Thursday 17 January 2013

ప్రవాహమే గంగా ప్రవాహమే ....




                        
మనం ఎన్నో పాటలు వింటున్నాం. కాని కొన్ని పాటలు బాగా నచ్చుతాయి. మరి కొన్ని ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. ఆ పాటల్లో ఉన్న శక్తి ఏమో కాని మనలో తీవ్రమైన స్పందనను కలిగిస్తాయి. వాటిని మన జీవితానికి అన్వయించుకుంటాం. సంతోషిస్తాం, బాధపడతాం, ఆలోచిస్తాం  దానికి కారణం ఆ పాటలోని సాహిత్యం, సంగీతం, గాన మాధుర్యం. ఏదైనా కావొచ్చు. అన్నీ కాలిసి కావొచ్చు. కాని ఈ పాటలు చూడకుండా వింటేనే బావుంటాయి. అలాంటి కొన్ని పాటలలో నాకు బాగా నచ్చిన పాట విరించినై, చాంగురే, తర్వాత "స్వరరాగ గంగా ప్రవాహమే" ఈ పాట విన్నప్పుడల్లా ఏదో తెలియని జలదరింపు, ఆవేశం నాలో కలుగుతుంది. నన్ను ఆకట్టుకున్నది సాహిత్యమా అంటే ఈ పాట అర్ధమే తెలీదు. జేసుదాస్ స్వరం, రవి సంగీతం ప్రభావం చూపించాయి అని అనుకుంటాను. పాటలోని సాహిత్యం యొక్క అర్ధాన్ని తెలుసుకుంటే బావుంటుంది అని రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నాను. ఇది తెలుగు, సంస్కృతంలో ఉండడం వల్ల ఎవరూ చెప్పలేకపోయారు. చివరికి సంస్కృత ఉపాధ్యాయులు, సినీ గేయ రచయితలను అడిగినా తెలీదన్నారు. లాభం లేదు ఈ అద్భుతమైన పాట రాసిన వేటూరిగారినే అడగక తప్పదు అనుకున్నా. ఆయనేమో కొంపలు మునిగిపోయినట్టు అమరలోకానికి వెళ్ళిపోయారు. నేను వెళ్ళడానికి  వీలుకాదు  ఇంకా సమయముంది. ఎలా? ఎలా? అనుకుంటుంటే నా తిప్పలు చూసిన ఆయనే తన అంతరంగాన్ని వెల్లడించిన ప్రతి నాకు పంపే ఏర్పాటు చేసారు... మరి ఈ పాట గురించి వేటూరి గారి మాటల్లోనే తెలుసుకుందాం.. ఎవరి రచనగురించి వాళ్లే సరియైన రీతిలో  వివరించగలరేమో? పదేళ్ల క్రింద హాసం పత్రికలో వచ్చిన వ్యాసం ఆధారంగా...

స్వర రాగ గంగా ప్రవాహమే
అంగాత్మ సంధాన యోగమే  
ప్రాప్తే వసంతే త్రికాలికే
పలికే కుహు గీతికా
గాన సరసీరుహమాలికా        !! స్వర రాగ !!

గమపని గమపని గమపని గమపని
మపనిస మపనిస మపనిస మపనిస
పనిసగ సగసని సనిపమ పమగమ గ

కొండల లోపల నిండిన నింగిలో
ఉరిమెను మేఘం ఇన్నాళ్ళకి
పిల్లన గ్రోవిలో పిలవని మోవిలో
కురిసెను రాగం ఈనాటికి
మట్టింటి రాయే మాణిక్యమైపోయె
సంగీత రత్నాకరానా
స్వర సప్తకాలే కెరటాలు కాగా
ఆ గంగ పొంగింది లోన          !! స్వర రాగ !!

సని సని సగగస గసగస పమపమ
మగమగ పమపమ నిసనిప సనిసని

చైతన్య వర్ణాల ఈ చైత్ర సుమవీధి
వినిపించు రాగాలనంతాలులే
ఈ చక్రవాకాలు ఎగిరే చక్కోరాలు
జగమంత విహరించు రాగాలులే
పిలిచే శకుంతాలు పలికే దిగంతాలు
పులకింతలా పుష్యరాగాలులే
మలిసందె దీపాలు గుడిగంట నాదాలు
మౌనాక్షరీ గాన వేదాలులే     !! స్వర రాగ !!

ఒక చిత్రం కమర్షియల్‌గా హిట్ అయిందంటే అందులో పాటలు కూడా ప్రజల నోళ్ళల్లో పదికాలాల పాటు బ్రతికుంటాయని అందరికీ తెలిసిందే. కాని అందుకు భిన్నంగా సినిమా హిట్ కాకున్నా అందులోని పాటలు మాత్రం సూపర్ హిట్ ఐన సందర్భాలు ఉన్నాయి.   ఆ కోవకు చెందిన "సరిగమలు" సినిమాలో నేను రాసినటువంటి పాటలు కూడా చాలామంది పెద్దలు, సాహితీపరులు, సంగీత విద్వాంసులు అందరికీ కూడా ప్రియమైనాయి. అందులో ఒకటి "స్వరరాగ గంగా ప్రవాహమే" అనే పల్లవితో ప్రారంభమైన పాట యేసుదాస్ గారు పాడింది. ఈ చిత్రంలోని పాటలు ఇంత ప్రసిద్ధి పొందటానికి మూలకారకుడు మహా సంగీత విద్వాంసుడు, మా అందరికీ పూజనీయుడైనటువంటి రవి. ఆయన ఇచ్చిన ట్యూన్లలో ఉన్న శక్తే నాతో అటువంటి అద్భుతమైన పాటలు రాయించింది. ముఖ్యంగా ఈ పాట పాడేటప్పుడు జీవితంలో ఎదురుదెబ్బలు, ఏడుపుదెబ్బలు ఎన్నో తిన్నటువంటి హీరో క్యారెక్టర్ చాలా కాలంగా మూతపడిపోయిన తన గొంతు విప్పి తనవారి ముందు రాగ ప్రస్తారం చేసి తన హృదయంలో ఉన్నటువంటి ఆవేదనని, ఆక్రోశాన్ని, అనుబంధాన్ని కూడా కలిపి వెల్లడించేటువంటి సందర్భం. వసంతం వస్తే కాని చెట్లు చిగురించవు, కోయిల గళం విప్పి పాడలేదు. 


స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధాన యోగమే
 మనసులోతులనుండి వస్తున్న స్వరరాగాలు గంగా ప్రవాహంలా  జీవుని అంగము (శరీరము), ఆత్మలనుసంధాన చేసేవిధంగా మహా ఉదృతితో వస్తున్నాయి. 

"ప్రాప్తే వసతేతి కాలే పలికే కుహు గీతిక గాన సరసీరుహ మాలిక"
వసంతకాలంలోనే గళం విప్పి మనసారా పాడే కోయిలలు కుహు గీతాలు, గానమనే పద్మాల మాలికను అందిస్తున్నాయి . కాకులేవో, కోకిలలేవో తెలిపేటువంటి సందర్భం వసంతకాల ప్రాదుర్భావమే అని మహాలాక్షణికులు చెప్తున్నారు.

కుండల లోపల నిండిన నింగిలో ఉరిమెను మేఘం ఇన్నాళ్ళకి
శూన్యం అయినటువంటిది ఆకాశం అది సర్వవ్యాపి. ఈ శరీరాలు కూడా కుండలవంటివే. వేదాంతంలో మనకు ఆదిశంకరాచార్యులు ప్రవచించినటువంటి ఘటాకాశ సిద్ధాంతం ప్రకారం అన్ని శరీర్రాల్లోనూ ఎక్కడైతే వాక్యూం ఉందో అక్కడల్లా ఆకాశం ఉంది. ఆకాశం అంటేనే శూన్యం. ఆకాశం శూన్యం గగనం అంటారు కనుక ఈ కుండల లోపల నిండిన మేఘం ఇన్నాళ్లకి ఉరిమింది. ఈ శూన్యంలో ఒక నీటి మేఘం అది ఇన్నాళ్లకి ఉరిమింది. ఒక శబ్దం. ఒక నాదం ఇన్నాళ్లకి పుట్టింది. ఆకాశంలోంచి శబ్దం కానీ, వెలుగు కానీ పుడుతుంది. అదే విధంగా మేఘానికి రాగానికి ఉన్న సంబంధం సంగీత శాస్త్రం చెప్పింది. మేఘమల్హర్ రాగం మనకు తెలిసిందే. కనుక శూన్యం అయినటువంటి నాలో నిండిన ఆకాశంలోంచి ఓక మేఘం ఇన్నాళ్లకి గర్జించింది. అంటే నేను పాడగల్గుతున్నాను అని చెప్పడం.

పిల్లనగ్రోవిలో పిలవని మోవిలో కురిసెను రాగం ఈనాటికి.
పిల్లనగ్రోవి, మోవి కలిసినప్పుడే రాగం అనే దానికి ఆకృతి ఏర్పడుతుంది. ఇక్కడ పిల్లనగ్రోవి ఆ అమ్మాయి. అమ్మాయి కళ్ళలో ఓ చైతన్యం, ఒక రాగం, ఒక నాదం, ఒక స్పందన, ఓక నాట్యం, ఒక అభినయం తిరుగుతున్నాయి. ఇన్నాళ్ళూ పిలువలేదు ఈ మోవి. ఆ పిల్లనగ్రోవికి స్పర్శలేదు. ఈ పాటతో ఆ పిల్లనగ్రోవికి (పిల్లను పిల్లనగ్రోవితో పోల్చడం అక్షర రమ్యత కోసం ఉపయోగించింది) ఈ నాటికి ఈ పిల్లనగ్రోవిలో కూడా ఒక రాగం ఏర్పడ్డది అని చెప్పడం.

మట్టింటి రాయే మాణిక్యమై పోయే సంగీత రత్నాకరాన.
ఈ పొంగి పొరలుతున్నటువంటి అనంతమైన ఈ సంగీత రత్నాకరంలో మట్టిల్లే పుట్టిల్లుగా ఉన్నటువంటి రాయి కూడా మాణిక్యం అయిపోతుంది. ఈ సంగీత సముద్రంలో ఒక రాయి ఈ సంగీత పరమైనటువంటి కెరటాల యొక్క ఒరవడిలో ఒక రత్నమైపోతోంది. నిశ్చేతనమైన శరీరంలోంచి సచేతనమైన ఒక అభిసారిక, ఒక అభినేత్రి పుట్టుకొస్తుందని చెప్పడం.

స్వరసప్తకాలే కెరటాలుగా ఆ గంగ పొంగింది లోన
ఏడు స్వరాలు మనకి. ఈ ఏడు స్వరాలు సంగీత రత్నాకరంలో కెరటాలు అయినాయి. అయినప్పటికి ఆ రత్నాకరుని సప్తస్వరాలనే బాహువుల్లో  ప్రవేశించాలని గంగ ఉప్పొంగి పొరలి పొరలి ఆ సంగమం కోసం వస్తోంది అని చెప్పడం.

రెండో చరణం:
 చైతన్య వర్ణాల ఈ చైత్ర సుమవీధి  వినిపించు రాగాలనంతాలులే 

చైత్రమాసం బహువర్ణ సముచ్చయం.  పూసే పువ్వులు, మెరిసే చిగురుటాకులు ఇవన్నీ కూడా గానకళకు ప్రాణదర్పణాలు. వాటిలో అనేకరకమైనటువంటి రంగులు. అవి చైతన్యానికి గుర్తు. అంతకు ముందు లేని రంగులు నిద్ర మేల్కొని ఒక వికాసానికి, ఎక్స్‌ప్రెషన్‌కి మోడులు చిగురించడం, ఆ చిగురించిన కొమ్మలో నుండి పువ్వులు పుట్టుకొని రావడం. సంగీతానికి వర్ణాలు ఉన్నవి. అవి ఆ వర్ణంపై ఉన్నప్పుడు ఆ దేవత, ఆ రంగు, ఆ దేవతను పూజించవలసిన పువ్వులు, అప్పుడు చదవవలసిన మంత్రం. అప్పుడు ఆచరించవలసినటువంటి క్రతువు. ఇవన్నీ కూడా స్ఫురింప చేసేదే మంత్రశాస్త్రం. కనుక ఈ మంత్ర శాస్త్రం కూడా వర్ణానికి ప్రాధాన్యత గలదే. వేదమంత్రం మనం చదివేటప్పుడు సవర్ణంగా చదవాలి అంటారు. సుస్వరంగా చదవాలి అంటారు. దానికొక శృతి ఉంది. వేదగానం, వేదం అనేది అనూచనంగా పరంపరగా తరతరాలుగా వసోంది. అది పుస్తకాల్లో నిధిగా ఉండి రావడంలేదు. గురువు శిష్యుడికి సుస్వరంగా చెబితే ఆ స్వరం ఆ శృతిలో ఈ శిష్యుడు నేర్చుకొని అది ఇతనిలో వర్ధిల్లి ఇతని జీవితకాలం చివరికి మరో శిష్యుని దగ్గరికి వెళ్లి పరంపరగా వస్తునటువంటిది కాబట్టి ఈ వర్ణాలు ఏవయితే రాగానికి ప్రేరేపణలో అవి అనంతమయినటువంటివి. సృష్టిలో ఎన్ని వర్ణాలు ఉన్నాయంటే మనం కొన్నింటికే పేర్లు పెట్టుకున్నాం. కొన్నింటికి పేర్లు పెట్టుకోలేదు. ఒకే వర్ణంగా కనిపించే దాంట్లో అనేక వివర్ణాలు ఉన్నాయి. లఘు వర్ణాలున్నాయి. వాటిని మనం షేడ్స్ అంటాం. కలర్స్ అంటే అవే.. అవి కలనేత చీరలో రెండు రంగులు కలుసుకుంటే పుట్టే మూడోరంగు ఎటువంటిదో అటువంటి వర్ణాలు అన్నమాట. అదే విధంగా మేళకర్తలలోంచి జన్యమైన రాగాలలో కూడా అనేక రాగాల యొక్క స్పర్శ కలిగి అవి ఇంకొక రాగంగా తయారవడం అనేది ఉంది. నాదానికి, శబ్దానికి మధ్య, రాగానికి, స్వరానికి మధ్య ఇంకొక రాగం... ఇది సప్త స్వరాలలో ఇమిడినదైనప్పటికీ కొత్త వికాసంతో రాగం పుట్టుకొస్తుంది. ఇలా రాగాలు అనంతాలు అని సంగీత రత్నాకరం చెబుతుంది. మన శక్తి కొద్ది, మన ఊహ కొద్ది మనకి ప్రాప్తమయ్యే వరకు రాగాలు పుడుతూనే ఉంటాయ్. అది మనం చేసేటువంటి రాగారాధన మీద, నాదోపాసన మీద ఆధారపడి ఉంటుంది. 

ఈ చక్రవాకాలు ఎగిరే చకోరాలు, జగమంత విహరించే నాదాలులే

అదేవిధంగా సృష్టిలో అన్వేషణ,  పరిశోధన చేస్తున్నకొద్దీ కొత్త కొత్త రంగులు, కొత్త కొత్త వికాసాలు, కొత్త కొత్త ఎరేంజ్‌మెంట్స్ ఎన్నెన్నో కనిపిస్తాయనేది మనకు తెలిసిన విషయమే. పక్షులను తీసుకుంటే రకరకాల పక్షులు సాయంత్రం గూళ్లకు చేరేటప్పుడు ఎన్నెన్ని శృతుల్లో జిలిబిలిగా ఎంత చక్కని స్వరధునిని మనకు వినిపిస్తాయో అందరికీ తెలిసిందే .

ఒక ఆంగ్ల మహాకవి బహుశా 'షెల్లీ' అనుకుంటాను. Art, thou a bird of a wandering voice! అన్నాడు. ఆ పక్షి కనిపించదు. కానీ దాని గానం వినిపిస్తూ ఉంటుంది. ఏ చెట్టు కొమ్మల్లో దాగి ఉంటుందో తెలియదు. ఆ ఎగిరే పక్షిలో ఉందో లేదో తెలియదు. ఎక్కడుంటుందో తెలియదు కానీ ఆది గానరూపమై, నాదరూపమై చెవిలోనుంచి హృదయానికి, హృదయం నుంచి ఆత్మకు వెళ్లిపోయి  అక్కడ గూడుకట్టుకుంటుంది.

ఈ చక్రవాకాలు ఎగిరే చకోరాలు జగమంత విహరించు  రాగాలులే

అటువంటి ఎన్నో పక్షులు, వర్షాకాలంలో చక్రవాకాలు, కార్తీకమాసంలో ఆశ్వయుజ మాసంలో చకోరాలు, అవి చేసే వింత వింత ఆలాపనలు, వసంతంలో కోకిలలు చేసే కుహుకుహు రావాలు, మేఘదర్శనంతో నెమళ్ళు చేసే కేంకరాలు, ఆయా వేళలకు.. ఆయా వేదాలని వినిపిస్తూ.. వింత వింత కోరికల్ని విన్నవించుకునేటటువంటి, ఎంతో అందమైనటువంటి, ఎన్నో స్వరాలతో కూడుకున్నటువంటివే. రాగమే పక్షి రూపంలో విహరిస్తూ ఉంటుంది. నువ్వు పక్షివా లేక ఒక గుప్పెడు రూపం పొందిన రాగానివా? రెక్కలు కట్టుకుని ఎగిరే రాగాలా అన్నట్టుగా ఉన్నటువంటి ఈ సృష్టిని గూర్చి చెప్పటం.

పిలిచే శకుంతాలు పలికే దిగంతాలు,

ఒక పక్షి పిలుస్తుంటుంది. అది హొరైజన్‌లోకి వెళ్ళిపోయి ప్రతిద్వనిగా మారి మళ్ళీ వెనక్కి వచ్చి ఏదైతే ప్రశ్నగా వెళుతుందో అదే బదులుగా తిరిగి వస్తుంటుంది. 'యద్భావం తద్భవతి' అన్నట్తు ఏది ప్రశ్నో అదే బదులు. అట్లా శకుంత పక్షులు దిగంతాలలో గానం చేస్తుంటే, సంధ్యా రాగాలలో, కొండల్లోంచి, కోనల్లోంచి, లోయల్లోంచి వచ్చి మనకు ఎదలోయల్లో ప్రతిద్వని వినిపించడం అనేది జరుగుతుంది. తద్వారా కలిగే పులకింతలు అంటే జీవికి కలిగేటటువంటి జీవలక్షణమైన జలదరింపులు ... అంటే బతికున్నతనానికి, బతికున్నాం అనటానికి ఒక నిదర్శనంగా మిగిలేటటువంటి ఒక అనుభూతి.

పులకింతలా పుష్యరాగాలులే
ఇక్కడ పుష్యరాగం అంటే ఇక్కడ గోమేధికమో, పుష్యరాగమనే  రత్నమో, రాయో కాదు. పుష్యమాసంలో నిద్రాణమైనటువంటి  ప్రకృతి నుంచి ఒక వికాసం  ప్రారంభమవుతుంది. కప్పేసిన మంచులో నుంచి కన్ను తెరిచి చూసే ఒక వికాసం ఒక మొగ్గ రూపంలో, పువ్వు రూపంలో, పిందె రూపంలో, కాయ రూపాంలో, పండు రూపంలో, ధాన్యంలో కంకి రూపంలో నిద్రాణమైన స్థితి అన్నమాట. ఆ వచ్చేటటువంటి దాన్ని పుష్యరాగంగా పేర్కొన్నాను. అంటే ఆ పులకింతతో పుష్యరాగం మరొకదానికి, మరొక సృష్టికి పురుడు పోయటం జరుగుతుంది అని చెప్పటం ఇదొక మౌనరాగం!

 మలిసందె దీపాలు గుడిగంట నాదాలు  మౌనాక్షరీ గాన వేదాలులే   

మలిసంధ్యలో హొరైజన్‌లో వెలిగే దీపం అది మహామౌనం. వెలుగెప్పుడూ మౌనమే. వెలుగు కూడా వేదమే. వేదం వెలుగు కాబట్టి, వెలుగునిచ్చేది వేదం కాబట్టి, వెలుగు రూపంలోనే ఉంటుంది. అందుకనే దాని అక్షరరూపంలో రాయడం జరగలేదు. అదొక గానరూపంగా, నిరక్షరంగా, అనుభూతికి దొరకని ఒక అవ్యక్త మాధుర్యంతో వెలిబుచ్చాల్సిందే. మలిసంధ్య దీపాలు అంటే అసురసంధ్య వెలుగులు కావచ్చు. ఇక గుడిగంట నాదాలు... ఒక దేవలోకాన్ని, ఒక దివ్యానుభూతిని, ఏదో ఒక పుణ్యమైన పురుషార్ధ రూపమైన ఒక ఉత్తరస్థితిని ఆ గుడిగంటనాదం వినిపిస్తుంది. కానీ  ఆ ధ్వని మనలో కలిగించే మౌనం మాత్రం చాలా పెద్దది. ప్రకంపనం ఆగిపోయిన తర్వాత కూడా లోఫలికి వెళుతుండగా అది విడిచిన ముద్ర ఎక్కడికో తీసుకువెళ్తుంది. అంతటి శక్తి దీనికి  ఉంది. అదే మౌనాక్షరీ గానవేదాలులే.. గానం ఎప్పుడూ వినిపిస్తుంది అనుకోవటం కూడ పొరపాటు. గానం ఎప్పుడూ వినిపించదు. కొన్ని గానాలు ఊహాగానాలు అంటాం మనం. అవి వినిపిస్తాయా? వినిపించవు. అట్లాగే ఈ మౌనాక్షరీ గానం. అక్కడ అక్షరాలు ఉండవు ఏదో ఉంటుంది. అక్షరానికి, అక్షరానికి మధ్య శూన్యం అనగా ఆకాశం అందులో ఏదో ఉంటుంది. అందులో సూర్యుడు ఉండొచ్చు, చంద్రుడు ఉండొచ్చు, తారలుండొచ్చు. అది  ఏమైనా ఉండొచ్చు. అది ఉరమవచ్చు. మెరవనూ వచ్చు. అసలు గానం అంటే ఏమిటి? నాదం అంటే ఏమిటి? నాదం పుడుతుంది. అది మీలో మీకు మాత్రమే పరిమితం. తద్వారా దాని బాహ్యమైన ఎక్స్‌ప్రెషన్ మాత్రం గానం. అనంతమైన రాగాల రూపంలో ప్రస్తరించి బయటకు వచ్చేదే గానం. ధ్వని వేరు. శబ్దం వేరు. శబ్దం అంటే వాయిస్.

ఈ సరిగమల్లో రాసిన ప్రతి పాటకీ నా మనసులో గూడు కట్టుకున్న భావాలు.. అమృతోపమానమైనటువంటి సంగీత ప్రవాహంలో ఈ అక్షరాలుగా పూల పడవల్లే తేలిపోతూ మీ హృదయ తీరాలకు చేరాయి.

వేటూరి సుందరరామమూర్తి.







2 వ్యాఖ్యలు:

శ్రీలలిత

అందుకే అంటారేమో పెద్దలు...
కవిని అర్ధం చెసుకోడానికి రసహృదయం వుండాలని...
అంత గొప్పగా రాసిన పాటని యెంత బాగా వివరించారో వేటూరివారు.
మంచి సమాచారం అందించారు. ధన్యవాదాలు..

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी

ధన్యవాదాలు జ్యోతిగారు.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008