Wednesday 19 June 2013

నా దేవుడు చనిపోయిన రోజు




కోర్కెలు శూన్యం.. బతుకంతా దైన్యం


యవ్వనం తొలి ప్రాయంలోకి అడుగుపెట్టే ఓ 14 ఏళ్ల బాలిక నోటివెంట ‘నాకేం కోరికలు లేవు’ అనే మాటలు వస్తే ఎలా ఉంటుంది? ఎన్నో ఆశలు. ఆకాంక్షలతో, చెంగుచెంగున సీతాకోకచిలుకల్లా ఎగరాల్సిన ఆ వయసులో ఏ కోరికలూ లేవంటే చిన్న వయసులోనే ఇంతటి నిర్వేదమా? అని ఆశ్చర్యపోతాం. కానీ, ‘‘ది డే మై గాడ్ డైడ్’’ అనే డాక్యుమెంటరీ చిత్రం చూస్తే మనకు ఆశ్చర్యం కాదు- ఆక్రోశం, ఆవేదన ఉప్పెనలా వస్తుంది. దేశ ఆర్థిక రాజధానిగా ప్రసిద్ధిచెందిన ముంబై వేశ్యావాటికల్లో మగ్గుతున్న అభం శుభం తెలియని ఆడపిల్లల జీవితాలకు నిలువుటద్దంగా నిలిచే ఈ డాక్యుమెంటరీకి ఆండ్రూ లెనిన్ దర్శకత్వం వహించారు. ఇందులో 14 ఏళ్ల బాలిక అనుభవించిన నరకం ఎంత దారుణంగా ఉందో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఏడేళ్ల వయసులో బిస్కెట్ ఇస్తామని ఆశ చూపించి తీసుకెళ్లి వేశ్యావాటికలో అమ్మేసి, చీకటి గదుల్లో బంధించి విచక్షణ లేకుండా ఇనుపరాడ్లతో కొట్టి విటులకు ఆమెను అప్పగిస్తారు. ఫలితంగా గర్భం వస్తే అబార్షన్ చేయించి, రక్తం స్రావం తగ్గకుండానే మళ్లీ వృత్తిలోకి తోసేసి వారి వికృత కామానికి బలిచేస్తూ ఉంటే, ఇంకేం కోరికలు ఉంటాయి? ఇది ఒక అమ్మాయి కథ కాదు. ఇలాంటివి, ఇంతకంటే దారుణమైన కథల్ని వేశ్యావాటికల్లో అమ్మాయిలు వినిపిస్తారు.
ఆడపిల్ల ఇంటికి దీపం అంటాం. లక్ష్మీదేవికి ప్రతిరూపం అని అపురూపంగా చూసుకుంటాం. తల్లిదండ్రులు, తోబుట్టువుల ప్రేమలో సంతోషంగా పెరగాల్సిన కొంతమంది అమ్మాయల జీవితాలు చిందరవందర అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో అమ్మాయిలు అదృశ్యమవుతున్నారు. వాళ్ల శరీరాలకు పాతిక నుంచి యాభైవేలకు వెలకట్టి వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నారు. నేపాల్‌తో పాటు మన దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పదిహేనేళ్లలోపు ఆడపిల్లలను మాయమాటలు చెప్పి తీసుకెళ్లి ముంబైలోని కామాటిపురా వేశ్యావాటికల్లో అమ్మేస్తున్నారు. మన రాష్ట్రంలోని అనంతపురం లాంటి కరవు ప్రాంతాల నుంచి కూడా బాలికలను ఈ వేశ్యావాటికలకు తరలిస్తున్నారు.
వ్యభిచారం ఓ వ్యాపారం మాదిరి రష్యా, ఆసియా, యూరప్, ఆఫ్రికా, అమెరికాలోనూ జరుగుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు యాభైవేల మంది అమ్మాయిలను అమెరికాకు తరలిస్తున్నారని ఓ అధ్యయనంలో తేలింది. ఒకసారి ఈ మురికి కూపాల్లో చేరినవాళ్లకు విముక్తి అనేది ఉండదు. వేశ్యావాటికల్లో మైనర్ బాలికలకు అబార్షన్లు చేయించడం సర్వసాధారణం. అది కూడా నకిలీ డాక్టర్లే చేస్తారు. ఆ తర్వాత వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నా విశ్రాంతి కూడా ఇవ్వకుండా వ్యాపారాన్ని కొనసాగిస్తారు. వీళ్లకు రోజుకు ఒక్కపూట ఆహారం, వారానికోసారి మాత్రమే స్నానం చేసే వీలుంటుంది. శుభ్రతలేని పరిసరాలు, తగిన తిండి లేక అమ్మాయిల ఆరోగ్యాలు పాడవుతుంటాయి. రకరకాల ఇనె్ఫక్షన్లు, ఎయిడ్స్‌లాంటి రోగాలు కమ్ముకున్నా వైద్యం చేయించే నాథుడే ఉండడు. రక్షించే పోలీసులు కూడా భక్షించేవారే. మైనర్ బాలికలను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళతారు. విముక్తి లభిస్తుందని సంబరపడినంత సమయం కూడా ఉండదు. వ్యభిచార గృహ నిర్వాహకులు జరిమానా కట్టి వాళ్లను విడిపించుకుని వెళ్లాక మళ్లీ అవే కష్టాలు. ఖర్మకాలి పిల్లలు పుడితే వాళ్లు కూడా అక్కడే ఉండక తప్పదు. వేశ్యావాటికల్లో మగ్గే మహిళలు తమ జీవితాలు నాశనమైనా, తమ పిల్లలైనా మంచి జీవితం గడపాలని, చదువుకోవాలని కోరుకుంటున్నారు. తమ శత్రువులకు కూడా ఇలాంటి దుస్థితి రాకూడదని కోరుకుంటున్నారు. ఈ డాక్యుమెంటరీలో బాధిత అమ్మాయిలే స్వయంగా చెప్పినవి వింటుంటే ఎవరికైనా కోపం, ఆవేదన కలుగుతుంది. కాగా, తమ దేశం నుంచి అపహరించుకు పోయన ఆడపిల్లల కోసం అనురాధా కొయిరాలా నేపాల్‌లో ‘‘మైత్రీ’’ అనే శరణాలయాన్ని స్థాపించి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. వేశ్యావాటికల నుండి తప్పించుకున్న ఆడపిల్లలకు వసతి కల్పించి వారికి ఓ దారిని చూపిస్తున్నారు. అలా బయటకొచ్చిన కొందరు అమ్మాయిలు తమ కుటుంబాలను తిరిగి కలుసుకున్నారు. కొందరు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఆ మురికికూపం నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించి బందీలైన మరికొంతమంది అమ్మాయిలను పోలీసుల సాయంతో బయటకు తీసుకొచ్చారు. ఈ సామాజిక దురవస్థను సమూలంగా అంతం చేయడానికి, శాశ్వత పరిష్కారం కోసం ‘మైత్రీ’ శరణాలయం నిర్వాహకులు యథాశక్తిన ప్రయత్నిస్తున్నారు.

2 వ్యాఖ్యలు:

Unknown

ముక్కుపచ్చలారని అమ్మాయిలను పడుపువ్రుత్తిలోకి దింపి వారిశరీరాలతో జీవితాంతం వ్యాపారం చేసుకునేవారు ప్రపంచవ్యాప్తంగా విరివిగా పెరిగిపోయారు!అందుకే ఆడపిల్లలను కంటిరెప్పల్లా తల్లితండ్రులు చూసుకుంటున్నారు.పేదవాళ్ళే ఈ అరాచకానికి ఎక్కువగా గురి అవుతున్నారు!పాలనాయంత్రాంగాలు నివారణకు తగు చర్యలు ఎక్కడా తీసుకోవడం లేదు!ఆలోచిస్తే గుండె తరుక్కుపోతోంది!జ్యోతిగారు టపా ఆర్ద్రంగా రాశారు!మీరు జోడించిన డాక్యుమెంటరీ చూస్తే కడుపులో చేయిపెట్టి దేవినట్లనిపించింది!ఆడపిల్లలకు భద్రత కల్పించడంకోసం ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలి!

చెప్పాలంటే......

chaalaa baadhagaa bhayamkaram gaa anipinchindi jyothi garu

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008