Sunday 1 March 2009

గోల్ మాల్

కూటి కోసం కోటి తిప్పలు అని పెద్దలు ఊరికే అన్నారా?. అలాగే ఉద్యోగం పురుష లక్షణం. కాని మీసం లేని మగాడు వ్యక్తిత్వం లేనివాడు. అసలు మగాడే కాదు అంటే మీరు ఒప్పుకుంటారా? కాని భవానీ శంకర్ అనే పెద్దమనిషికి యువకులు అంటే మీసముండాలి, ఎటువంటి ఆటలు గట్రా ఆడకూడదు, సంస్కృతి , సంప్రదాయాలను పాటించాలి. అని కొన్ని నిర్దిష్టమైన లక్షణాలు ఉండాలి. తికమకగా ఉందా?? ఈ కథ కమామీషు దాదాపు ముప్పై ఏళ్ల క్రింద విడుదలైన హిందీ చిత్రం "గోల్ మాల్" లోది. ఉద్యోగం కోసం అబద్దం ఆడిన అమోల్ పాలేకర్, తర్వాత దాన్ని నిలుపుకోవడానికి పడ్డ నానా అగచాట్లు, ఉత్పల్ దత్ హుందా ఐన నటన, సున్నితమైన హాస్యాన్ని అందించిన దర్శకుడు హృషికేశ్ ముఖర్జీ. వీరిని ఇప్పటికీ గుర్తుచేయనివారుంటారా. ఆ చిత్రం విడుదలై అందరిని అలరించింది, ఇప్పటికీ దాదాపు ప్రతీ సీను చాలా మందికి గుర్తుంటుంది. వెంటనే పెదవులపై చిరు మందహాసం ఉదయించక మానదు.






రామ్ ప్రసాద్, అతని చెల్లెలు రత్న తల్లి తండ్రి లేని అనాధలు. చదువు పూర్తైన రాం ప్రసాద్ ఉద్యోగవేటలో ఉండగా వారి కుటుంబ మిత్రుడైన డాక్టర్ చెప్పిన ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళతాడు . కాని ఆ ఉద్యోగంకోసం ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కంపెనీ అధిపతి భవానీ శంకర్ చాందసవాది, అమాయకుడు. జీతం, అల్లొవెన్సులు బానే ఉన్నాయి. కాని కాస్త పాతకాలం వేషధారణ , మాటలు ఉండాలి. అధునిక యువకులు పెద్దలను, సంస్కృతిని గౌరవించరు అని భవానిశంకర్ అభిప్రాయం. డాక్టర్ చెప్పిన ప్రకారమే రామ్ ప్రసాద్ ఖద్దరు లాల్చీ, పైజామా, తలకు నూనె పట్టించి, చాలా నిదానస్తుడిలా వెళతాడు ..ఇక్కడ ఇంటర్వ్యూలో అమోల్ పాలేకర్, ఉత్పల్ దత్ నటన అద్భుతం. భవాని శంకర్ ని మెప్పించడానికి ఆటలంటే పిచ్చి ఉన్నా కూడా అస్సలు ఆటల గురించి తెలీనట్టే మాట్లాడతాడు. ప్రముఖ ఫుట్ బాల్ ఆటగాడు బ్లాక్ పెర్ల్ (పీలే బిరుదు) గురించి అడిగితే రామ్ ప్రసాద్ ముత్యాలు నల్లగా ఉంటాయా సర్? నాకు తెలీదే అని అమాయకంగా ఎదురు ప్రశ్న వేస్తాడు ..అలాగే తరచూ "మేరే పితాజీ కహాకర్తే తే " అంటూ ఎన్నో అబద్ధాలు చెప్తాడు. ఆ గ్రాంధిక బాష విన్న భవానీ శంకర్ ముగ్ధుడైపోయి, అతనికి వెంటనే ఉద్యోగం ఇచ్చేస్తాడు.





ఉద్యోగం వచ్చాక హాయిగా గడిచిపోతుంటుంది. బయట ఎంత చలాకీగా, ఆధునికంగా ఉన్నా, ఆఫీసుకు వెళ్లేటప్పుడు మాత్రం వేషం మార్చుకుని వెళుతుంటాడు రామ్ ప్రసాద్. ఒకరోజు ఫుట్ బాల్ మాచ్ చూడడానికి లీవు కోసం లేని తల్లికి ఆరోగ్యం బాలేదని అబద్ధం చెప్తాడు రాం ప్రసాద్. కాని అదే మాచ్‌లో భవానీ శంకర్ అతడిని స్నేహితులతో కలిసి అల్లరి చేస్తుండగా చూస్తాడు. కోపంతో మరునాడు ఆఫీసులో నిలదీస్తాడు. అసలే అబద్ధంతో మొదలైన ఉద్యోగం. దానిని కాపాడుకోవడానికి మరిన్ని అబద్ధాలు ఆడక తప్పదు అతనికి. ఫుట్ బాల్ మాచ్ లో కనిపించింది తను కాదు ఉద్యోగం సద్యోగం లేక తిరుగుతున్న తన తమ్ముడు లక్ష్మన్ ప్రసాద్ అని చెప్తాడు రామ్. నమ్మని బాస్ కు తనకు మీసముందని, తమ్ముడికి మీసం లేదని బొంకుతాడు. అలాగే ఒక నటీమణిని తల్లిగా పరిచయం చేస్తాడు. రామ్ ప్రసాద్, అతని చెల్లెలిమీద ప్రేమతో ఆవిడ కూడా వీళ్లకు వంత పాడుతుంది. తమ్ముడు ఉద్యోగం లేకుండా తిరుగుతున్నాడని రామ్ ప్రసాద్ బాధ పడుతుంటే భవానీ శంకర్ అతడిని తన కూతురికి సంగీతం నేర్పించమంటాడు. ఇక మొదలవుతుంది రామ్ కి రెండు విభిన్నమైన పాత్రలు పోషించడం. అనుకోకుండా ఒకసారి తల్లి పాత్ర వేస్తున్న కమలాదేవి కూడా అనుకోని పరిస్థితిలో తనకు ఒక కవల సోదరి ఉందని చెప్తుంది. మరో గోల ఏంటంటే భవానీశంకర్ కూతురు ఊర్మిళ తమ్ముడు లక్ష్మన్ ని ప్రేమిస్తుంది. తండ్రి ఏమో తన కూతురికి బుద్ధిమంతుడైన రామ్ కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు.

ఇక్కడ మొదలవుతుంది అసలు గందరగోళం. ఉద్యోగం కాపాడుకోవటానికి రామ్ ప్రసాద్ పాట్లు, ఏది నమ్మాలో , ఏది నమ్మకూడదో తెలియని అయోమయంలో భవానీ శంకర్. ఇందులో ఉత్పల్ దత్, అమోల్ పాలేకర్ ఒకరిని మించి ఒకరు అద్భుత నటనను కనబరిచారు. ఎవరు ఎక్కువ , ఎవరు తక్కువ అని చెప్పలేము. అమాయకంగా అమోల్ పడే పాట్లు, సీరియస్ గా ఉంటూనే కడుపుబ్బా నవ్వించే ఉత్పల్ దత్ హావభావాలు. అంతకు మించి దర్శకుడి ప్రతిభ. 1979లో విడుదలైన ఈ చిత్రం లక్షలాదిమందికి ఫేవరేట్ గా నిలిచిపోయింది. ఇప్పటి చిత్రాల్లో లాగా వెకిలి హాస్యం కాకుండా ఏళ్ల తరబడి గుర్తుండిపోయే, కుటుంబ సమేతంగా చూడగలిగే సున్నితమైన హాస్య కథా చిత్రం ఇది. ప్రతి మగాడికి మీసం ఉండాలని, మీసం లేని వాడికి మంచి మనసు, చరిత్ర, సంస్కృతి, పెద్దల ఎడ భయం భక్తి ఉండదు అనే భవానీశంకర్ ను ఎలా ఒప్పించి అతడి కూతురిని పెళ్లి చేసుకున్నాడన్నది సినిమా క్లైమాక్స్. ఎలాగైతేనేమి కూతురికోసం మనసు మార్చుకున్న భవానీశంకర్ కూడ సినిమా చివర్లో మీసం తీసేసి కూతురు అల్లుడితో ఫోటొ దిగుతాడు.





ఇందులోని టైటిల్ పాట "గోల్ మాల్ హై భై సబ్ గోల్ మాల్ హై " మనకు ఎదురయ్యే ఎన్నో సంఘటనలకు తప్పనిసారి పాడుకోవాల్సి వస్తుందేమో. ఈరోజు అన్నీ గోల్‌మాల్ గా ఉన్నాయి కదా. అలాగే మరో మధురమైన పాట "ఆనేవాలా పల్ ,, జానేవాలా హై." మంచి ప్రేమ గీతం.. సంగీతానందించింది R.D.Burman. ఎప్పుడైనా బోర్ గా, దిగులుగా ఉందా?? ఐతే ఈ సినిమా ఒక్కసారి చూడండి, మీ మూడ్ మారి తప్పకుండా హాయిగా నవ్వి తీరుతారు

7 వ్యాఖ్యలు:

కొత్త పాళీ

గొప్ప సినిమా. అమోల్ పలేకర్, రంజితా ఇంకో సినిమా ఉంటుంది పేరు గుర్తు రావట్లేదు. దానిక్కూడా హృశికేశ్ ముఖర్జీనే అనుకుంటా దర్శకుడు

జ్యోతి

కొత్తపాళీగారు,
అది చిత్ చోర్ సినిమా కదా.. అందులో జేసుదాస్ పాటలు ఇప్పటికి మరువలేము... గోరి తెరా గావ్ బడా ప్యారా...

సుజాత వేల్పూరి

అమోల్ పాలేకర్, రంజితా నటించింది చిత్ చోర్ కాదు. ఆ సినిమా "మేరీ బీవీ కీ షాదీ". దర్శకుడు కూడా హృషీకేష్ కాదండీ,రజత్ రక్షిత్ అనుకుంటాను. ఈ మధ్యనే డీవీడీ చూసాను. చిత్ చోర్ లో హీరోయిన్ జరీనా వహాబ్.

హృషీకేష్ దర్శకత్వంలో అమోల్ పాలేకర్ నటించిన మరో సినిమా "నరమ్ గరమ్". ఇందులో హీరోయిన్ స్వరూప్ సంపత్.

కొత్త పాళీ

నేను అనుకున్న సినిమా పేరు దామాద్. అందులో అమోల్ పలేకర్ ఒక కంపెనీలో కొత్త ఉద్యోగిగా చేరుతాడు. అక్కడ అతని పై అధికారులందరూ పెళ్ళికావల్సిన కూతుళ్ళకి తండ్రులే.

సుజాత వేల్పూరి

కొత్తపాళీ గారు,
కరక్టేనండోయ్, దామాద్ లో కూడా రంజితాయే హీరోయిన్. దానికీ డైరెక్టర్ రజత్ రక్షితే!

Rekha Jithendra

naveen nischal act chesina Budda mil gayaa ...movie gurinchi review undaa mee blog lo ...raat kali song undi

జ్యోతి

లేదు రేఖగారు, ఆ సినిమా గురించి రాయలేదు.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008