Wednesday 10 February 2010

మనమేం చేయగలం??




శ్రీనివాస్ గారి టపాకు నా సమాధానం.
వ్యాఖ్య ముదిరి టపా అవడమంటే ఇదే మరి.. శ్రీనివాస్ గారు మీరు చెప్పిన అంశాలలో మనం ఏం చేయగలం అన్నదానికి నాకు తోచిన, తప్పకుండా సాధ్యమయ్యే సమాధానాలు ఇవి. ఎప్పటికప్పుడు ఇటువంటి సంఘటనలు జరిగిన వారం రోజుల వరకు హడావిడి ఉంటుంది. తర్వాత అందరూ మర్చిపోతారు. అంతా ఆ పోలీసులే చూసుకుంటారు. చట్టం, న్యాయం తన పని చేసుకుంటుంది. మనమేం చేయగలం అని చాలా మంది అనుకుంటారు. పూర్తి సమాజాన్ని మార్చడం ఎవరి తరమూ కాదు. అధికారం, డబ్బుతో ఎవరూ మారరు. కనీసం మన ఇంటినుండే మన పిల్లలతోనే ఈ మార్పులు మొదలుపెట్టవచ్చు.

ముందుగా ఈ విషయంలో తల్లి తండ్రులు తమ పిల్లలకు నేర్పించాలి.అబ్బాయిలు, అమ్మాయిలు అని వేరుగా చూడవద్దు. పిల్లలు అని కాకుండా ప్రతి విషయం చెప్తుండాలి. చర్చించాలి. వాళ్ళతో స్నేహితుల్లా ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు. ఎక్కడ తిరుగుతున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటివారు. వాళ్ల స్నేహితులతో బయట తిరగనివ్వకుండా ఇంటికే పిలవండి. ఇక్కడ కూడా అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడాలు చూపడం మంచిది కాదు. వాళ్లకు లేని అనుమానాలు పెద్దలే సృష్టిస్తున్నారు. స్నేహితులైనా, కొలీగ్స్ అయినా. వాళ్ళ ఫ్రెండ్స్, ఆఫీసు ముచ్చట్లు అడుగుతుండాలి. మరీ అన్ని కాకున్నా చాలా విషయాల్లో వాళ్ళ విషయాల్లో మనని, మన విషయాల్లో వాళ్ళని భాగస్వాములను చేయాలి. ఒకవేళ వాళ్ళు ప్రేమలో పడితే మనం భయం పెడితే చెప్పలేరు. అదే మనం మంచిగా, బుజ్జగించి అడగాలి. అసలు ప్రేమంటే ఏంటి?. వాళ్లకు అవతలి వ్యక్తి గురించి ఏం తెలుసు? , ఎందుకు ఇష్టపడుతున్నారు వంటి విషయాలు తెలుసుకోవాలి. తప్పేదో, ఒప్పేదో అర్ధం చేయించాలి. ఇలా ఉంటే పిల్లలు తల్లితండ్రులతో ఫ్రీగా ఉంటారు. వాళ్ళు మనసు విప్పి మాట్లాడుకోవడానికి వేరే దారి లేక వేరే వారి మీద ఆధారపడతారు. వారికి సరైన దారి చూపించేది వారి సమవయస్కులా? అనుభవమున్న పెద్దలా? ఈరోజు ప్రేమించడం అనేది సర్వసాధారణమైపోయింది. పిల్లలు ప్రేమించాం అన్నపుడు పెద్దలు కూడా ఆలోచించాలి. మొండికేయకుండా వారివైపు నుండి ఆలోచించాలి. లేదంటే ఆత్మహత్యలు.. అదే విధంగా ప్రేమ పేరుతో వేధించే అబ్బాయిల నుండి తల్లితండ్రులే తమ కూతురికి రక్షణ కల్పించాలి. ఒకవేళ తమ అబ్బాయి ఏ దారుణమైనా చేస్తే తల్లితండ్రులు అతడిని సమర్ధించకుండా చట్టానికి అప్పగించాలి. బయటకు తీసుకురావొద్దు. వచ్చినా అతడితో సంబంధాలు తెంచుకోవాలి. ఇక్కడ ఆ వ్యక్తి తమ కన్నకొడుకు, భర్త అనే దానికంటే అతడొక దుర్మార్గుడు. ఒక అమ్మాయిని గాయపరిచాడు. హత్య చేసాడు అని ఆలోచించాల్సింది పెద్దలే. నేరం చేసినవాడిని సంఘంలో హాయిగా తిరగనివ్వడం వల్లనే మరి కొందరు ఇటువంటి నేరాలు చేయడానికి ఆస్కారం అవుతుంది. అసలైతె ఇలాంటి దారుణానికి ఒడిగట్టినవాన్ని తల్లితండ్రులే కాల్చి చంపేయాలి. లేదా తగిన శిక్ష విధించాలి. ప్రతి రోజు తను చేసిన తప్పు గుర్తు చేసుకుని పశ్చాత్తప పడేలా చేయాలి. అది వారి చేతిలో ఉన్న పనే. అమ్మో నా కొడుకు అనుకుంటే .. ఎవరేం చేయలేరు.

ప్రతి ఆడపిల్ల ముందుగా తమని తాము గౌరవించడం నేర్పించాలి. అబ్బాయిలను కూడ అమ్మాయిలను గౌరవించేలా పెంచాలి. అది చిన్నప్పటినుండి జరిగితేనే మంచి వ్యక్తులుగా ఎదుగుతారు. అమ్మాయిలు సుకుమారులు, సున్నిత మనస్కులైనా తమని తాము మానసికంగా శక్తివంతులుగా చేసుకోవాలి. ఎటువంటి వేధింపులు ఎదురైనా ఒంటరిగా ఎదుర్కునేలా ఉండాలి. భయపడితే లాభం లేదు. ఎవరో వస్తారని ఎదురు చూసే బదులు తామే ఆ సమస్యని పరిష్కరించుకోవాలి. ఒంటరిగా ఎదుర్కోలేము అనుకుంటే తోటివారిని కలుపుకుని గుంపులా ఎదురుదాడి చేయండి. భయంతో వెనకకు వేసే బదులు ధైర్యంగా ఒక్కడుగు ముందుకు వేయండి. తోకముడుచుకుని పారిపోతారు. మీలోని ఆత్మవిశ్వాసమే మీకు కొండంత అండ.. ఈ స్వభావం చదువుకున్నప్పుడే కాదు. జీవితంలో ఎదురయ్యే అన్ని క్లిష్టపరిస్థితుల్లో కూడా ఉండాలి. ఆడది ఆప్యాయతనిచ్చే అమ్మగానే కాక అవసరమైతే ఆదిశక్తిలా కూడా మారగలదు అని నిరూపించాలి..

ఆడవారికి ప్రతీ చోట అవమానాలు తప్పడంలేదు. కాలేజీకెళ్లినా, ఉద్యోగానికి వెళ్లినా లైంగిక వేధింపులు తప్పడం లేదు. ఎంత విధ్యాధికులైనా ఆడవారిని హేళన చేయడం, అసభ్యంగా ప్రవర్తించడం తమ జన్మహక్కు అనుకునే నీచులు ఎంతోమంది మన సమాజంలో కనిపిస్తూనే ఉంటారు. వారిని ఏమీ అనలేము. ఎందుకంటే వారు మానసిక వికలాంగులు కాబట్టి. మనమే దయచూడాలి. శృతి మించితే చెప్పు దెబ్బల రుచి చూపించాలి.

నేను చెప్పిన మాటలు సినిమా డైలాగులు, ఏదో స్త్రీవాద పుస్తకంలోని మాటలు కాదు. నేను నమ్మేవి, మా పిల్లలకు కూడా చేప్పేది.. ప్రతీ తల్లి ఇలా మారితే కొంతవరకైనా ఆడపిల్లల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు మారతాయి. పిల్లల వ్యక్తిత్వం, సంస్కారం ఎటువంటిదో తల్లితండ్రులకే ఎక్కువ తెలుస్తుంది కదా. ప్రేమతో లాలించాలి, దారి తప్పితే దండించాలి.... ఆ పని చేయకుండా అవతలివాడిని నిందించడం అన్యాయం.

7 వ్యాఖ్యలు:

చెప్పాలంటే......

jyothi garu meru cheppindi andaru achariste aadapillalaki ebbandulu vundavu

జ్యోతి

మంజుగారు,
ఆచరిస్తే కాదు. ఆచరించాలి. మారాలి. తప్పదు. లేకుంటే ఈ దారుణం ప్రతిరోజు చూడక తప్పదు. ఏదో ఒకరోజు మన ఇంట్లో కూడ జరుగుతుంది. అప్పుడు ఎవరిని వేలెత్తి చూపుతారు.

కెక్యూబ్ వర్మ

పిల్లల పెంపకం లోనే మార్పు రావాల్సిన అవసరం వుంది. బాల్యం నుండి వారిమధ్య తేడాలను చూపుతూ పెంచడం వలన, పురుషాహంకార సమాజం కావడం మూలంగా, ఆడపిల్లల్లో అభద్రతా భావంతో పెరగడం మూలంగా ప్రస్తుత పరిస్తితికి కారణం. మీ విశ్లేషణ బాగుంది. అందరికి ఆచరనియాం కావాల్సిన అంశాలను తెలియజేసారు. ధన్యవాదాలు.

పరిమళం

అసలు చిన్నతనం నుండే తల్లితండ్రులు ఆడపిల్లల పట్ల వివక్ష చూపకుండా ...స్త్రీలని గౌరవించడం మనసాంప్రదాయం అనే విషయం వారు పాటిస్తూ పిల్లలకు నేర్పిస్తే ఇటువంటివి నివారించావచ్చేమో అనుకుంటున్నా !

Sunita.R

జ్యోతి గారు,
బాగా చెప్పారు. ప్రతి ఇంటిలో తల్లి, తండ్రులు తమ పిల్లలని దారిలో పెట్టాలిసిందే. ఇంటిలో తన అక్కకు, చెల్లికి గౌరవం ఇవ్వటం నేర్పటం వలన సమాజంలో అతని ప్రవర్తన మారుతుంది. ఇంట, బయట ప్రతి స్త్రీని గౌరవించటం నేర్పించాలి. పిల్లవాడు తప్పుచేసినప్పుడు దండించాలి. మంచి పనులు చేసినపుడు పొగడాలి. అప్పుడే పిల్లవానికి మంచి, చెడుల విచక్షణ కలుగుతుంది.

భావన

బాగుంది జ్యోతి.. పిల్లలను సరి గా పెంచటం అనే ప్రక్రియ తల్లి తండ్రులు నేర్చుకుంటే ఇన్ని సమస్యలే రావు సమాజం లో..
నిజమే మనం ఆశించే ఏ మార్పు ఐనా ముందు మన ఇంట్లో మనం చేయగలిగితే అదే పెద్ద సంస్కరణ.

Sunita.R

ఇతర దేశాలలో లాగ మనకి 'పేరెంటింగ్' ప్రక్రియ లేదు. తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలో నేర్పిస్తారు అక్కడ. ఇక్కడ కూడా అలాంటి కోర్సులు వుంటే బాగుణ్ణు.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008