లాప్రగడ రావు, ప్రఖ్య వంశీకృష్ణ, తమిరిళ జానకి, ఆనంద్, చెన్నయ్యలు నిర్వహించే ఈ పత్రిక ప్రాచీన సాహితీ విశేషాలు, జానపదకళలు, ప్రముఖ కళాకారుల పరిచయాలు వంటి అంశాలన్నిటినీ అందిస్తుంది. 'పద్యం హృద్యం' శీర్షిక ద్వారా పాఠకుల్లో పద్య రచనపై అభిరుచిని పెంపొందించటం మరో ప్రత్యేకత. వీటన్నింటితో బాటు ఆడియో, వీడియోలను కూడా పొందుపరచటంతో పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.


ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక సాహిత్యాన్ని విస్తృతంగా ప్రచారం చేసే లక్ష్యంతో హిమబిందు, చైతన్య, సాజీగోపాల్‌లు నిర్వహిస్తున్న పత్రిక 'ప్రజాకళ'. ఇందులో కవిత్వం, కథ, నవల, విమర్శ లాంటి ప్రక్రియలన్నింటినీ పరిచయం చేస్తున్నారు. ఈ పత్రిక రాజకీయాలు, సామాజిక శాస్త్రాలు, మానవ హక్కులు, సైన్స్ లాంటి రంగాలన్నింటిమీదా కూడా విశ్లేషణాత్మక వ్యాసాలను అందిస్తోంది. వివిధ పత్రికల నుంచి ఈ వ్యాసాలను సేకరించి ప్రచురిస్తున్నారు.


రచయిత కిరణ్ ప్రభ, కాంతి కలిసి 'కౌముది' అనే అంతర్జాల మాస పత్రికను ప్రచురిస్తున్నారు. ప్రముఖ ఆర్టిస్టుల చిత్రాలతో, ఫోటోలతో అందమైన ముఖ చిత్రాలను రూపొందించటం ఈ పత్రిక ఆకర్షణల్లో ఒకటి. అచ్చు పత్రికల్లో లాగా వైవిధ్యభరితమైన శీర్షికల్ని ఇందులో పొందుపరిచారు. సమకాలీన సాహిత్యంతో బాటుగా విలువైన పాత కథల్నీ, నవలల్నీ అందించటంతో వివిధ వర్గాల పాఠకులను 'కౌముది' ఆకట్టుకోగలుగుతుంది.


కొండవీటి సత్యవతి నిర్వహణలోని 'భూమిక', దక్షిణ భారత దేశంలోనే తొలి అంతర్జాల స్త్రీవాద పత్రిక. స్త్రీవాద సాహిత్యంతో బాటు సామాజిక, రాజకీయ సమస్యలను కూడా సమర్ధవంతంగా విశ్ళేషించే రచనలను 'భూమిక' అందిస్తోంది. సమస్యల్లో ఉన్న స్త్రీలకు ప్రత్యక్ష సహాయాన్ని అందించే లక్ష్యంతో 'భూమిక' నిర్వహిస్తున్న హెల్ప్ లైన్‌కు మహిళల నుండి మంచి స్పందన లభిస్తోంది.



ప్రారంభమైన ఏడాది కాలంలోనే అత్యధిక సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న అంతర్జాల పత్రిక 'ప్రాణహిత'. నారాయణ స్వామి, మమత, హిమబిందు, జయప్రకాశ్, చైతన్య, జి.ఎస్.రాం మోహన్‌లు ఈ పత్రికను నిర్వహిస్తున్నారు. విభిన్న కంఠాల సమ్మేళనమై వినబడే ప్రజాస్వామిక సాహిత్యానికి క్రియాశీల వేదికగా నిలవాలన్నది ఈ పత్రిక లక్ష్యం. మమత, ఎస్. వేణుగోపాల్‌లు అందిస్తున్న ధారావాహిక అనువాదాలతో బాటు, ప్రసిద్ధ రచయితల సాహిత్యాన్ని కూడా ప్రచురిస్తున్నారు. చక్కటి వర్ణచిత్రాలనూ, వీడియోలనూ కూడా 'ప్రాణహిత' అందిస్తోంది.


తెలుగు సాహిత్యానికి అంతర్జాతీయ వేదికను కల్పిస్తున్న అంతర్జాల పత్రికల్లో ఇవి కొన్ని మాత్రమే. ఎటువంటి ధనాపేక్షకూ తావు లేకుండా సాగుతున్న వీటి నిర్వహణ అభినందనీయం. ఇవి మరింతగా విస్తరిస్తాయని , మంచి ప్రమాణాలను సాధిస్తాయని చెప్పటానికి సందేహం అక్కర్లేదు.


కొన్ని అంతర్జాల పత్రికల లింకులు:

www.eemata.com

www.pranahita.org

www.poddu.net

www.navatarangam.com

www.prajakala.org

www.sujanaranjani.siliconandhra.org

www.koumudi.net

www.bhumika.org



- జ్యోతి వలబోజు

ఈ వ్యాసానికి ప్రేరణ గతంలో అంతర్జాల పత్రికలపై పొద్దులో వచ్చిన వ్యాసం..


చిన్న కొసమెరుపు...
ఈ వ్యాసం రాసేటప్పుడు జరిగిన సంఘటనలు తలుచుకుంటే నవ్వొస్తుంది.. వ్యాసం కోసం సమాచారం సేకరిస్తున్న సమయంలో నెట్ వాడితో గొడవ జరిగి, మూడు నెలలు బిల్లు కట్టలేదు. వాడు కనెక్షన్ కట్ చేసాడు. అంతకుముందే మా అబ్బాయి సిస్టమ్ format చేసాడు. లేఖిని లేదు, బరహా ఎగిరిపోయింది. మళ్లీ దించుకుందామంటే నెట్ లేదు . ఎప్పుడొస్తుందో తెలీదు. అప్పుడే కొన్న అను సాఫ్ట వేర్ ఉంది. అదంటే భయం. ఎలా రాయాలో తెలీదు. .ఏం చేద్దాం అని ఆలోచించి... చించి... లాభం లేదని.. అలవాటు తప్పినా తప్పని పరిస్థితుల్లో పేపర్ మీద రాసి పత్రికకు పంపించాను. కంప్యూటర్ లో ఐతే రాసింది ఉంటుంది. నేను రాసింది పెన్నుతో.. కాపీలు కూడా లేవు.. ఏం రాసానో గుర్తు లేదు. ఇలా ఆధారపడితే ప్రయోజనం లేదని పట్టుబట్టి భయాన్ని అణచిపెట్టి.. రోజుకు రెండు గంటలు కూర్చుని, రెండు రోజుల్లో అను నేర్చుకున్నాను (అప్పుడప్పుడు శ్రీధర్ బుర్ర తిన్నాననుకోండి.) హన్నా.. నన్ను భయపెట్టే ధైర్యమా అని అంతు చూడకుండా వదలలేదు.. బరహ కూడా మళ్లీ దించుకోలేదు..

14 వ్యాఖ్యలు:

dhrruva

BARAHA lekunnaa NERCHUKUNI antha manchi AERTICLE raasindhuku chaala baaga vachindhi.

PAPER lo choosinaa chadavaledhu. KOODALI lo choosi chadivaam... chaala bagundhi

JYOTHI akka ROCKS !!!

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी

అన్ని వివరాలు చక్కగా అందిచారు. సంతోషం.
ఈ మధ్య సుజనరంజని వెబ్ పేజ్ లో పాత సంచిక మాత్రమే కనిపిస్తోంది.
పత్రిక ఆగిపోయిందేమో అనుకుని ఊరుకున్నాను.
వస్తూనేఉందన్నమాట.

శ్రీనివాస్ పప్పు

జ్యోతి గారు,
అభినందనలు...

Unknown

జ్యోతి గారు మంచి వ్యాసాన్ని అందించినందుకు అభినందనలు.

మధురవాణి

జ్యోతి గారూ..
చక్కటి వ్యాసం రాసారు. మీకు అభినందనలు.
మొత్తానికి ఏ సమస్యలు వచ్చినా..చివరికి సాధించారన్నమాట.. మరి జ్యోతా.. మజాకానా :)))
మిమ్మల్ని చూసి మేము అందరం బోలెడు విషయాలు నేర్చుకోవాలండీ జ్యోతి గారూ..

నిషిగంధ

ఉద్యోగాలు చేస్తూ, ఇంటిపనులు చూసుకుంటూనే ఇలా వెబ్ పత్రికలను నిర్వహించడం అంటే అంత సులువైనపని కాదు.. వీటిని వెనకనున్న అందరి కృషీ ఎంతో అభినందనీయం! ఫ్రీగానే ఇస్తున్నాం కదా అని ఎక్కడా విషయ నాణ్యత తగ్గించకపోవడం, అనుకున్న సమయానికే ఖచ్చితంగా విడుదల చేయడం వీరి నిబద్దతని సూచిస్తోంది!
చాలా మంచి వ్యాసం అందించారు జ్యోతి గారూ!

krishna rao jallipalli

నమస్తే, నిన్న ఉన్దయమే సాక్షిలో మీ ఆర్టికల్ చూసాను. చాలా బాగుంది. ఇలా తరచుగా ఆర్టికల్స్ వస్తోంటే అంతర్జాలం లో తెలుగు ఓ వెలుగు వెలిగిపోగలదు.

Srujana Ramanujan

You write in saakshi?

A good write up.

చింతా రామ కృష్ణా రావు.

అమ్మా! జ్యోతీ!
అంతర్ జాలంలో తెలుగు సాహిత్యం అనే మీరు వ్రాసిన వ్యాసంలో చాలా ప్రయోజనకరమైన బ్లాగుల చిరునామాలతో సహా తెలియని వారికి కూడా తెలిసే విధంగా వ్రాసినందుకు మనః పూర్వక అభినందనలు.

Unknown

Good write up.
Madhav Machavaram is also in the eemaata editorial board.

సిరిసిరిమువ్వ

జ్యోతి గారు, బాగా వ్రాసారు. అబినందనలు.

Anonymous

జ్యోతక్కా మజాకా .............

kanthisena

జ్యోతిగారూ, మీరు పంపిన లింకులలో దీనిని ఇప్పటికే చాలా సార్లు చదివాను. కానీ కామెంట్ పెట్టలేదంతే. తెలుగులో అతిగొప్ప సైట్లను ఒడిసి పట్టుకుని గుది గుచ్చారు. ఎవరికైనా, ఎప్పటికైనా ఉపయోగపడే సమాచారం ఇచ్చారు. చాలా సంతోషం. అప్పుడప్పుడూ కొత్తవారికి కూడా పంపుతూ ఉండండి. ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే తెలుగులో పిల్లల కు సంబందించిన సైట్ల గురించి తప్పక పరిచయం చేయండి.

ఉదా హరణకు
కొత్తపల్లి.ఇన్,
జాబిల్లి,
తెలుగుకిడ్స్

చందమామ ఆన్‌లైన్ -ఆర్కైవ్స్ల్ లోని కథల భాండాగారాన్ని తప్పక పరిచయం చేయగలరు.

అభినందనలు

vino

Akkayya Garu,
Mee blog ante naku cheppalentha istam.Meru blog rase paddathi,cheppe vishayalu chala chala buguntayi.I love to read your blog.Mee blog chusi naaku rayalani undi.Help cheyandi please please.Naa mail id kinda isthunnanu.please naku mail chayyagalara...........
mail kosam yeduru choosthu.........

vinodini24@yahoo,com
with love
vinodini

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008