Tuesday 2 November 2010

ఇదేనా జీవితం? నవంబర్ 2010 కంప్యూటర్ ఎరా ఎడిటోరియల్

చిన్నప్పటినుండి మన లక్ష్యాలు చాలా చిన్నవి. చదువులో గొప్ప ర్యాంకులు, ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం, అర్ధం చేసుకునే లైఫ్ పార్ట్ నర్, పిల్లలు, సంసారం, సెలవుల్లో సినిమాలూ, సరదాలూ, మళ్లీ పిల్లల సెటిల్‌మెంట్, వారి పెళ్లిళ్లు, వృద్ధాప్యం, సాఫీగా సాగిపోతే చాలుననే భరోసా.... ఇవి ఉంటే చాలు జీవితం నెట్టుకురావడానికి! అంతకన్నా ఏ ఆలోచనా మనకు తట్టదు. ఇంచుమించు అందరి జీవితాలు అంతే... ఓ మూసలో సౌకర్యవంతంగా సాగిపోతూ ఉంటాయి. ప్రతీ క్షణం మనకు సామాజిక, ఆర్ధిక భద్రత ఉంటే చాలు. ఆ భద్రత సాధించడానికే మన జీవితం సృష్టించబడింది అన్నట్లు ఆ కొద్దిపాటి లక్ష్యాల కోసమే అమూల్యమైన జీవితాన్ని త్యాగం చేస్తుంటాం. చివరకు పిల్లలకూ అదే హితబోధ ... ఎంతో మందిని చూస్తుంటాను. అందరూ చెప్పేదొక్కటే.. ‘బాగా చదువుకో, బాగా సంపాదించు, లైఫ్‌లో సెటిల్ అవు '. అంతకన్నా జీవితం లేదా? ఒక మనిషి సాధించడానికీ, తనని తాను ఈ ప్రపంచంలో ఓ అద్భుతమైన శక్తిగా నిలబెట్టుకోవడానికి ఇంకేమీ ఉన్నతమైన లక్ష్యాలు లేవా? డబ్బూ, సామాజిక హోదా జీవిత పరమావధులు కావు. అవి మనకు సౌఖ్యాలు అందిస్తాయంతే. ప్రతీ మనిషిలోనూ నిగూఢంగా ఎన్నో శక్తియుక్తులు కేంద్రీకృతమై ఉంటాయి. ఎక్కడా ఎవరూ వాటిని తట్టిలేపడానికి ప్రయత్నించరు. స్టీరియోఫోనిక్‌గా జీవించమని ప్రబోధించేవారే గాని!

మనం గొప్పవాళ్ల పేర్లు చెప్పుకుంటూ ఉంటాం. వాళ్లు మాట్లాడిన మాటల్ని చిలకపలుకుల్లా వల్లె వేస్తుంటాం. వారంత గొప్పవారు ఎలా అయ్యారు? అసలు ఈ ప్రపంచంలో మన ఉనికిని నిలబెట్టుకోవడానికీ, 'యెస్.. నేను ఫలానా... నేను ఈ ప్రపంచానికి ది బెస్ట్ అందించగలుగుతున్నాను.. ఈ పనిని నేను తప్ప మరొకరు చెయ్యలేరు' అని ధీమాగా చెప్పుకోగలగడానికి మనకింకేమీ మార్గాలు లేవా? అస్సలు అందరితో పోల్చుకుంటూ, అందరికన్నా నాలుగు రాళ్లు ఎక్కువ సంపాదించడమో, కొద్దిగా ఎక్కువ పేరు తెచ్చుకోవడమో చేయగలిగితే చాలు అని సంతృప్తిపడగలుగుతున్నామంటే ఎంత అల్పసంతోషులమో అర్ధమవట్లేదూ? ఇంత చిన్న లక్ష్యాలకు ఇన్నేళ్ల జీవితం అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. ఆర్ధిక, సామాజిక భరోసాలను చూసుకుంటూ, ఆస్థిపాస్థులను లెక్కించుకుంటూ జీవితం వెళ్లదీయడానికి మనం పుట్టింది సౌకర్యాలు అమర్చుకోవడానికీ, సౌఖ్యాలు అనుభవించడానికీ కాదు! సౌకర్యాలు, సౌఖ్యాలు మనదైన ప్రపంచాన్ని సృష్టించుకునే క్రమంలో మనకు భారం తగ్గించేందుకే తప్ప అవే జీవితం కాదు. వాటిని దక్కించుకోవడంతోనే జీవితాన్ని సరిపుచ్చుతున్నామంటే ఈ ప్రపంచంలొ మన బ్రతుకు మనం బ్రతికేసి ఎందుకూ కొరగాని జీవితాన్ని గడిపేసి వెళుతున్నామన్నమాట. అంతకన్నా మనం చేయడానికి చాలా ఉంది ఈ ప్రపంచంలో! అదేంటో కొంత మనసు పెట్టి ఆలోచించగలిగితే స్ఫురిస్తుంది. సామాజిక భద్రతను కాపాడుకుంటూనే ఈ ప్రపంచంలో మన ప్రత్యేకతను నిలబెట్టుకోవచ్చు. అంతేగాని సామాజిక భద్రత సాధన కోసమే జీవితం ధారపోయాల్సిన పనిలేదు. విజ్ఞులైన కొద్దిమంది పెద్దలైనా ఈ ప్రపంచానికి భవిష్యత్ తరాలనుండి ఏం కావాలో ఆలోచించగలిగి, వారికి స్టీరియోఫోనిక్ జీవితాల బదులు, ఆదర్శవంతమైన జీవనవిధానాన్ని, సందేశాన్ని బోధించగలిగితే చాలు. ప్రతీ వ్యక్తిలోని అద్భుత శక్తియుక్తులు మనం కళ్లారా చూస్తాం. ప్రపంచానికి మేలు జరుగుతుంది.

మీ నల్లమోతు శ్రీధర్

8 వ్యాఖ్యలు:

S. Suresh

అచ్చంగా నా ఆలోచనలు కూడా ఇలానేవుంటాయి. మీరు చెప్పిన ప్రతి అక్షరం నిజం. భవిష్యత్తు నుంచి చూస్తే చరిత్రలో మనకు ఖచ్చితంగా ఒక పేజీ ఉండాల్సిందే. అప్పుడే మన జీవితం పరిపూర్ణం. :)

Admin

జ్యోతి గారు మీరు నిజంగా గ్రేట్.అందుకంటే మీరు 9 బ్లాగ్స్ లను రాస్తున్నారు.

Anonymous

inspiring .. You rock Sridhar !

సి.ఉమాదేవి

ఏది కూడదు,ఏది కావాలి అని తెలుసుకోవడానికే సగం జీవితం గడచిపోతుంది.మానవ మేధ సూపర్ కంప్యూటర్!అమోఘమైన మేధోవనరులను వెలికితీసి భావితరాలకు నిత్య చైతన్య స్రవంతిగా స్ఫూర్తిదాయక ఫలాలను అందించ గలగడమే ప్రతి మనిషి లక్ష్యం కావాలి. సామాజిక,ఆర్థిక భద్రత జీవితంలో ఒక పార్శ్వం మాత్రమే.ఇంతకు మించిన ఆదర్శవంతమైన జీవితానికి ప్రణాళిక రచింపబడాలి. అందులో పరిపూర్ణ మానవుడిగా నిలవాలంటే నిష్కపటం, నిస్వార్థం,నిజాయితీ వంటి ఆచరణీయ సద్గుణాలెన్నో పొందుపరచబడాలి.అప్పుడు మనిషి జీవితం మానవతా పరిమళభరితమే.ప్రపంచాన్ని జయించినా,అంతరిక్షానికి నిచ్చెన వేయగలిగినా మానవుడు విడువకూడనిది మానవత్వమే. సర్వమానవాళి మనసులను గెలుచుకునేందుకు,ఇదీ జీవితం అని ముందు తరాలకు తెలిపేందుకు మానవత్వాన్ని వీడనపుడే మనిషి మనీషి అవుతాడు.

కొత్త పాళీ

good one, Sridhar.

జేబి - JB

బాగా చెప్పారు. నేను అప్పుడప్పుడు ఇలా ఆలోచిస్తుంటా, కానీ అక్కడే ఆగిపోతా :-(

Unknown

@ సురేష్ గారు.. అవును మీ మనస్థత్వం నాకు ఎప్పటినుండో తెలుసు. మీ తపన అందరికీ ఆదర్శదాయకం.
@a2dreams గారు, థాంక్యూ వెరీమచ్.

@ ఉమాదేవి గారు.. "ప్రపంచాన్ని జయించినా,అంతరిక్షానికి నిచ్చెన వేయగలిగినా మానవుడు విడువకూడనిది మానవత్వమే. సర్వమానవాళి మనసులను గెలుచుకునేందుకు,ఇదీ జీవితం అని ముందు తరాలకు తెలిపేందుకు మానవత్వాన్ని వీడనపుడే మనిషి మనీషి అవుతాడు" అంటూ నేను రాయడం విస్మరించిన అతి ముఖ్యమైన గుణాన్ని మీరు వివరించారు, మీ స్పందనకు ధన్యవాదాలు.

@ కొత్తపాళీ గారు, థాంక్యూ అండీ.

@ JB గారు.. నిజంగా చెప్పాలంటే మనందరిలోనూ ఇలాంటి ఆలోచనలు అంతర్లీనంగా తొలుస్తూనే ఉంటాయి. ఆ క్షణానికి వాటిని నిద్రపుచ్చి సాధారణ జీవితంలో కొనసాగుతుంటాం. మీ స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు.

Sunita.R

శ్రీధర్ గారు, ఉమా దేవి గారు, చాలా బాగాచెప్పారు. గ్రేట్ అండీ. మానవతా విలువలు పెంచటానికి మన అందరం కలిసి ఏమైనా చేయగలమా?

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008