Saturday 27 February 2010

మీ తెలుగు వినియోగం ఎంత?






తెలుగు వాళ్లమై ఉండి , తెలుగు దేశంలో ఉండి, తెలుగు బ్లాగులు రాస్తూ తెలుగు వినియోగం అంటున్నానేంటి అనుకుంటున్నారా?? ఏం చేస్తాం మరి. తప్పదుగా. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంగ్లీషు మాత్రమే మాట్లాడే భాష, తెలుగు అంటే ఏంటి? అంటున్నారు. తెలుగు మాట్లాడితే శిక్షలు తప్పడంలేదు పిల్లలకు. తల్లితండ్రులకు కూడా తమ పిల్లలు వాస్ పీస్ అంటూ ఇంగ్లీషులో మాట్లాడేయాలి అని చిన్నారుల తొలిపలుకులు కూడా ఇంగ్లీషుతోనే మొదలుపెడుతున్నారు. ఐతే గీతే ఇప్పటి పిల్లలకు తెలుగు మాట్లాడ్డం వస్తుంది కాని రాయడం , చడవడం మాత్రం సున్నా. ఏమంటే స్కూల్లో చెప్పరు, ఇంట్లో చెప్పడానికి మాకూ టైం లేదు, పిల్లలకూ టైం లేదు అంటున్నారు. కాదంటారా?? అందుకే తెలుగు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన దరిద్రం పట్టింది.


పిల్లల సంగతి వదిలేద్దాం. ఈనాడు కంప్యూటర్, అంతర్జాలం వాడకం గణనీయంగా పెరుగుతుంది. స్కూలు పిల్లాడికి కూడా కంప్యూటర్ పాఠాలు, ప్రాజెక్టులు తప్పడంలేదు. దానికోసం తల్లితండ్రులు ఇంట్లో కంప్యూటర్, జాల అనుసంధానం ఏర్పాటు చేస్తున్నారు. పిల్లలు సరే తమ అవసరాల కోసం కంప్యూటర్ వాడుకుంటున్నారు. అదంతా ఇంగ్లీషులోనే అని వేరే చెప్పనక్కరలేదు. మరి అంతర్జాలం అంటే మొత్తం ఇంగ్లీషేనా. ఆ భాష రానివారి గతేంటి? కంప్యూటర్లో తెలుగు రాయడం ఎలా? దానికోసం ఏదైనా సాఫ్ట్ వేర్ కొనాలా? అది నేర్పేవాళ్లెవరు. ఇలా సవాలక్ష సందేహాలు. మూడేళ్ల క్రిందవరకు కంప్యూటర్లో తెలుగు వాడకం అనేది చాలా తక్కువగా ఉండేది. కాని లేఖిని మొదలైన పనిముట్ల సాయంతో ఇంగ్లీషు రాసినంత సులువుగా తెలుగు కూడా ఎటువంటి ఖర్చు లేకుండా రాయగలుగుతున్నాము. క్రమ క్రమంగా ఈ భాషావ్యాప్తి ఒక ఉద్యమంలా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. బ్లాగులు, వెబ్సైట్లు ఎన్నో తెలుగులో దర్శనిమివ్వసాగాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఇప్పుడు తాము మాట్లాడుకున్నంత సులువుగా తెలుగురాయగలుగుతున్నారు. సమాచార , విషయ పరిజ్ఞానాన్ని అతివేగంగా విస్తరింపచేస్తున్నారు.

తెలుగు వినియోగం ఒక వెల్లువలా ఎగసి నలుదిసలా వ్యాపించింది. వంటలైనా, పాటలైనా, పురాణాలైనా, ప్రబంధాలైనా , మన చిన్నప్పుడు చదువుకున్న చందమామలు శతకాలైనా, సంబరాలైనా .. మనకు కావలసిన సమాచారం తెలుగులో లభ్యమవుతుంది. అది మీకు తెలుసు .. చివరకు జిమెయిల్, ఆర్కుట్ , ఫేస్ బుక్ , బ్లాగులు కూడా తెలుగు ఇంటర్‌ఫేస్ తో చూసుకోవచ్చు.

నేను మూడేళ్ల క్రింద తెలుగు బ్లాగుల్లోకి వచ్చినప్పుడు బ్లాగులు పదుల సంఖ్యలో ఉండేవి. చాలా మంది మంటనక్కలో పద్మ జతచేర్చి తెలుగు రాసేవారు. తర్వాత లేఖిని వచ్చింది. లేఖినితో మొదలైన నా రాత బరహ తో కొనసాగించి ఇప్పుడు అను వరకు మారుతూ వచ్చింది. జాలానికి వచ్చిన కొత్తలో ఎక్కువగా ఇంగ్లీషు వాడేదాన్ని. ఇప్పుడు ఆ పరిస్థితి తారుమారైంది. ఇంగ్లీషు పట్ల అనాసక్తి పెరిగి తెలుగు పట్ల మక్కువ పెరిగింది. ప్రతీది తెలుగులోనే చూడాలనుకుంటున్నాను. అందుకే వంటల సైట్ కూడా తెలుగులో మొదలుపెట్టాను. కాని కొందరు మిత్రులు మరీ తెలుగువారి మీదే మీ అభిమానమా? తెలుగు రానివారి సంగతేంటి? అంటే ఇంగ్లీషులో కూడా బ్లాగు రాస్తున్నాను. నా డాక్యుమెంట్లు , ఫైళ్లు కూడా తెలుగులోనే దాచుకుంటున్నాను. కంప్యూటర్ తెరవగానే నా తెలుగు వినియోగం దాదాపు 80% ఉంటుంది.

ఈ విషయంపై మీ అభిప్రాయం , అనుభవాలు పంచుకుంటారా? అలాగే సందేహాలు, సమస్యలు కూడా నిరభ్యంతరంగా , నిస్సంకోచంగా ప్రస్తావించండి. పరిష్కారం కోసం ప్రయత్నించవచ్చు.

మరి మీ సంగతేంటి? కంప్యూటర్లో మీ తెలుగు వినియోగం ఎంతవరకు ఉంది? వీవెన్ బ్లాగులో జరుగుతున్న అభిప్రాయ సేకరణలో మీ ఓటు వేసేయండి మరి..

7 వ్యాఖ్యలు:

మాలా కుమార్

నేను 90% తెలుగే వాడుతాను . మీరిచ్చిన లింక్ లోకి వెళ్ళి వోట్ వేసి వచ్చాను . 80 - 100 కి వేసాను .

సుభద్ర

నేను అయితే తో౦బైశాత౦ తెలుగునే వాడాతాను.నేను మైల్స్ చేసినా,జవాబులు రాసినా...
నా సరదా చూసి నాదోస్తలు కూడా నాకు మటుకు తెలుగు లో రీప్లై చేస్తూ౦టారు..
ఓటు వేయాడానికి వెళ్లుతున్నా...

నిరంజన్

నేను పూర్తిగా తెలుగులొనే నా వేగులు,టపాలు వ్రాస్తున్నాను.ఇక నేను ప్రతి సమావేశంలో తెలుగులొనే మాట్లాడతాను.

శ్రీలలిత

నేను కావాలని తెలుగులో కంప్యూటర్ లో మైక్రొసాఫ్ట్ ఆఫీస్ కోర్స్ చేసాను ఆంధ్ర మహిళా సభలో.
ILeap లో టైపింగ్ కూడా బాగా చెయ్యగలను. మా పిల్లలకి తెలుగు లోనే టపాలు పంపుతాను. తెలుగుభాషంటే నాకు మా అమ్మంత ఇష్టం.
ఎప్పుడో 90% కి ఓటు వేసి వచ్చాను.

kaartoon.wordpress.com

మీరు తెలుగు భాషను ఉపయోగించడములో వ్రాసింది నిజంగా నిజం! శెలవలకు మద్రాసు నుంచి మా ఇద్దరు మనవల్లు,బొంబాయి నుంచి మనవరాలు వచ్చినప్పుడు
వాళ్లకు తెలుగు రాకపోవడము వల్ల నా చిన్నప్పటి చందమామలు,బాల పత్రికలు వున్నా
ఉపయోగం లేకపోతున్నది.ఇప్పుడిప్పుడే మా అమ్మాయిలు వాళ్ళకు తెలుగు అక్షరాలు నేర్పు
తున్నారు. తెలుగు పత్రికలు కొనడం చదవటం నామోషీగా భావించే తెలుగువాళ్ళు చాలామంది
ఉన్నారు.అది మన దురదృస్టం.********************************సురేఖ***

psm.lakshmi

ప్రస్తుతానికి నాకు తెలుగు తప్ప వేరే భాషల అవసరం కనబడటంలేదు. అందుకే వాటిని మరచిపోయే అలవాటు అవుతోంది. మాతృభాషకి గౌరవం ఇవ్వటం తప్పనిసరి..అలాగే ఆ భాష రానివారితో వారికి అర్ధమయ్యే భాష...అక్కడ తెలుగే అంటే ఇబ్బంది కదా.
psmlakshmi

అన్వేషి

మరీ మీలా "మంటనక్క" "కిటికీలు" అనేటంత కాదుగాని, బాగానే వాడతాను తెలుగు కూడా! మరి కంప్యూటరేం పాపం చేసిందండి దాన్నలాగే వదిలేశారు ? కృషిచేస్తే మంచి పదబందం సృష్టించగలరు.మీరు చెప్పినట్లు ఇప్పుడే ఓటు చేస్తాను.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008