Thursday 10 November 2011

కార్తీక వనభోజనాలు -బొంబాయ్ హల్వా



ముంధుగా అందరికి కార్తీక పూర్ణిమ శుభాకాంక్షలు. మరి ఈ రోజు బ్లాగ్ వనభోజనాలు అనుకున్నాం కదా. అఫ్పుడే హడావిడి మొదలైంది. నావంతుగా స్వీటు తెచ్చాను. అందునా నాకు చాలా చాలా ఇష్టమైంది..

స్వీట్లంటే నాకు మొదటినుండి ఇష్టమే కాని డబ్బా ఖాళీ చేసేంత ఇష్టం కాదులెండి. కాని అన్నింటికంటే చాలా చాలా ఇష్టమైంది రబ్బర్‌లా సాగే రంగు రంగుల బొంబాయి హల్వా, గట్టిగా రాయిలా ఉండే సోన్‌పట్టీ. ముఖ్యంగా పుల్లారెడ్డి, బొంబాయ్ హల్వా షాపులోవే బాగుంటాయి. ఇంక వేరేవ్వరూ అలా చేయలేరు కూడా. ఇప్పుడు బొంబే హల్వా దుకాణం ఎత్తేసారు. మిగిలింది పుల్లారెడ్డి.. చిన్నప్పటినుండి ఎవరు స్వీట్ డబ్బా తెచ్చినా అందరికంటే ముండు ఈ రెండు స్వీట్లు కనిపిస్తే ఎత్తేసేదాన్ని. వీటికోసం మా మరదలు. నా కొడుకు నాతో పోటీకొస్తారు... అందుకే ఈ స్వీట్లను జాగ్రత్తగా డబ్బాలో పెట్టి నా అల్మైరాలో దాచుకుంటాను. ఎప్పుడైనా తీరికగా ఉన్నప్పుడు ఓ పుస్తకం పట్టుకుని ఓ స్వీటు ముక్క కొంచం కొంచం తింటూ చదువుకోవడం చాలా ఇష్టమైన అలవాటు. అదేంటో ఇప్పుడు ఎవరూ స్వీట్ డబ్బాలు తేవట్లేదు. తెచ్చిన కూడా అందులో ఈ హల్వా ఉండదు. ఎంత ఇష్టమైనా ముందులా తినే వయసు కాదు. ప్చ్..

అసలు ఈ స్వీట్ ఇంట్లో కూడా చేయొచ్చు అనే విషయం అస్సలు తెలీదు. అది స్వీట్ షాపువాళ్లే చేయగలరు, మనం ఇంట్లో చేయలేం అనుకునేదాన్ని. లేకుంటే ఎప్పుడో చేసుకుని తినేదాన్ని కదా. ఈ మధ్యే ఒక ఇంగ్లీషు ఫుడ్ బ్లాగులో ఈ హల్వా చేసుకోవచ్చు అని తెలిసింది. అది కూడా చాలా ఈజీగా. మరి నేను ఊరుకుంటానా?? చేసి తినేసా. అందరికీ చెప్పుకున్నా బొంబాయ్ హల్వా చేసానోచ్ అని. మరి మావాళ్లు అందరికీ తెలుసు అదంటే నాకెంత ఇష్టమో?? కాని తెలిసినా అప్పుడప్పుడు తెచ్చివ్వాలని మాత్రం ఒక్కరూ అనుకోలేదు ఇంతవరకు..

ఇక ఈ హల్వా ఎలా చేయాలో చెప్పనా...

కార్న్ ఫ్లోర్ - 5 tbsp
పంచదార - 1 1/2 కప్పులు
నీళ్లు - 3 1/2 కప్పులు
గుమ్మడికాయ గింజలు లేదా కాజు, బాదాం, పిస్తా ముక్కలు - 1/4 కప్పు
నెయ్యి - 2 tbsp
ఇలాచి పొడి - 1/2 tsp
ఓరెంజ్ లేదా గ్రీన్ కలర్ - 3 - 4 చుక్కలు

మూడు కప్పుల నీళ్లు మరిగించి చక్కెర వేసి చిక్కబడి తీగపాకం వచ్చేవరకు మరిగించాలి. మరో పక్క ఒక ప్లేటుకు లోపలంతా నెయ్యి రాసి ఉంచుకోవాలి. మిగిలిన సగం కప్పు నీళ్లలో కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి . ఈ మిశ్రమాన్ని మరుగుతున్న చక్కెరపాకంలో వేసి ఉడికించాలి. ఇప్పుడు ఇది పాలల్లా తెల్లగా ఉంటుంది . క్రమేణా రంగు మారి పారదర్శకంగా గ్లాసులా అవుతుంది. ఇప్పుడు ఇలాచి పొడి, నెయ్యి, కలర్, చిన్న ముక్కలు చేసిన డ్రై్‌ఫ్రూట్స్ లేదా గుమ్మడి గింజలు వేసి కలపాలి. వెంటనే దింపేసి నెయ్యి రాసిన పళ్లెంలో వేసి సమానంగా పరవాలి. గంట సేపు అలా వదిలేసి ముక్కలు కట్ చేసుకుంటే సరి.. ఈ స్వీటు చేసేటప్పుడు నిదానంగా చిన్న మంటపై చేయండి. వీలుంటే నాన్ స్టిక్ ప్యాన్ ఉపయోగించండి. లేకుండే మాడుతుంది.

ఇది చదివాక కూడా అర్ధం కాలేదంటే. ఏదైనా డౌట్ ఉంటే ఈ వీడియో చూసేయండి.


17 వ్యాఖ్యలు:

లత

హల్వా బావుంది జ్యోతిగారూ
నాకు కూడా ఇదంటే ఇష్టమే.ట్రై చేస్తాను

కృష్ణప్రియ

వీడియో కూడా పెట్టారు. బాగుంది.

మాలా కుమార్

ఇది నాకూ ఇష్టమేనండి . అప్పుడప్పుడు నాకోసం చేసుకుంటూ వుంటాను .

భమిడిపాటి సూర్యలక్ష్మి

మా చెల్లెళ్ళు చిన్నపుడు ఆంధ్రా వెళ్ళెటప్పుడు తప్పనిసరిగా " కరాచి హల్వా", లక్ష్మీనారాయణ చూడా" తీసుకొని వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు అన్నీ, అన్ని చోట్ల దొరకుతున్నాయి. చేసుకోను చేసుకుంటున్నారు.

జయ

బాగుందండి హల్వా. ఇంక సుబ్బరంగా తినేయటమే:)

సిరిసిరిమువ్వ

చూట్టానికి బాగుంది. తీపికి నాకూ ఆమడ దూరం..నా బదులు కూడా మీరే తినేయ్యండి.

జ్యోతిర్మయి

అసలే స్వీట్ అంటే మక్కువ ఎక్కవ. హల్వా చూస్తుంటే నూరూరిపోతుంది.

శ్రీలలిత

జ్యోతిగారూ,
హల్వా చాలా రుచిగా వుందండీ..

Mauli

చూస్తుంటే చాలా బావు౦ది :)

Ennela

సూపర్ హల్వా...అంతా నాకేనా...భలే తేలిగ్గా ఉంది నేనూ చేస్తా...

Unknown

నాకు ఇష్టం అయిన ఈ స్వీట్ ఇంత సులువుగా చేయచ్చని తెలిదు.
థాంక్స్ జ్యోతి గారు.

Padmarpita

మీరు చేసే ప్రతి వంటా ఎంతో సులువుగా అనిపిస్తుంది...హల్వా కలర్ ఫుల్ గా వుంది అంటే టేస్ట్ కూడా చాలా బాగుండి ఉంటుంది...అందుకే నాకు ఒక్కముక్క కూడా మిగల్చలేదు:)

Disp Name

అదేమిటో చోద్యం, ఈ ఐటీ వాళ్ళు క్లౌడ్ కంప్యూటింగ్ లాంటివి కనబెడతారు గాని, అలా జ్యోతి గారు బ్లాగు లో ఈ లాంటి మాంచి స్వీట్లు పోస్ట్ చేస్తే, మనం టపా ఓపెన్ చెయ్యగానే ఆ స్వీట్లన్ని మన ప్లేట్లల లోకి వచ్చి పడేట్టు చేయ్యరేమిటి చెప్మా ? ఇట్లాంటి ఐటీ వస్తే బాగుణ్ణు. జ్యోతి గారు బ్లాగు ఓపెన్ చెయ్యగానే ఘుమ ఘుమ అన్న సువాసనలు వచ్చేట్టు స్మెల్ కంప్యూటింగ్ వెంటనే ఐటీ లోకపు వాళ్ళు కనబెట్టేయ్యాలని నా ఆర్డరు అహో !

జ్యోతి

లత, కృష్ణప్రియ, మాలాకుమార్, లక్ష్మిగారు, జయ.. ధాంక్స్ అండి.

వరూధినిగారు మీకు స్వీట్స్ ఇష్టంలేదా. అందుకే మరి మీరలా నేనిలా ఉన్నాం..:))

జ్యోతి

శ్రీలలితగారు ధాంక్స్,

జ్యోతిర్మయిగారు మీ గులాబ్ జామూన్ ఇంకా రుచి చూడలేదు. ఎక్కడా విరిగితే కదా .. కాస్త పెద్ద రాయుచ్చుని విరగ్గొట్టి తినేసి వస్తాను

మౌళి, ఎన్నెల.. ధాంక్స్. చేసేయండి మరి..

శైల, మీకు కూడా ఇష్టమేనా. సంతోషం.

జ్యోతి

పద్మ ఎవరన్నారు ఐపోయాయని. నేను దాచుకున్న సీట్ ఉందిగా . రండి మనిద్దరం కలిసి తిందాం.

జిలేబిగారు. మరీ మోసేస్తున్నారండి. ఏధో అలా దేవుడిమీద భారమేసి వండేస్తు ఉంటాను. మా వారేమో నాకు వంట రాదు. అసలు వంట చేయడమే మర్చిపోయానని దెప్పుతున్నారు. అదీ కూడా పెళ్లైన 28 ఏళ్లకు.

మీకోరిక ఎవరైనా తీరిస్తే చెప్పండి నేను కూడా కూరలు, స్వీట్లు తెప్పించుకుంటాను. రోజు ఏం వండాలో అర్ధం కావట్లేదు..

నవజీవన్

బాగుంది జ్యోతి గారు మీ బొంబాయి హల్వా....ఎప్పుడు తినడమే తప్ప దీనిని ఎలా చేస్తారో తెలియదు .మీ బ్లాగు చలవ వలన ఈ రోజు తెలిసింది

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008