Friday, October 31, 2014

అష్టవిధ నాయికల జడపద్యాలు:
బ్నింగారు జడ మీద పద్యాలు రాయమని అలా అన్నారో లేదో సునామీలా పద్యాలు అందునా కందాలు వెల్లువెత్తాయి. అన్నీ జడ మీదేనండోయ్.. పుస్తకానికి కావలసినవి తలా ఐదు పద్యాలైనా ఆ తర్వాత కూడా అద్భుతమైన పద్యాలు రాసారు ఎందరో కవిమిత్రులు. ఇంకా రాస్తూనే ఉన్నారు. పూలదండలోని పూల వాసన దారానికి తగలదా అన్నట్టు నాదో చిన్న ప్రయత్నం. కాని ఇంతోటి దానికి నన్ను శతకకర్తను చేసి సన్మానించారు.. ఏంటో!!!


అష్టవిధ నాయికల జడపద్యాలు:

భరత ముని రచించిన నాట్య శాస్త్రంలో అష్టవిధ నాయికలుగా ఎనిమిది రకాల నాయికలను తెలిపారు. ఈ ఎనిమిది రకాల నాయికలు ప్రేమ, వలపు మొదలైన ఎనిమిది వివిధములైన మానసిక అవస్థలను తెలియజేస్తారు. వీనిని భారతీయ చిత్రకళలోను, సాహిత్యం, శిల్పకళ మరియు శాస్త్రీయ నృత్యాలలో ప్రామాణికంగా పేర్కొన్నారు. వాటిపై పద్యాలు రాస్తే బాగుంటుందని భావిస్తూ.. జడలకు అన్వయిస్తూ...
1. అభిసారిక
కం. జడి వానకు వడగళ్ళకు
జడియక బ్రేమికుని గల్వ జర జర సాగన్,
జడలున్ గాలిలొ యాడగ
జడలే ఫణులుగ గనపడె జనులకు యాహా!
2.ఖండిత
కం. జడలున్న తనను గాదని
గడపెను ప్రియుడామె యింట గత రాత్రంతా!
మెడబట్టుకు నెట్ట వలె, మొ
గుడిని మరగిన జడలేని కులుకుల గత్తెన్!
3. విప్రలబ్ద
కం. కన్నుల్ గాయలు గాచెను
తన్నున్ మరచెన? మగనికి తగిలిర గాంతల్?
వెన్నున్ వంగెను జడలచె
తన్నులె నీకిక మిగిలెను తప్పవు మామా!
4.కలహాంతరిత
కం. పోపో! రాకుము నాకడ
పాపల మరిగెను పతియని పరిపరి యేడ్చెన్!
ఆ పతి జడలను నిమరగ
వాపోయెన్ దా తదుపరి వలపుల తఫనన్!
5. వాసకసజ్జిక:
కం. పడకన జల్లెను పూలను
జడకున్ యల్లెను విరిసిన జాజుల తీవన్!
గడియకు వాకిలి జూచుచు
యెడదన్ మిక్కిలి వగచుచు యేడీ రాడే!
6. ప్రోషిత భర్తృక లేదా ప్రోషిత పతిక:
కం. దూరపు దేశము లేగగ
కారాగారమె దలచుచు కడు దు:ఖమునన్
బారెడు జడలకు పూలను
గోరక జెలులతొ గడపెను ఘోరము గాదే!
7. విరహోత్కంఠిత:
కం. విరహపు వేదన తాపము
పరులకు జెప్పరు పడతులు పడియెడు బాధన్!
విరులను విప్పుచు జడలను
విరబోసికొనుచు విసుగున విలపించునహో!
8. స్వాధీన పతిక లేదా స్వాధీన భర్తృక :
కం. పారాణి కాళ్ళ కద్దును
ఔరా! పతికేమిసిగ్గు యసలే లేదే!
లేరీ పురమున జడలకు
బారెడు పూలను దురిమెడు భర్తలు నిస్సీ!

Wednesday, October 29, 2014

Happy Birthday My Friend

Not everyone is as lucky as me to be blessed with a friend like you. Thank you so much for coming into my life and standing by my side through thick and thin. I wish you get all that you truly deserve.


Happy Birthday My Friend.. May God Bless U with Health, Wealth and Success with more Smiles..


Sunday, October 5, 2014

మాలిక పత్రిక అక్టోబర్ 2014 సంచిక విడుదల

 Jyothivalaboju
Chief Editor and Content Head

పాఠకులందరికీ దసరా, దీపావళి శుభాకాంక్షలు. మాలిక పత్రిక అక్టోబర్ సంచిక మరిన్ని ఆసక్తికరమైన కథలు, వ్యాసాలతో ముస్తాబై మీ ముందుకు వచ్చింది..

మీ రచనలు పంపవలసిన చిరునామా: editor@maalika.org

ఈ సంచికలోని విశేేషాలు:

 1. పోతన నన్నెచోడుడు 
 2. ఆరాధ్య - 1
 3. హిమగిరి సొగసుల నేపాల్
 4. పదచంద్రిక
 5. రహస్యం
 6. మొదటి మహిళా సెనెట్
 7. తేడా (తండ్రి - కూతురు)
 8. ముఖపుస్తకాయణం
 9. ప్లానింగ్
10. మాయానగరం 8
11. కొత్తకాపురం
12. హృద్యమైన తెలుగు పద్యం

Saturday, October 4, 2014

మాలిక పత్రిక పదచంద్రిక - సెప్టెంబర్ 2014 ఫలితాలు
శ్రీయుతులు శుభావల్లభ, రెండుచింతల రామకృష్ణమూర్తి, భమిడిపాటి సూర్యలక్ష్మి, మాచర్ల హనుమంతరావు, యాడాటి కృష్ణ, బాలసుందరీ మూర్తి, కాత్యాయనీ దేవి, చెనెకల మనోహరు గార్లు ఈ సారి గడిని ఉత్సాహంగా పూరించి పంపినవారు. కూర్పరులని ఉత్సాహపరిచే రీతిలో మనోహరుగారు తప్ప మిగిలిన అందరూ అన్నీ సరిగ్గా పూరించారు.   మనోహరుగారు కేవలం ఒక్క తప్పు (గద్యకవులు బదులు వాచ్యకవులు అని రాసారు)తో పూరించారు.  అందరికీ అభినందనలు.   


Thursday, October 2, 2014

బంగారు బతుకమ్మ ఉయ్యాలో.....
ఒక స్పష్టమైన ఆలోచనా విధానాన్ని, ఆచరణను తెలియజేసేదే ఆచారం. మన నిత్యజీవితంలో చేసే విధులు, వాటిలో అంతర్లీనంగా ఉన్న ప్రత్యేక నియమాలు తరతరాలుగా ఆచరించడం వలన   మన సాంస్కృతిక విశిష్టతలు, విశేషాలు ఆచారాల పేరుతో వాడుకలో ఉన్నాయి... భారతీయుల సంప్రదాయాలు, నమ్మకాలు, ఆచారాలు ప్రాంతాల వారిగా వేరువేరుగా ఉంటాయి.  అసలు ఈ పండుగలు అనేవి ఏ విధంగా మొదలయ్యాయి? ఎందుకు జరుపుకోవాలి? అని ఆలోచిస్తే మత సంబంధమైన ఆచరణగా మొదలై ఆ తర్వాత ప్రజల ఆనందం కోసం ఆచరించే పండుగలయ్యాయి. అదే విధంగా తమ కోరికలు తీరడానికి, ఆ దేవుడిని తమ శక్తి మేరకు పూజించుకోవడానికి కూడా ఎన్నో పండుగలు జరుపుకుంటున్నారు.  ఈ పండుగలను జాతీయ స్థాయిలో , రాష్ట్రస్థాయిలో జరుపుకునేవి వేరువేరుగా ఉంటాయి.  తెలంగాణ ప్రాంతంలో /రాష్ట్రంలో   జరుపుకునే  బతుకమ్మ పండుగకు కూడా ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత, నమ్మకం, విశిష్టత ఉంది. బతుకమ్మ పండుగ పూర్వాపరాల్లోకి వెళితే పురాణాలకు సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది.  దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించి , అలసిపోయి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమినాడు స్పృహకోల్పోతే ఆమెను మేల్కొలపడానికి స్త్రీలందరూ బతుకమ్మా అని ప్రార్ధిస్తూ పాటలు పాడతారు. దశమిరోజున ఆ దేవి తేరుకుంటుంది. ఆమె బతికిన రోజును బతుకమ్మగా కొలుస్తున్నారు. అదే ఆచారంగా మారిందని అంటారు... ఆరుద్రగారు  సమగ్రాంధ్ర సాహిత్యం 12వ సంపుటిలో కాకతీయుల యుగంలో రెడ్డిరాజుల కాలంలో బతుకమ్మ పండుగ జరుపుకునేవారని తెలిపారు. కాకతీయుల వంశస్ధురాలైన రాణీ రుద్రమదేవి కాలంనాటిది బతుకమ్మ కథ అని కూడా అంటారు. శత్రురాజులతో జరిగిన యుద్ధంలో రుద్రమదేవిని కాపాడడానికి ఒక యువతి అడ్డుపడి తన ప్రాణాలను కోల్పోయింది. అందుకే అమె పేరుమీద బతుకమ్మ పండుగ చేసుకుని ఉండవచ్చు.. అంతే కాదు శీతాకాలపు తొలిదినాలలో వచ్చే ఈ పండుగ సమయానికి వర్షాల వల్ల  వాగులు చెరువులు నిండి , ప్రకృతి అంతా రంగు రంగుల పువ్వులతో కలకలలాడుతూ ఆహ్లాదకరంగా ఉంటుంది.  ఈ కాలంలో గునుగుపూలు,తంగేడు, బంతి , చామంతి, గోరింట మొదలైన పూలు విరగ కాస్తాయి. ఈ పూలనే సేకరించి, అందంగా బతుకమ్మగా పేర్చి ఆడవాళ్లంతా  ఆడిపాడి సంబరాలు జరుపుకుంటారు. ఆశ్వయుజ మాసంలో శుద్ధ పాద్యమి నుండి నవమి వరకు శరన్నవరాత్రులతొ పాటు వైభవంగా జరిపేది బతుకమ్మ పండుగ, ఈ పాడ్యమికి ముందు భాద్రపద బహుళ పంచమి నుండి అమావాస్య వరకు తొమ్మిది రోజులు జరుపుకునేది బొడ్డెమ్మ పండుగ.  ప్రతి రోజు సాయంత్రం ఇంటిముందు కల్లాపు జల్లి , ముగ్గులు పెడతారు . తరవాత పేడతో గొబ్బెమ్మలు చేసి వాటికి పసుపు, కుంకుమ,పూలు పెట్టి వాకిట్లో ముగ్గు మధ్యలో పెట్టి చుట్టుపక్కల ఉన్న పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళందరూ కలిసి చప్పట్లు కొడుతూ ,పాటలు పాడుతూ చుట్టూ తిరుగుతారు.  ఈ బొడ్డెమ్మను ధాన్యపు రాశిగా, కుప్పగా కూడా భావిస్తుంటారు. మహాలయ అమావాస్య  లేదా పెత్తర అమావాస్య నుండి పువ్వులతో బతుకమ్మను పేర్చి ప్రతిరోజు ఆడతారు. ఈ సంతోషాలకు మరో కారణం కూడా ఉంది. ఆ నాటికి మెట్టపంటలన్నీ ఇంటికి చేరి ధాన్యలక్ష్మి నట్టింట కళకళలాడుతూ ఉండదంతో అందరూ సంతోషంగా ఈ బతుకమ్మ పండుగ సంబరాలు జరుపుకుంటారు. ప్రకృతితో మమేకమై ఎల్లెడలా ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచే ఈ బతుకమ్మ పండుగలో మరో ముఖ్యమైన అంశం పాటలు,
బొడ్డెమ్మ లేదా బతుకమ్మ ఆడేటప్పుడు ఆడవాళ్లు పాడుకొనే పాటలు చాలా ఉన్నాయి.  ఇవి అలాంటిలాంటి పాటలు కావు నీతి కథలు, జానపద కథలు, కొత్త పెళ్లికూతురుకు చెప్పాల్సిన విషయాలు, కిటుకులు, ఆడవారి కష్టాలు ఇలా ఎన్నో ఉంటాయి. ఈ బతుకమ్మ పాటలు  మామూలు పాటల్లా కాకుండా చిన్న చిన్న ఇతివృత్తాలు, పురాణ గాధలతో సాగుతూ   ఉయ్యాల, వలలో, గౌరమ్మ, చందమామ, కోల్ మొదలైన పల్లవులతో ఉంటాయి.
ఈ బతుకమ్మ పండుగ నాటికి ఇంకా వర్షపు జల్లులు కురుస్తూనే ఉంటాయి.   ఈ జల్లులు కూడా సన్న మల్లెలు, బొడ్డుమల్లెలుగా కురిసాయని ఎంత అందంగా పాడుకుంటున్నారో..
చిన్నంగ సన్నంగ వలలోజల్లూలు కురవంగ వలలో
ఏ రాజు కురిపించే వలలోఏడు గడియెల్లు వలలో
సన్న మల్లెల్లు కురిసే వలలోబొడ్డుమల్లెలు కురిసే వలలో..
బతుకమ్మ పండుగానాటికి ధాన్యరాశులు ఇంటికి చేరతాయి కదా. ఆ ముచ్చట కూడా బతుకమ్మ పాటలో పంచుకుంటారు.
అనుముల పండే మిమ్మీరి బండిగట్టు రామన్న
పెసర్లు పండే మిమ్మీరు బండ్లు గట్టు రామన్న
పెళ్లికాని అమ్మాయిలు తమకు తొందరగా పెళ్లి కావాలని ఆ గౌరమ్మని వేడుకుంటూ ఇలా పాడుకుంటారు.
మాలుమర్తి మేడమీద చందమామ...  వెండియ్యా వెనగరలు చందమామ
మంచినీళ్ల బావి పక్క చందమామ...  మంచి మల్లెతీగె బుట్టె చందమామ
కోసేవారు లేక చందమామ...  కొండెత్తు పెరిగిపాయె చందమామ
ఇందులో అందమైన ఒక మేడలో మల్లెతీగలా సుకుమారి ఐన కన్య ఉండి. కోసేవారు లేక కొండెత్తు పెరిగిపోయిన మల్లె తీగలాగా పెళ్లి కాని ఆ అమ్మాయి కూడా పెరిగి ముదిరిపోయిందని చెప్తున్నారు.
ఒకే ఊరికి ఇద్దరు అక్క చెల్లెల్లను పెళ్లి చేసి పంపి వారి అన్న చూసిపోవడానికి తీరడంలేదనే భావనను వ్యక్తం చేసే ఈ పాట ప్రతీచోట వినిపిస్తుంది
ఇద్దరక్క చెల్లెండ్లు ఉయ్యాలో ఒక్కూరికిస్తె ఉయ్యాలో
ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న పోడు ఉయాలో...
ఆడపిల్ల మీద పుట్టింటిలోని సభ్యులకు ఉండే ఆప్యాయతానురాగాలు, అసూయా ద్వేషాలను కూడా ఈ పాటలో వ్యక్తపరుస్తున్నారు. అత్తవారింటినుండి తల్లిగారింటికి వచ్చిన కన్నబిడ్డను తల్లి అక్కున చేర్చుకుని  తన చీరల్లో నచ్చింది కట్టుకోమంటే తండ్రి  ఎక్కువరోజులు ఉండమంటాడు. అన్న కానుకలు తీసుకుని వెళ్లమంటే,  పరాయింటినుండి వచ్చిన వదిన మాత్రం వెళ్లిపొమ్మని అంటుంది. పెళ్లి తర్వాత ఆడపిల్లకు అత్తిళ్ళే సర్వస్వం. అది దాటి వస్తే పుట్టింట కూడా తక్కువ చూపు చూస్తారన్న భావన ఈ పాటలో కనిపిస్తుంది.
అమ్మ ఏమన్నదే ఉయ్యాలో.. ఓ రామ చిల్క ఉయ్యాలో
అమ్మ అంచూ చీరె కట్టుకుపొమ్మంది ఉయ్యాలో
అన్న ఏమన్నడే ఉయ్యాలో ఓ రామ చిల్క ఉయ్యాలో...
తెలంగాణలో మిక్కిలి ప్రచారంలో ఉన్న మరో పాట "ధర్మాంగుని పాట". చోళదేశాన్ని పాలించిన రాజు ధర్మాంగుడు. అతని భార్య సత్యవతి. వారికి వందమంది కొడుకులు ఉన్నా పుత్రశోకం తప్పలేదు. చివరికి లక్ష్మీదేవినే కుమార్తెగా జన్మించాలని కోరగా ఆ తల్లి అనుగ్రహించించింది. దేవతలు, మునులు, బుషులు ఆ  బిడ్డను బ్రతుకమ్మగా దీవించారు. విష్ణువు చంక్రాంకుడనే రాజుగా వచ్చి బ్రతుకమ్మను పెళ్లి చేసుకున్నాడు.
శ్రీలక్ష్మిదేవియం ఉయ్యాలో సృష్టి బతుకమ్మాయె ఉయ్యాలో
పుట్టినారీతిజెప్పె ఉయ్యాలో భట్టు నరసింహకవి ఉయ్యాలో
ధరచోళదేశమున ఉయ్యాలో ధర్మాంగుడనురాజు ఉయ్యాలో ...
తెలంగాణ ప్రాంతంలో అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తారు. అలాగే బతుకమ్మను కూడా తమ సొంత బిడ్డలాగే వీడ్కోలు పంపిస్తారు. పుట్టింటినుంది తిరిగి వెళ్లే బిడ్డకు కానుకలు, వంటకాలు ఇచ్చినట్టే బతుకమ్మను కూడ దుర్గాష్టమినాడు సాగనంపుతూ సద్దులు చేసి సద్దుల బతుకమ్మంగా జరుపుకుంటారు. ఆమెను సాగనంపుతూ
తంగేడు పూవుల్లా చందమామ... మల్లెనండొస్తవు చందమామ
గునిగీయ పూవుల్ల చందమమ.. బత్కమ్మ పోతుంది చందమామ
బతుకమ్మ పండుగ సామాజిక ఐక్యతను పెంపొందిస్తుంది. ఇతర రోజులలో ఒకరికొకరు కలవని ఆడవారు ఈ బతుకమ్మ పండగకోసం తొమ్మిది రోజులు పదులు, వందల్లో కలిసి సంతోషంగా ఆటలాడి పాటలు పాడి ఒక్కచోట చేరతారు.  ఈ బతుకమ్మ పాటల్లో పౌరాణిక, చారిత్రక, దేవతా సంబంధమైన, అనుబంధాలు, ఆచార సంబంధమైన గేయాలెన్నో వాడుకలో ఉన్నాయి.
శ్రీరాముని తల్లి ఉయ్యాలో...  శ్రీమతి కౌసల్య ఉయ్యాలో
ప్రేమతో శాంతను ఉయ్యాలో...  పిలిచి దగ్గరకు తీసి ఉయ్యాలో
అంటూ కౌసల్యాదేవిని స్మరిస్తూ ఆడపిల్లాలు ఎలా పెరగాలి, అత్తింట్లో మెలగవలసిన విధానం, బరువు బాధ్యతలను పాట రూపంలో చెప్పుకొస్తారు.   స్త్రీల మనస్తత్వం  ఈ పాటల రూపంలో బయటపడుతుంది. వారి కష్టసుఖాలను, ముచ్చట్లను కూడా పాటల ద్వారా చెప్పుకుంటారు. దినమంతా శ్రమించిన స్త్రీలు లయబద్ధంగా ఆడే , పాడే ఈ బతుకమ్మ ఆట ద్వారా శారీరక వ్యాయామం, మానసికానందం లభిస్తుంది. ఈ పాటలను ఏ కవీ రాయలేదు. ఏ గాయకుడూ స్వరాన్ని సమకూర్చలేదు. స్త్రీలు తమంతట తామే తమ ముచ్చట్ళు, ఆలోచనలు, ఆవేదనలు మొదలైన విషయాలను పాటల్లా మార్చుకుని పాడుకుంటారు. అవి అలా అలా ప్రచారంలోకి వెళ్లిపోతాయి.
బతుకమ్మ పాటల్లో ఆచారాలు, సుద్దులే కాక కొలతలు కూడా ఉంటాయి
గిద్దెలు ముత్యాలు వలలో...  గిలికినా కొలిమి వలలో
అరసోల ముత్యాలు వలలో...  అమరినా కొలిమి వలలో
తవ్వెడు ముత్యాలు వలలో...  తరచినా కొలిమి వలలో
శ్రీకృష్ణ లీలలు కూడా బతుకమ్మ పాటలుగా రూపాంతరం చెందాయి.
కస్తూరి రంగ రంగ ఉయ్యాలో .. కావేటి రంగరంగా ఉయ్యాలో
శ్రీరంగ రంగా ఉయ్యాలో...  నిను బాసి ఎట్లుందురా ఉయ్యాలో
కంసున్ని సంహరింప ఉయ్యాలో...  సద్గురుడు జన్మించెను ఉయ్యాలో
దేవకి గర్భంబున ఉయ్యాలో...  కృష్ణావతారమెత్తెను ఉయ్యాలో...
తెలంగాణ ప్రాంతంలో జరుపుకునే కొన్ని పండుగలు హిందూ ముస్లీముల సఖ్యతను, మతసామరస్యాన్ని తెలియజేస్తాయి. ముస్లీములు జరుపుకునే పీర్ల పండుగ సంబరాలలో హిందువులు కూడా పాల్గొంటారు. కొన్ని ముఖ్యమైన దర్గాలకు హిందువులు కూడా భక్తి శ్రద్ధలతో దర్శిస్తారు. మొక్కులు కోరుకుంటారు. మిర్యాలగూడ దగ్గరున్న జానపాడు దర్గాలో మొక్కుతూ
అన్నన్న సైదన్న ఉయ్యాలో...  జానపాడు సైదన్న ఉయ్యాలో
నీ దర్గ చుట్టున్న ఉయ్యాలో..  ఏమి వనమన్నయ్య ఉయ్యాలో...
స్త్రీలు తమ సౌభాగ్య, సంసార, సంతాన సౌఖ్యాలకోసం వివిధ నోములు, వ్రతాలు చేస్తుంటారు. క్రమంగా అవి ఆచారాలుగా  మారాయి. అలాంటి ఒక వ్రతం సంతోషిమాతా వ్రతం. ఈ వ్రత మహత్యాన్ని బతుకమ్మ పాటగా మలిచారు.
కలదొక వ్రతము ఉయ్యాలో...  కోరికలు దీర్చునది ఉయ్యాలో
కష్టము లేదు ఉయ్యాలో...  ఖర్చు ఎక్కువ కాదు ఉయ్యాలో
మీరు కోరిన దేవి ఉయ్యాలో...  ఈమె సంతోషిని ఉయ్యాలో

అదే విధంగా నీతి కథలు, పురాణాలు కూడా పాటలుగా మారాయి. సత్య ప్రభావాన్ని నేటి తరానికి, ప్రతీ తరానికి సులువుగా అర్ధమయ్యేలా సత్యహరిశ్చంద్రుని కథను బతుకమ్మ పాట రూపంలో చెప్తున్నారు.
సత్య హరిశ్చంద్రుని ఉయ్యాలో.. కథను వినగా రండి ఉయ్యాలొ
మాట తప్పని ఉయ్యాలో...  మా మంచి రాజు ఉయ్యాలో
ప్రాణము పోయినా ఉయ్యాలో...  బొంకనివాడే ఉయ్యాలో
బతుకమ్మ పాటల్లో శృంగార రసపోషణ, హాస్య రస పోషణ కూడా కనిపిస్తుంది. గంగా గౌరీ సంవాదంలో తన ఇంటికి వచ్చిన గౌరిని చూసి గంగమ్మ చేసే మర్యాద ఇలా ఉంటుంది
గౌరమ్మ రాకడ ఉయ్యాలో...  గంగమ్మ చూసి ఉయ్యాలో
పచ్చి చేపలు తెచ్చి ఉయ్యాలో...  పందిళ్లు వేసి ఉయ్యాలో
ఎండు చేపలు తెచ్చి ఉయ్యాలో... తోరణాలు కుచ్చె ఉయ్యాలో...
చిన్న చిన్న పదాలతో ఎంతో సారాన్ని ఇముడ్చుకున్న సామెతలు కూడా బతుకమ్మ పాటల్లో  విరివిగా కనిపిస్తాయి. బతుకమ్మ పండుగ, ఆట, పాటలు తెలంగాణ స్త్రీల ఆచార వ్యవహారాలు, సంగీత, సాహిత్య పరిజ్ఞానాలకు ప్రతిబింబాలు. వ్యవసాయదారుల వెతలు, జీవితానుభవాలు కూడా పాటలుగా మారాయి. తెలంగాణ ప్రాంతం ఎక్కువ కాలం నిజాం పరిపాలనలో ఉండడం వల్ల ఈ బతుకమ్మ పాటల్లో అక్కడక్కడ ఉర్దూ పదాలు కూడా కనిపిస్తాయి.
బతుకమ్మ పాటల్లోని పౌరాణిక, సామాజిక, సాంస్కృతిక విశేషాలను, పరిశోధనాంశంగా తీసుకుని శ్రీమతి బండారు సుజాతగారు విశేషంగా కృషి చేసి, పరిశోధన చేసి వివిధ ప్రాంతాలు, పల్లెలలోని బతుకమ్మ పాటలను సేకరించి పి.హెచ్.డి పట్టాను పొందారు.

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008