Friday 14 August 2009

కృష్ణం వందే జగద్గురుం !!!





ప్రేమ , కర్తవ్యం,గురువు అనగానే మనకు గుర్తొచ్చేది శ్రీకృష్ణుడే.. లీలామానుషధారి, ఆపధ్బాంధవుడు, ఇష్టసఖుడు.. పుట్టినది మొదలు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని, తరతరాలకు తరగని నిధివంటి భగవద్గీతను అందించాడు. యావత్ప్రపంచానికే జగద్గురువు అయ్యాడు. తానుగా యుద్ధం చేయకపోయినా, నమ్మిన వారికి అండగా ఉండి స్నేహశీలిగా , ప్రేమమూర్తిగా కర్తవ్యం బోధించాడు. జగత్తుకే నాధుడు, చక్రవర్తి ఐన కృష్ణుడికి వెన్న దొంగతం ఎందుకు చేయవలసి వచ్చింది? భక్తుల మెదళ్లలో పిడతలనే చీకటిలో పేరుకుని ఉన్న అజ్ఞానాన్ని తొలగించేందుకే వెన్న అనే జ్ఞానాన్ని బయటకు తీసి వెన్నదొంగగా నిష్టూరాలు పడ్డాడు. 
ధర్మసంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే ..
ధర్మానికి హాని కలిగినపుడు చెడు చేతిలో మంచి బాధపడుతున్నప్పుడు దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం ఏదో ఒక రూపంలో ఇలపై అవతరించాడు ఆ దేవదేవుడు. అవే దశావతారాలు. 
గీతగోవిందంలో జయదేవుడు రచించిన అష్టపదుల్లో మొదటి అష్టపది... దశావతారాలు.





మంగళశాసనం
"యది హరి స్మరణే నిరతం మనః
యది విలాస కలాసు కుతూహలమ్,
శృణు తదా జయదేవ సరస్వతీం
మధుర కోమల కాంత పదావళీమ్"
 
ఆ శ్రీమన్నారాయణుని ధ్యానించుటకు, సేవించి తరించుట యందు అనురాగము, అభిరుచి, కళలందు ఆసక్తి ఉంటే కోమలము, సుమధురమైన పదములతో నిండిన జయదేవుని కవితా సరస్వతిని వినమని కావ్యారంభంలో శ్రీసూక్తి ద్వారా ప్రార్ధిస్తాడు జయదేవుడు.






ప్రళయ పయోధిజలే ధృతవానసి వేదం
విహిత వహిత్ర చరిత్ర మఖేదం
కేశవా ధృత మీనశరీర జయ జగదీశ హరే


సకల లోకములకు ప్రభువైన ఓ కృష్ణా! హరి భక్తుల కష్టములను తీర్చువాడివి కనుక ఈ ప్రపంచాన్ని రక్షించేందుకు ఏడు సముద్రాలూ ఒక్కటై జల ప్రళయము సంభవించినప్పుడు వేదములు మునిగిపోకుండా మత్స్యావతారమును ఎత్తి రక్షించితివి.






క్షితి రతి విపులతరే తవ తిశ్ఠతి పృశ్ఠే
ధరణి ధరణ కిణ చక్రగరిశ్ఠే
కేశవా ధృత కచ్చపరూప జయ జగదీశ హరే

కృష్ణా! నీవు సర్వోత్కృష్టువు. విశాలమయిన ఈ భూమిని నీవు కూర్మావతారమునెత్తి పాతాళమున పడకుండా రక్షించుచున్నవాడవు కదా. నీకిదే నా ప్రేమపూర్వక వందనము.





వసతి దశన శిఖరే ధరణీ తవ లగ్నా
శశిని కళంకకలేవ నిమగ్నా
కేశవా ధృత సూకరరూప! జయ జగదీశ హరే

ఓ సర్వలోక రక్షకుడవైన ఓ కృష్ణయ్యా! నీకు జయము కలుగు గాక! నీవు సర్వోత్కృష్టుడవయి ఉండుము. వరాహావతారమున నీవు పాతాళమున దిగబడిన భూమిని నీ ప్రకాశవంతమైన కోరలతో ఎత్తి రక్షింపగా అది చంద్రుని పై ఉన్న మచ్చ వలే వాటియందు ప్రకాశించినది.







తవ కరకమలవరే నఖ మద్భుతశృన్జం
దళిత హిరమ్యకశిపు వర భృన్జం
కేశవా ధృత నరహరిరూప! జయ జగదీశ హరే

ఓ సర్వలోక రక్షకుడవైన ఓ కృష్ణయ్యా! నీకు జయము కలుగు గాక! నీవు సర్వోత్కృష్టుడవయి ఉండుము. నరసింహావతారమున తామర పూల వంటి నీ గోళ్ళతో భీకరాకారముగల హిరణ్యకశిపుని శరీరమును చాల చిత్రముగ చీల్చితివి.




ఛలయసి విక్రమణే బలి మద్భుత వామన
పదన ఖనీర జనిత జన పావన
కేశవా ధృత వామనరూప! జయ జగదీశ హరే

ఓ సర్వలోక రక్షకుడవైన ఓ కృష్ణయ్యా! నీకు జయము కలుగు గాక! నీవు సర్వోత్కృష్టుడవయి ఉండుము. నీవు అద్భుతమైన రీతిలో వామనాకారమును (మరుగుజ్జు) దాల్చి, బ్రహ్మచారివి అయి, బలిచక్రవర్తిని మూడు అడుగుల నేలను అడిగితివి.ఆనక త్రివిక్రముడవయి, ముల్లోకముల వ్యాపించి, నీ కాలిగోటినుండి పుట్టిన గంగను భువిపైన ప్రవహింపజేసి, దానియందు స్నానమాచరించిన వారు పవిత్రులగుదురను అనుగ్రహవర్షమును కురిపించితివి.



క్షత్రియ రుధిరమయే జగ దపగత పాపం
స్వప్నయసి పయసి శమిత భవ తాపం
కేశావా ధృత భృగుపతిరూప! జయ జగదీశ హరే

ఓ సర్వలోక రక్షకుడవైన ఓ కృష్ణయ్యా! నీకు జయము కలుగు గాక! నీవు సర్వోత్కృష్టుడవయి ఉండుము. నీవు పరశురామావతారమునెత్తి ఇరవై ఒక్క సార్లు దండెత్తి క్షత్రియులను సంహరించితివి. వారి రక్తమచే నిండిన శ్యమంతక పంచకమను ఐదు సరస్సులను కల్పించి, వానియందు స్నానమాచరించిన వారు తమ పాపములను, సంసార తాపములను పగొట్టుకునునట్లు అనుగ్రహించినాడవు.






వితరసి దిక్షు రణే దిక్పతి కమనీయం
దశముఖ మౌళి బలిం రమణీయం
కేశవా ధృత రామశరీర! జయ జగదీశ హరే

ఓ సర్వలోక రక్షకుడవైన ఓ కృష్ణయ్యా! నీకు జయము కలుగు గాక! నీవు సర్వోత్కృష్టుడవయి ఉండుము.నీవు రఘువంశమున శ్రీరామునిగా జన్మించి దశకంఠ రావణుని శిరములను ఛేదించి, పది దిక్కులలో ఉన్న దిక్పాలకులకు ప్రీతితో బలియిచ్చినావు కదా!



 
వహసి వపుశి విశదే వసనం జలదాభం
హలహతి భీతి మిళిత యమునాభం
కేశవా ధృత హలధరరూప! జయ జగదీశ



ఓ సర్వలోక రక్షకుడవైన ఓ కృష్ణయ్యా! నీకు జయము కలుగు గాక! నీవు సర్వోత్కృష్టుడవయి ఉండుము. నీవు దివ్యమైన నిర్మలమైన శరీరముతో బలరామావతారమునెత్తి, బృందావనమున గోపికలతో విహరించుచుండగా, యమునా నదిని జలక్రీడకు రమ్మని పిలువగా, అది రానందున కోపముతో నాగేటితో దాని దిశని మార్చబోవగా, యమున వస్త్రమువలె వణకినది కదా!






హరే నిందసి యజ్ఞవిధే రహహ శృతిజాతం
సదయ హృదయ దర్శిత పశుఘాతం
కేశవా ధృత బుద్ధశరీర! జయ జగదీశ హరే

ఓ సర్వలోక రక్షకుడవైన ఓ కృష్ణయ్యా! నీకు జయము కలుగు గాక! నీవు సర్వోత్కృష్టుడవయి ఉండుము. నీవు కలియుగమున బుద్ధావతారమునెత్తి, యఙ్ఞ సమయమున పశువులను వ్యర్థముగ చంపరాదని చెప్పినావు. అహింసయె పరమ ధర్మమని శాసించినావు.




మ్లేఛ్ఛనివహనిధనే కలయసి కరవాలం
ధూమకేతు మివ కిమపి కరాలం
కేశవా ధృత కల్కిశరీర! జయ జగదీశ హరే

ఓ సర్వలోక రక్షకుడవైన ఓ కృష్ణయ్యా! నీకు జయము కలుగు గాక! నీవు సర్వోత్కృష్టుడవయి ఉండుము. కలియుగమున ధర్మరక్షణార్థము నీవు తోక చుక్క వంటి ఖడ్గమును ధరించి కల్క్యావతారమును దాల్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసెదవు.




శ్రీజయదేవ కవే రిద ముదిదత ముదారం
శృణు శుభదం సుఖదం భవసారం
కేశవా ధృత దశవిధరూప! జయ జగదీశ హరే

ఓ సర్వలోక రక్షకుడవైన ఓ కృష్ణయ్యా! నీకు జయము కలుగు గాక! నీవు సర్వోత్కృష్టుడవయి ఉండుము. దశావతారములను ధరించిన ఓ కేశవా! లోకోత్తరమైనదియు, సంసార భంధనములను వదిలించునదియు, సౌఖ్యములను ఇచ్చునదియు అయిన జయదేవుని గీతమును ధరించుము.

12 వ్యాఖ్యలు:

చిలమకూరు విజయమోహన్

గోకులాష్టమి శుభాకాంక్షలు

శ్రీలలిత

జయదేవుని దశావతారాలను వ్యాఖ్యానంతో, చిత్రములతో మా ముందు నిలబెట్టారు. ఆ దశావతారాలను ఈ పండుగ సందర్భంగా బాగా వ్యాఖ్యానించారు. మీకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు.

psm.lakshmi

శభాష్ జ్యోతీ
దశావతారాల బొమ్మలదరగొట్టేశారు.
psmlakshmi

సుభద్ర

బొమ్మలు భలే ఉన్నాయి.అర్దాలతో పాటు రాయట౦ బాగు౦ది.
కిట్టయ్య కి పుట్టిన రొజు మన అ౦దరికి ప౦డగ రోజు.

మాలా కుమార్

దశావతారాల చిత్రాలు , వాటి వివరణ చాలా బాగున్నాయి .
కృష్ణాష్టమి శుభాకాంక్షలు.

మురళి

శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు

నేస్తం

బొమ్మలు,వాటి వివరణ చాలా బాగున్నాయి చాలా బాగా రాసారు కృష్ణాష్టమి శుభాకాంక్షలు

పరిమళం

జయదేవునిదశావతారాల చిత్రాలు, వాటి వివరణ బావున్నాయి జ్యోతిగారూ ! శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు .

భావన

జ్యోతి చాలా బాగున్నాయి చిత్రాలు, వివరణ. "ప్రేమ , కర్తవ్యం,గురువు అనగానే మనకు గుర్తొచ్చేది శ్రీకృష్ణుడే." చాలా బాగా చెప్పేరు.. మీకు కూడా క్రిష్ణాష్టమి శుభాకాంక్షలు

Shashank

కృష్ణాష్టమి శుభాకాంక్షలండి.

డా.ఆచార్య ఫణీంద్ర

This is the best post I have ever seen.There is Art in this. There is Music in this. There is Poetry in this. There is Literary Criticism in this. As a whole, there is our Culture in this. Our pride in this.
If anybody wishes to give an award for 'Best Post of the year in Telugu blogs', I am sure this will win unopposed.
Congratulations JYOTHI garu !

జ్యోతి

అందరికి ధన్యవాదాలు

ఆచార్య ఫణీంద్రగారు..
మీ వ్యాఖ్యతో ధన్యురాలనయ్యాను. కృష్ణతత్వం గురించి తెలుసుకోవాలనే ఉత్సుకతతో వేసిన తొలి అడుగు ఈ అష్టపది.. వివరణ..

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008