Sunday 15 September 2013

అంచెలంచెలుగా -- సప్తపద సోపానం









"చదువు లేదూ సంధ్యా లేదూ ఎప్పుడూ చూసినా ఆ టీవీ ముందు సెటిల్ ఐపోవడమేనా. ఇంటిపనికి పనిమనిషి ఉంది. పిల్లలకు కావలసినవి చూసి, వంట చేయడం తప్పితే నీకు వేరే పనేం వచ్చు. పనికిరాని నవల్సు, మాగజీన్స్ చదవడం తప్ప లోకజ్ఞానం లేదు. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకో. ఆ చెత్త సీరియల్స్ చూస్తే ఏమొస్తుంది. ఆ డిస్కవరీ, నేషనల్ జగ్రాఫిక్ చానెల్ చూడు. పక్కింటివాళ్లతో, చుట్టాలతో ముచ్చట్లతో టైమ్ వేస్ట్ చేస్తున్నావ్. అవన్నీ మానేసి  పెళ్ళప్పుడు  ఆపేసిన చదువు కంటిన్యూ చేయి. ఏదైన పనికొచ్చే పని చేయి., అసలు నీలాంటి వాళ్ల కోసం ఆ టీవీ చానెల్స్‌లో చెత్త సీరియల్స్, ప్రోగ్రామ్స్ తయారు చేసేది. నీలాంటివాళ్లు ఉన్నారు కాబట్టే  ఆ ప్రోగ్రామ్స్ చేసేవాళ్లు బ్రతుకుతున్నారు. ఎన్ని చానల్స్ వస్తే అన్ని సీరియల్స్ చూడడమేనా. తెలుగు సరిపోదని  ఇంకా హిందీ , తమిల్ సీరియల్స్ కూడా చూడ్డమెందుకు. ఆ సీరియల్స్ లో చూపించినట్టు నిజంగా జరుగుతుందా? . ఒక్క దాంట్లోనైనా కామన్స్ సెన్స్ అనేది ఉందా ? కనీసం ఆ చానెల్స్ లో వంటల ప్రోగ్రామ్స్ చూసి నేర్చుకుని చేయి. ఆహా! అదీ చాతకాదు. బోలెడు వంటల పుస్తకాలు కొంటావు. అందులోనుండి చేస్తావా అంటే అధీ లేదు. ఏదో పదీ పదిహేను వంటలనే తిప్పుతుంటావు.  ఇవన్నీ కాకుంటే నిద్రపోవడం. వేరే పనే లేదు నీకు.. నిన్ను బాగుపరచడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. "

" మరేం చేయను. పిల్లలతోనే సరిపోయే. ఇంక నేనెప్పుడు చదివేది. ఐనా చదివి ఏం ఉద్ధరించాలంట. ఉద్యోగం చేసి సంపాదించే అవసరం లేదు. ఐనా ఇంట్లో పనంతా చేసుకుని అందరికీ అన్నీ చేసి పెట్టి నేను ఉద్యోగానికి వెళ్లాలా. అమ్మో నా వల్ల కాదు. ఇలాగే హాయిగా ఉంది. వంట చేసుకుని, ఇల్లు సర్దుకుని. అపుడపుడు ఏదో కుట్టుపని, అల్లికలు చేస్తూనే ఉన్నాగా. మిగిలిన ఖాళీ టైమంతా ఏం చేయాలి. టైంపాస్ అని టీవీ చూస్తున్నా. అంతే కదా. నాకు ఫ్రెండ్స్ లేరు కాబట్టి షాపింగులు, సినిమా ప్రోగ్రాములు అంటూ లేవు సంతోషించంఢి.. పుస్తకాలు అంటే నాకున్న తెలివికి ఈ వీక్లీస్, నవల్స్ మాత్రమే అర్ధమవుతాయి. ఇపుడు డిస్కవరీ  చానల్ చూసి నేనేమైనా నోట్స్ రాయాలా, ఆర్టికల్స్ రాయాలా. మరి అలాంటప్పుడు చూసి ఏం చేయాలి. సీరియల్స్ అంటే ఇంటరెస్టింగ్ గా ఉంటాయి. అందుకే చూస్తుంటాను. తెలుగే చూడాలని రూలేమీ లేదుగా. హింది , తమిల్ అర్ధమవుతాయి. అందుకే చూస్తున్నా. వేరే పనికొచ్చే పని మీరే చెప్పండి చేస్తా.."

కొన్నేళ్ల క్రింద మా ఇంట్లో తరచూ జరిగే సంభాషణ అన్నమాట. కాని ఈరోజు పరిస్థితి తల్లకిందులైంది కదా అని తలుచుకుంటేనే నవ్వొస్తుంది. అప్పుడు బోలెడు తీరిక సమయం. చేయడానికి పనేమీ లేదు. కాని ఇప్పుడు అస్సలు తీరిక సమయం లేదు. తలకుమించిన పనులు.  దీనికి అసలు కారణం ఈ బ్లాగు  JYOTHI.. అప్పుడెలా ఉండేదాన్ని? ఇప్పుడెలా ఉన్నాను? అసలు నాకంటూ ఒక గుర్తింపు లేకుండా అందరిలా ఏ లక్ష్యమూ లేకుండా సాధారణ గృహిణిగా   కాలం గడిపేసేదాన్ని. అలా టీవీముందు సెటిల్ ఐపోయే నన్ను తీసుకొచ్చి కంప్యూటర్ ముందు కూర్చోబెట్టారు మావారు. ఆయన మొదటినుండి అంతే. ఏ పనైనా రాదు అని ఎందుకు అనుకోవాలి. ఎందుకు రాదూ అని శోధించి. సాధించాలి అంటూ నన్నూ అలా తయారు చేసారు.  అంతర్జాలంలో ఇంగ్లీషులో సెర్చింగ్ చెస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి కాని నాకు తెలుగు మాత్రమే కావాలి. పిల్లల చదువులు, ఉద్యోగాల గురించి తెలుసుకుందామని మొదలెట్టిన నా శోధన తెలుగు దగ్గర ఆగిపోయింది. ఆ రోజుల్లో అంటే 2006 ప్రాంతంలో  ఇంటర్నెట్ వాడకం అంత మంచిది కాదు. అందునా ఆడవాళ్లకు అనేవారు. అలా నెట్లో ఆడవాళ్లు ఉన్నారంటే కూడా అదో రకంగా భావించేవారులెండి. అప్పట్లో తెలుగులో టైప్ చేయడానికి సులువైన మార్గాలు లేవు. నేను వచ్చిన కొత్తలోనే  లేఖిని మొదలైంది... తెలుగును ఇంత సులువుగా టైప్ చేయొచ్చు అని తెలిసాక ఎంత సంతోషమో..
టైంపాస్ కోసం మొదలెట్టిన బ్లాగు ప్రయాణం నా జీవితంలో ఇంత అనూహ్యమైన మార్పు తీసుకొస్తుందని ఆనాడు అస్సలనుకోలేదు. అసలు ఇంతకాలం నేను బ్లాగును కొనసాగిస్తున్నాను అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నాకు నచ్చిన, ఇస్టమైన హాబీలను వేర్వేరు బ్లాగులుగా తయారు చేసుకున్నాను. కాని బ్లాగు వల్ల నాకంటే ఎక్కువ లాభపడింది ఎవరూ లేరేమో అనిపిస్తుంది. బ్లాగువల్ల ప్రపంచానికి నేను పరిచయమయ్యానో,  నాకు ప్రపంచమే పరిచయమైందో కాని ... ఈ బ్లాగువల్ల నాకు నేనే పరిచయమయ్యాను అని ఘంటాపధంగా చెప్పగలను. లేకపోతే పచారీ లిస్టు తప్ప వేరే రాసే అలవాటు లేని నేను ఇప్పుడు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అవుతానని,  విభిన్నమైన విషయాలమీద ఇన్ని వ్యాసాలు రాసానా? అని అప్పుడప్పుడు ముక్కున వేలేసుకుంటాను. కానీ నా మనసులోని భావాలు, స్పందనలు, ఆలోచనలు, సంతోషం, దుఖం.. ఏవైనా సరే అలా అక్షరాలలోకి మార్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. అవి నాతో పాటు మరి కొందరికి నచ్చుతున్నాయంటే ఇంకా హ్యాపీసు.. ఈ బ్లాగు నా రాతనే మార్చింది. మంచి శైలిని, భావవ్యక్తీకరణను, ప్రముఖుల పరిచయాలను, ఆత్మీయులుగా మారిన కొందరు స్నేహితులను, నన్ను తమ కుటుంబ సభ్యురాలిగా భావించి, గౌరవించే ఎందరో వ్యక్తుల పరిచయాలను, నాకు ఇష్టమైన తెలుగు పుస్తకాలకు సంబంధించిన ఉద్యోగం (ఇది కలలో కూడా ఊహించనిది. కారణం చెప్పాగా) ఇచ్చింది. అన్నింటికి మించి వెలకట్టలేని అభిమానాన్ని కూడా పొందగలిగాను. బ్లాగునుండి ప్రింట్ మీడియాకు వెళ్లినా మంచి ప్రోత్సాహం, గుర్తింపు లభించింది.  వీటన్నింటికంటే నాకు ఎంతో సంతృప్తిని, గౌరవాన్ని ఇచ్చింది మాలిక పత్రిక బాధ్యత. అసలు ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నానో నాకే అర్ధం కావట్లేదు. అంతా ఆ పైవాడి లీల తప్ప..

ఈ సోదంతా ఎందుకంటే  తెలుగులో బ్లాగు మొదలెట్టి సరిగ్గా ఏడు సంవత్సరాలు పూర్తయ్యాయి..  ఈ సందర్భంగా కొన్ని జ్ఞాపకాలు కదిలాయి. అవి చెప్పుకుంటూ పోతే పేజీలు పేజీలే చెప్పొచ్చు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నా ఈ విజయ ప్రస్థానంలో మధ్యలో కలిసి విడిపోయిన, ఇంకా తోడున్నా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నన్ను నాకు పరిచయం చేసి, నా రాతను, వ్యక్తిత్వాన్ని, వ్యవహార శైలిని, ప్రపంచ జ్ఞానాన్ని, గుర్తింపును, గౌరవాన్ని ఇచ్చిన నా బ్లాగు " JYOTHi " కి మరోసారి హ్యాపీ బర్త్‌డే.


త్వరలో ఒక విషయమై ప్రకటన చేయాలని తీవ్రంగా కృషి చేస్తున్నాను. అది పూర్తికాగానే అందరికీ చెబుతానుగా..


 అలాగే ఇంతకుముందటి వార్షికోత్సవ వివరాలు కూడా చదివేసేయండి మరి..



పంచమ వార్షికోత్సవం 



14 వ్యాఖ్యలు:

mmkodihalli

అభినందనలు!

Sharma

ఒదగటమంటే కొంతమందికి కొన్ని సమయాలలో యిష్టం తో కూడిన కష్టం .
ఎదగటం ప్రకృతిలోనే వున్న నైజం . అలా ఎదగటమంటే ఎంతో యిష్టం అందరికి . ఈ ఎదగటానికి ఎపుడూ , ఎవరో ఒకరి ప్రోత్సాహం ఎంతో అవసరం . ఆ ప్రోత్సాహం జీవితభాగస్వామి నుంచి లభిస్తే చాలా విశేషమే .
మొదట్లో ఆయన మాటలు మీకు గోలగా వుండేదనుకుంటా . ఈ రోజు అదే అంతా ఆ పై వాడి లీల అంటున్నారు . కాదు మీ ఆయన వల్ల ఇంతటి ఉన్నత స్థాయి మీకు లభించింది అని నా భావం . మీ వారికి నా హృదయపూర్వక అభినందనలు .

సి.ఉమాదేవి

సప్తస్వరాలు మీటిన మీ బ్లాగ్వీణ ఎందరిచేతో సరిగమలు పలికించింది. అభినందనలు అందుకోండి
జ్యోతిగారు.

మాలా కుమార్

సప్తపద సోపానం విజయవంతంగా అధిరోహించినందుకు అభినందనలు.

శశి కళ

congrats jyothi akka.meeru maaku koodaa spoorthi

అన్వేషి

హృదయపూర్వక అభిందనలు.

Zilebi


ప్చ్చ్ ప్చ్ ప్చ్ ! ఈ మధ్య మరీ పూచిక పుల్ల అయి పోతున్నారు ! ఏదో ఈ జన్మ దినం పుణ్యమా అని బ్లాగు లో కనబడు తున్నారు !


శుభాకాంక్షల తో

జిలేబి

Kottapali

Good luck

జయ

మీకు హృదయపూర్వక శుభాభినందనలు జ్యోతి గారు.

Dubai sheenu

జ్యోతి గారు మీకు హృదయపూర్వక శుభాభినందనలు....!

జ్యోతి

మురళీమోహన్, నారాయణస్వామి, జయ, ఉమ, దుబాయి సీను,అన్వేషి, శశికళ,మాలాకుమార్ గార్లకు ధన్యవాదాలు.

శర్మగారు చేసేది చేయించేది అంతా ఆ పైవాడే కదా. మనం నిమిత్తమాత్రులం..


జిలేబిగారు. మీరన్నది నిజమేనండి. అసలు నేను ఇంత బిజీగా ఎందుకున్నానో అర్ధం కావట్లేదు.. ఎప్పుడు తీరుతుందో ఏమో. అసలు బ్లాగ్లోకంలో ఏం జరుగుతుందో కూడా తెలీడం లేదు..

మరువం ఉష

కాస్త ఆలస్యం గా... శుభాకాంక్షలు! నువ్విలాగే మరిన్ని విధాలుగా అనుభవం గడించి, నీ పఠనవ్యాసంగం ఇలాగే ఎడతెగకుండా సాగి తెలుగు సారస్వతం కావలసినంత పోషణను అందుకోవాలనీ,నీ రచనావ్యాసంగం ఇలాగే కొనసాగి తెలుగు సారస్వతాన్ని పరిపుష్టం చేయాలనీ ఆకాంక్షిస్తున్నాను.

ఇక కాస్త పక్కకి-

మనిషి మౌలికం గా ఒంటరి. అందుకే, ఎప్పుడూ, ఎట్టి పరిస్థితుల్లోనూ, మనకంటూ ఒక జీవితం వుండాలి. అంటే మనకి... శుద్ధంగా మనకి... రోజూ అద్దంలో కనిపించే మనకి! అందుకు రెండో మనిషి అవసరం లేని ఒక వ్యాపకమో, కళో మనకి తోడై రావాలి.

వైవాహిక జీవితాల్లో అసంతృప్తికి, వ్యక్తిత్వాల మేళవింపు కి మూలాలు, పరిష్కారాలు దొరకవని నా అనుభవసారం! మోదం, ఖేదం సమపాళ్ళలో స్వీకరించే స్థితికి చేరగలిగే వరకు చెయ్యగలిగేది సాధన మాత్రమే.

చివరగా:

మహావాక్యాలు గూర్చి చదివి ఉండకపోతే, ఒకసారి చదివి లోతుగా తరిచి చూసుకో: ఆన్లైన్ లో ఉన్న వనరులలో ఇక్కడ బావుంది - http://telugu.pssmovement.org/telugu/index.php?option=com_content&view=article&id=317&Itemid=564 (జస్ట్ మటీరియల్ రిఫరెన్స్ మాత్రమే; నేను అనుసరిస్తున్న సాధనో/ ప్రచారమో కాదు సుమా!)

“So plastic is mind, so receptive, that the slightest thought makes an impression upon it. People who think many kinds of thought must expect to receive a confused manifestation in their lives. If a gardener plants a thousand kinds of seeds, he will get a thousand kinds of plants: it is the same in mind.” — Dr. Ernest Holmes

నీ మనసు ని కాచుకునే వనమాలి 'నువ్వు' :)

Zilebi


ఈ ఉష గారు ఎవరండీ బాబు, తాత్విక చింతన లో జేకే జిడ్డు గారిని గుర్తుకు తెస్తున్నారు సూపెర్బ్ !

చీర్స్
జిలేబి

జ్యోతి

జిలేబిగారు.. ఈ ఉష నా స్నేహితురాలు, తెలుగు బ్లాగర్లకు బాగా పరిచయమున్న మరువం బ్లాగరు.

http://maruvam.blogspot.in/

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008